ఓ నది కన్న కల
ఓ నది కన్న కల
పుణ్యమంటిరి… పుష్కరమంటిరి
మీ పాపాలన్నీ నాకు అంటగట్టిరి
పవిత్రమంటిరి… ప్రధానమంటిరి
నన్ను అపవిత్రం చేస్తిరి
మీ ప్రాణాలను నింపుతూ ఉంటే
నాలో విషాన్ని నింపిరి
మీ బతుకులకు అర్థాన్నిస్తే
నాలో వ్యర్థాన్ని పోస్తిరి
సిరిసంపదలు, పాడిపంటలు మీకిస్తే
కర్మాగారాల కలుషితాలు నాకిచ్చిరి
కాలుష్యంతో నా ఒడిని నింపిరి
మీ దాహార్తిని తీర్చే
నా అన్నార్తిని వినలేరా?
మీ క్షుద్బాధను బాపే
నా గుండె బాధను కనలేరా?
రావణుడి చెరలో బందీ అయిన సీతను నేను
అసురుల చేతిలో ఆక్రమణకు గురైన స్వర్గాన్ని నేను
నా దారికి అడ్డు వచ్చి
నా మార్గాన్ని మళ్లిస్తున్నా
యంత్రాల ఇనుప చేతులు గుండెల్లో గుచ్చి
ఇసుక మాంసాన్ని తోడుతున్నా
లోపల ఎంత బాధ దాగున్నా
మౌనంగా సాగుతున్నా
కన్నీరు ఎంత కారుతున్నా
అలుపెరుగక పారుతున్నా
ప్రళయాన్ని చూస్తిరి
విలయాన్ని చూస్తిరి
కరువును చూస్తిరి
వరదలను చూస్తిరి
అయినా మారరు మానుకోరు పద్ధతి మార్చుకోరు
నదిని నేను — మీ జీవనదిని నేను
నాకు జీవాన్నివ్వండి
నదిని నేను — మీ ప్రాణపదిని నేను
నా ప్రాణాన్ని నిలపండి
ఉనికి కోల్పోతున్న నాకు,ఊపిరి పోయండి…
