అక్షరాలు
అక్షరాలు
నేను అక్షరాలను మేల్కొలుపుతానో
నన్ను అక్షరాలు మేల్కొల్పుతాయో చెప్పలేను
రాతతోనో, నోటితోనో వాటిని స్మరిస్తా
నన్ను తీర్చిదిద్ది, దారి చూపినవి, దారిలో పడేసినవి
నాకు గుర్తింపు తెచ్చినవి అవే
వేకువ జామున నిద్రలేవటం గంట కొట్టినట్లైంది
ఎవరో తట్టి లేపినట్లు మనసు కీ ఇస్తుంది
దినచర్య ఎన్ని ఒడిదొడుకులతో నడిచినా
ఆనందాల అందాల మత్తు చవిచూసినా
గుప్పెడంత గుండె గతి తప్పకుండా లేపుతది
యోగశిక్షణతో శరీరం కసరత్తు
ఆ దినానికి అమృత తీర్థం తాగడం
వార్తల పిట్ట చేతుల్లో పడగానే
రకరకాల భావ పరిమళాలు విచ్చుకుంటాయి
రాజగాయాలు, నేరాల ముళ్ళు గుచ్చుకుంటాయి
విశ్లేషణలకు కొద్దిగా విరామమిచ్చి
పల్లెల నుంచి, పట్నాల నుంచి, ప్రపంచం దాకా
వార్తల వాతలే ఎక్కువ, పుష్పాల సుగంధాలు తక్కువే
ఎప్పటి వార్తలు అప్పుడే ఆన్ లైన్ లో ఊరేగుతున్నా
దినపత్రికలో మునిగి తేలడం అదో కిక్కు
కాలం వాగులో కాగితప్పడవలేసినట్లు జీవితం
రోజు గడవడమంటే నవలలో అక్షరం మారినట్లు
అక్షరాలను అర్థవంతంగా చేసినట్లే రోజు జీర్ణమైతే
గల్లాలెగరేయని ఆత్మసంతృప్తి
మరుసటి రోజుకు మరింత కసరత్తు
