STORYMIRROR

kvss ravindranath tagore

Fantasy

4  

kvss ravindranath tagore

Fantasy

సెప్పవయ్యా... శివయ్యా

సెప్పవయ్యా... శివయ్యా

1 min
438

బైరాగిశా! భోళా శంకర

జాబు ఇచ్చే వేలైనాది, మేలుకో

ఓ యోగిశా! మా రమణేశా

అమ్మ వేచి కూసుంది,యేలుకో

బైరాగిశా! ఓ యోగిశా!!


ఇంట్లో కాదని నువ్వే దిక్కన్న

సతికి పతివి అయిపోతివి

పేరంటానికి పోదాం అంటే

తోడు రాక ఒంటిగా పోనిస్తివి

కళ్ళు మూసి నిద్దురలో ఉంటే

యాగంలో తానే మన్నయ్యింది

సెప్పవయ్యా ఓ గౌరిశా, ఎందుకు

అమ్మకి తోడుగా పోలేకపోతివి

బిడ్డలని వెలితి వెలుగులో తోసేస్తివి

బైరాగిశా! భోళా శంకర

జాబు ఇచ్చే వేలైనాది, మేలుకో


ప్రేమే ఊపిరిగా ప్రాణం పోసుకుని

నిన్నే ఎతుకుతూ వచ్చింది పార్వతమ్మ

దరికి చేరి దొరగా ఏలుకోక, కలుసుకోక

పరీక్ష అంటూ దూరమెట్టి శిక్షవేస్తివి

నీ ఉనికి తనే అయినా సహనశీలి

ఆళి నిన్నే గెలిచి తాళి కట్టించుకుంది

పారాణి ఆరక ముందే అమ్మని ఒదిలి

భక్తుడి ఇంట్లో సేరి విరహంలోకి లాగేస్తివి

సెప్పవయ్యా ఓ ఉమేశా, ఎందుకు

అమ్మకి నీడగా నిలవలేకపోతివి

శివశక్తిని విరసంలో ముంచెస్తివి

బైరాగిశా! భోళా శంకర

జాబు ఇచ్చే వేలైనాది, మేలుకో


భర్త ఏమో పక్కన లేడాయే మరి

రక్షణకి, రాజ్యానికి కొడుకు దిక్కాయే

నీ కోపంగీపం సూపి సొంత బిడ్డని

దూరం సేసి తల్లి కడుపుని కోసేస్తివి

నువ్వు కన్నావా ఆ కణముల పై అధికారం

బూడిదలో పోసితివి కదా అమ్మ మమకారం

ఏవడిచ్చాడని హక్కు నీకా ప్రాణం మీద

తల్లి నుండి పిల్లల్ని వేరుసేసే రాతని రాసేస్తివి

సెప్పవయ్యా ఓ భవేశా, ఎందుకు

నాన్న అంటే పలుకుతూ స్మశానంలో ఉంటివి

బైరాగిశా! భోళా శంకర

జాబు ఇచ్చే వేలైనాది, మేలుకో


అంత కాదు,ఇంత కాదు ఎంతో

అన్యాయం సేసి ఏమి లెక్క లేనట్టు

నీ లోపల సగ భాగం మా అమ్మకిచ్చి

సర్దుకుంటివా మా ఆశల అర్ధనారీశా

లేక సర్దిచెప్పితివా విషయాల విశ్వేశా

బైరాగిశా! భోళా శంకర

జాబు ఇచ్చే వేలైనాది, మేలుకో

ఓ యోగిశా! మా రమణేశా

అమ్మ వేచి కూసుంది,యేలుకో

బైరాగిశా! ఓ యోగిశా!!


Rate this content
Log in

Similar telugu poem from Fantasy