పాటగా
పాటగా
చూపుల గంధం..దక్కెను పాటగ..!
మాయని విరహం..పొంగెను పాటగ..!
పెదవిని విప్పగ..తెలియదు సఖుడా..
తియ్యని మౌనం..నిండెను పాటగ..!
నీవని నేనని..విడిగా ఎక్కడ..
అమలిన వేదం..సాగెను పాటగ..!
గమ్యం కోసం..వెతికే దేమిటి..
ఆగని గమనం..పలికెను పాటగ..!
అందెల సవ్వడి..వీనుల విందుగ..
చల్లని పవనం..మ్రోగెను పాటగ..!
మదిలో మెదిలే..మెఱుపుల మేఘం..
చిక్కని రాగం..వెలిగెను పాటగ..!
