రవ్వంత
రవ్వంత
చెదరనీకు నాదృష్టి..కదలనీకు రవ్వంత..!
నీ పదముల పైనుండి..జరగనీకు రవ్వంత..!
భక్తి ఎలా ఉండునో..ప్రేమ అర్థ మేమిటే..
ఏ మాటల ఊటనో..మరగనీకు రవ్వంత..!
ఎంతబతుకు తీపిరో..వేదనెంత మధురమో..
ఈ పెదవిని ఏవేళ..తొణకనీకు రవ్వంత..!
హాయి దొరుకు చోటనగ..ఉందెచ్చట జగతిలో..
వెతికేయగ నా మదిని..వెళ్ళనీకు రవ్వంత..!
ఆలోచన రూపమే..చూడలేని తనమేమి..
మౌనపు గది గడపనే..దాటనీకు రవ్వంత..!
అల్లుకున్న తీగతో..మోహమెంత బంధమో..
చిత్రసీమ మాయలో..చిక్కనీకు రవ్వంత..!
