అందమైన ప్రేమ
అందమైన ప్రేమ
మనసుతో చెప్పిన ప్రేమపలుకులు
హృదయాన్ని చేరాయిలే,
వలచి పిలిచిన పిలుపుతో
ఎడబాటే దూరమాయేలే,
హృదయసీమలో కొలువైన
నారాణివి నీవేలే
సరసరాగపు శ్రుతి లయ
మనమే అవుదాము
రావేలనే.
వింత మోహలు
చిలిపి కోరికలతో
భయపెట్టకు బావయ్య,
కలలు చెదిరితే
చితిగా మారును
మన బ్రతుకయ్యా,
మనసు మురిపించే ప్రణయసిరులు
అనుబంధపు కోవెలగా మారాలయ్యా,
హృదయపీఠపు రాజుగా
మూడుముళ్ళు వేయగా రావయ్యా,
అందాక ఆగాలి
హృది దిగులు గుబులుకు స్వచ్ఛప్రేమ గొప్పతనం చూపాలి.
మాలిన్యం లేని
మమతల మారాజుగా వుంటాను,
కలతపెట్టు కోరికతో
నీదరి చేరి బాధపెట్టలేను,
బంధమై చేరి
వయ్యారాల వగలుతో చెలిమిచేస్తాను,
అనురాగపు ప్రేమదీపానికి
చమురు వత్తి మనమే అవుదాము.
ప్రేమజగతిని నడుపు
సూత్రమే మనముగా
లోకాన నిలిచిపోదాము.
