కవిత్వం తీరని దాహం
కవిత్వం తీరని దాహం


కనులకు కనిపించే ప్రకృతి
కమనీయ దృశ్యం
కలాన్ని నాట్యం చేయిస్తూ..
నవరసాల హావ భావాలతో..
విలక్షణ నాట్య భంగిమలతో..
కవితా నాయకిని
కదిలించే కమనీయానుభూతి
చెరగని చిరునవ్వై
పాఠకుల హృదయాంతరాళాలలో
పులకాంకితమై..
వెల్లి విరియాలి
ప్రళయాగ్ని జ్వాలలూ..
కారు మబ్బులూ..
కధన రంగమూ..
కాల ప్రవాహం
కాదేదీ కవితకనర్హమంటూ
కవన వేగం రాకెట్టు మాదిరి
అంతరీక్షాన దూసుకుపోవాలి
ఉపగ్రహ చలనమై
విశ్వాన్నంతటినీ చుట్టి
అజేయంగా
ప్రతి హృదయంలో
నిశ్చల స్థానం పొందాలి
లోన పంచ భూతాలు
పైన పంచ భూతాలలో
కలిసిపోయే
కొన ఊపిరి వరకూ
ఊహల జలాలు చాలవులే!
కవిత్వ దాహం తీరదులే!
*కాదంబరి శ్రీనివాసరావు*