నవ్వితే ఏమి పోయింది
నవ్వితే ఏమి పోయింది
కల్మషాల కాసారంలో
కుళ్ళు కపటాల విషవలయంలో
పెనవేసుకుపోతున్న నయవంచనల సాంగత్యంలో
మలినమైపోతున్న మనసులు
మసిబారిపోతున్న నేపథ్యంలో
వెన్నెల వెలుగులు చిమ్మే వెండి నవ్వులు
చీకటి తెరలలో దోబూచులాడుతున్నాయి..!
నీ ఎదుగుదలను ఓర్వలేక కన్ను కుట్టుకునేవాణ్ణి చూసి
నవ్వితే ఏం పోయింది.. మహా అయితే ఒక నవ్వేగా
ఖర్చు లేని పని.
నీ పాండిత్యానికి పరవశింపక రంధ్రాన్వేషణ చేయువానిని జూసి
నవ్వుకో ఏం పోయింది ఒక నవ్వేగా
నీకొచ్చిన లోటేంటి..
నీ గానకళను ఆస్వాదించలేని
దురభిమానిని చూసి గుంభనంగా నవ్వితే పోయేదేముంది.. నీకు తరిగేదేముంది.
నవ్వడమొక యోగమని నవ్వించడమొక భోగమని
నవ్వకపోతే రోగమన్న పెద్దలమాట
చద్దిమూట కాదొకో..!
నలుగురితో పంచుకుంటే నవ్వు పెరుగుతుంది
నవ్వు నవ్వుని పంచుతుంది పెంచుతుంది
నవ్వితే నవ్వించితే పోయేదేముంది...!!
