మౌన పోరాటం
మౌన పోరాటం
లోకపు పాడుమనసును మాటలతో చెప్పలేను,
ప్రేమరాగాన్ని
అపశ్రుతితో ఆలపించలేను,
నవ్వులపాలు చేసిన
తనువు ఆరటాన్ని వివరించలేను.
ఆశల వీధిలోని ప్రేమరుచుని
ఇష్టంగా స్వీకరించాను,
హృదయంలోని దేవుడిని
మమతల మంత్రంతో పూజించాను,
రంగుల లోకపు మోసాలను
అశ్రువుగా మార్చుకోలేకున్నాను,
బాధలను మరిపించే మౌనంతో స్నేహం చేస్తున్నాను.
అరిటాకు లాంటి
అతివ బ్రతుకున
మంచిచెడు ఏదైనా
కాలంతోటే తేల్చుకుంటాను,
అనుభవాల గాయాలను
ఓదార్పుల లేపనంతో మాన్పలేను,
విలువ కోల్పోని
సహచర్యపు మాధుర్యంకై మౌనపోరాటమే చేస్తాను,
ప్రేమంటే ఏమిటో తెలిపే
ముచ్చటే అపురూపమంటాను,
మనసులోని శోకాన్ని
మౌనంతో అధిగమించి
మౌనపు హృది గొప్పతనం
లోకానికి చూపుతాను.
