నిత్యాగ్నిహోత్రంలా అప్పగింతలు
నిత్యాగ్నిహోత్రంలా అప్పగింతలు
నవమాసాల భారం
గారాలపట్టికి గారం
బుడి బుడి అడుగులేసి
గడప ద్వారం దాటితే మాత్రం
భయాల మౌనం... కన్నీటి గానం
పసి పాపడు ప్రాయానికే
అప్పగింతల ఘోరం...
అప్పగింతల ఘోరం...
నిష్కల్మష బాల్యం
అల్లరి బహు లభ్యం
పట్టీలు ఘల్ ఘల్ అంటూ
గడప ద్వారం దాటితే మాత్రం
కంగారు వైనం...కీడు స్వరం
చిరు చిటపట ప్రాయానికే
అప్పగింతల ఘోరం...
అప్పగింతల ఘోరం...
ఓణీల వయ్యారం
కొత్త హంగుల విహారం
అద్దాల వెలుగులో సింగారించుకుంటూ
గడప ద్వారం దాటితే మాత్రం
ఆటుపోటు రణం... సూటిపోటి వనం
వికసించిన విలాస ప్రాయానికే
అప్పగింతల ఘోరం...
అప్పగింతల ఘోరం...
చీర కట్టిన తాళిగుణం
మెట్టెలు మోసే భాద్య'త'నం
ఆకలి మూట కోసం పనిపాటంటూ
గడప ద్వారం దాటితే మాత్రం
సౌభాగ్య మరణం...అనాధ శాపం
తెంచబడిన పెద్దరికపు పాశాల ప్రాయానికే
అప్పగింతల ఘోరం...
అప్పగింతల ఘోరం...
ఇంకా... ఇంకా అంటూ
వడిలిపోయిన హంసల అందం
వదిలిపోయిన సరసాల చందం
బ్రతుకు కొరకు అవసరమై ఆరోగ్యమంటూ
గడప ద్వారం దాటితే మాత్రం
వాత్సల్య శోకం...ఓదార్పు లోకం
ఎండిపోతూ నీడనిచ్చే వైరాగ్య ప్రాయానికే
అప్పగింతల ఘోరం...
అప్పగింతల ఘోరం...
అమ్మా...
అక్షింతల అశ్రువులు
అక్షరాల పదనిసలు
ఆవేశాల ఉద్యమాలు
ఆలోచనల ప్రయోగాలు
కాపాడలేని లోకం నీకు బహుమతి
నీ నీడకి కూడా రక్షణ నీదే అని నా ఆర్తీ
తల్లిని చెరిచి ఏనాడో తెచ్చుకుంది ఈ నేల అపకీర్తి
భగ భగల నీ రుధిరపు కన్నీళ్లే మాలో మార్పుకి స్ఫూర్తి...