ప్రతి రోజూ
ప్రతి రోజూ
ఒక మృతదేహం ముందు కూర్చుంటున్నా
ప్రేమతో పలకరిస్తున్నా
నవ్వుతూ ఏడుస్తూ ఒకోసారి ఆగ్రహంతో
ఊగిపోతూ ప్రశ్నిస్తున్నా
మృతదేహం నిర్జీవ కళేబరంలా కదలదు
ఉలకదు పలకదు
నాతో సంభాషించదు నన్ను ప్రేమించదు
నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోదు
ఈ ప్రపంచం మారదంటే మారదని బల్లగుద్ది చెప్పేవాళ్ళు
అసహనంతో నన్ను అవమానించేవాళ్లు
తమ హ్రుదయాలను పాషాణంలా పరివర్తించుకున్నవాళ్ళు
నా ముందు గోడలా నిల్చుంటారు
నేనిప్పుడొక రహస్య ఘటనా క్రమం కోసం చూస్తున్నా
మనుష్యుల్ని కదిలించే ప్రాణ శక్తి కోసం
శవాల్ని నిద్రలేపే వాక్య శక్తి కోసం
ఎదురుచూస్తున్నా
సూర్యోదయం కోసం కాచుకొనిఉన్నా
అరణ్యాలు ఉలిక్కిపడినప్పుడు
ఆకాశాలు సంచలితమైనప్పుడు
ఉషోదయ ఆగమనం కోసం
వైతాళికుడిలా నిరీక్షిస్తున్నా...
... సిరి ✍️❤️
