ఒంటరి జీవితం
ఒంటరి జీవితం


పెరిగాను పదహారు వత్సరాలు అల్లారు ముద్దుగా
అమ్మానాన్నల, చెల్లీ తమ్ముళ్ళ మధ్య గారాబంగా
ఇంటి కి పెద్ద పిల్లనని, చేసేశారు నా పెళ్ళి త్వరగా
చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నాపై పెట్టారుగా
ఇంటికి పెద్ద కోడలినని బాధ్యతలన్నీ నావన్నారు
పెద్దలకు గౌరవమిచ్చి పిన్నలను మన్నింపమన్నారు
పిల్లల లాలన కన్నా ఇంటి పనులే ముఖ్యమన్నారు
ఇంటి బాధ్యతలను అప్పగించి పెద్దలు వెళ్ళిపోయారు
బాధ్యతలన్నీ తీరి నా సంసారం నాకు మిగిలింది
ఇంతలో నా భర్త ఆరోగ్యం నన్ను కలవరపెట్టింది
కాన్సర్ మహమ్మారి ఆయనను వెంట తరిమింది
నా భావి జీవితం నాకు అగమ్యగోచరం అయింది
జీవితాంతం తోడుంటానన్న భర్త విడిచి వెళ్ళారు
ఏ ఆధారం చూపకుండా ఆయన వదిలి పెట్టారు
మా కర్మకి మమ్మల్ని నడిరోడ్డున వదిలి పోయారు
నలభై ఏళ్ల కే వితంతువుని, అన్న ముద్ర వేశారు
పెళ్ళి కాని పిల్ల, చదువు తున్న కొడుకు మిగిలారు
పెళ్ళి కైనా, చదువుకైనా డబ్బులిచ్చే వారెవరు
చదువు లేని నాకు ఉద్యోగం ఇచ్చేది ఎవరు
ఆదాయం లేని మా కుటుంబాన్ని సాకేది ఎవరు
చదువు లేకున్నా లౌక్యంతో పిల్లలను సాకుతున్నా
ఎవరినీ దేవిరించక నా మానాన నే బతుకు తున్నా
అయినా ఈ లోకం నన్ను బతక నీయడం లేదన్నా
సూటి పోటి మాటలతో హింసిస్తూనే ఉంటుందన్నా
నానా రకాలుగా పాట్లు పడి ఆడపిల్ల పెళ్ళి చేశాను
వండీ వండక, తినీ తినక కొడుకుని చదివించాను
ప్రయోజకుడై, ఉద్యోగస్తుడైతే చాలనుకున్నాను
ఉద్యోగం లో చేరాక కోరిన పిల్లతో పెళ్ళి చేసాను
సొంత గూటికి, రెక్కలొచ్చిన పక్షి ఎగిరి పోయింది
ఒంటరిగా ఈ రెక్కలు తెగిపోయిన పక్షి మిగిలింది
ఏనాడో ఒంటరిని చేసి విధి ఏకాకిగా బతకమంది
తోడే లేని నాకు ఒంటరి జీవితం అలవాటైపోయింది