కళ్యాణం
కళ్యాణం
కలిసిబ్రతుకు ప్రమాణాలు..తీసుకోగ కళ్యాణం..!
సంసారపు పరమార్థం..అందుకోగ కళ్యాణం..!
అనుబంధపు లోగిలిలో..అనురాగపు సరాగాలు..
మధురమైన యుగళగీతి..అల్లుకోగ కళ్యాణం..!
ఇరుమనసులు ఏకమయే..సరదాలే తీరిపోగ..
తీపి కలలు సాకారం..చేసుకోగ కళ్యాణం..!
చెలిమిపూల మధుశాలయె..పాఠశాల పానశాల..
నిత్యమైత్రి దివ్యప్రేమ..పంచుకోగ కళ్యాణం..!
కన్నులతో భాషిస్తూ..మౌనములో నివసించగ..
తిరుగులేని శ్వాసవిద్య..నేర్చుకోగ కళ్యాణం..!
సంప్రదాయ మేదైనా..సుఖశాంతుల పొందికకే..
అవగాహనా కుశలత..పెంచుకోగ కళ్యాణం..!
