ప్రేమకు ప్రతిరూపం
ప్రేమకు ప్రతిరూపం
అండమందు వుండగనే
నీవొక అండ పిండ బ్రహ్మాండాన్నేలే..బ్రహ్మాండమని
అండ దండగ ఉంటూ..
నీ కండ పెరిగే వరకూ
తన కండలు కరిగిపోతున్నా..నిండుగ నిలబడి..
తనను తాను దహింప జేసుకొనే జ్వాల..అమ్మ
ఇంతింతై వటుడింతై అన్నట్లు
అండం దిన దినాభివృద్ధి చెంది..
బండగా మారుతున్నా
అదరక..బెదరక తానొక కొండగ మారి
తన ఊపిరితో నీకు ప్రాణమ్ము పోసి
తన రక్తంతో నీ బొమ్మ గీసి
తన గుండె చప్పుడుతో..
అనుక్షణం నీకు కాపలా కాసి
తన ఆహారాన్ని రెండు ముక్కలుగ చేసి
నీ రాకకై కన్నులు కాయలు కాచేల ఎదురు చూసి
తన తలపుల ప్రపంచం లో..
నీ తల రాతను రాసే..అందాల రాశి...అమ్మ
తన తనువును ఇతరులకు చీల్చి ఇచ్చే
తరువే..త్యాగమునకు గురువైతే
తెలిసి తెలిసి తన తనువులోని అణువణువునీ
మనకొరకు మహదానందంగా ఇచ్చే
అమ్మని ఏమనాలి?
అమ్మా అమ్మా..
నొప్పి కలిగితే అమ్మ..బొప్పి కడితే..అమ్మ
నవ్వి నవ్వి.. అలసిపోతే..అమ్మ
హాయిలోనూ..బాధలోనూ..
వేడుకలోనూ... వేదనలోనూ
అందలంలోనూ..అగాధంలోనూ
ఆది లోనూ.... అంతం లో
నూ
నిన్ను తలవని..పిలవని క్షణమ్ము లేదమ్మా
అబ్బ! ఏం వరం పొందావమ్మ!
కానీ ఎంత విచిత్రమో కదా
మన ఎదుగుదలకు..తన ఎదను వేదిక చేసిన అమ్మను
అత్యానందంలో.. అత్యావేదనలో తప్ప
జీవన ప్రయాణంలో మనతో లేకుండా
చేసుకునేంత ఎత్తుకు ఎదిగిన మూర్ఖులం మనం
ఎంత చిత్రమో కదా!
ఎవరెవరితో నో..
కాల్ చేసి కబుర్లు చెప్పే నీకు
జీవిత కాలాన్ని ఇచ్చిన కమ్మని అమ్మకు
కాల్ చేసే కాలం నీకు లేకపోవడం..
ఎంత చిత్రమో..కదా!
చిత్ర విచిత్రాలును చేసింది చాలు
అణువంతున్న నిన్ను
అద్భుత చిత్రంగా మలిచిన అత్యద్భుత చిత్ర కారిణి
అమ్మకు
ఈ సృష్టి కోసమే తన జన్మనిచ్చిన అమ్మకు
ఏమిద్దం..ఏమిస్తే..అమ్మ కు
సంతోషమో...అలోచిచండి ఆచరణలో పెట్టండి
ప్రేమకు ప్రతిరూపమైన ప్రతి అమ్మ
త్యాగానికి టాగ్ లైన్ అయిన ప్రతి అమ్మ
సహనానికే సందేశమివ్వగల ప్రతి అమ్మ
ప్రపంచానికి పురుడు పోస్తున్న ప్రతి అమ్మ
ఇవే మా ప్రణామాలమ్మ
..రాజ్ తొర్లపాటి..