"నా కోపం"
"నా కోపం"
నాకు కోపమెక్కువ...!
అలసిపోతున్న ఆశ మీద, ఆగిపోతున్న ఆశయం మీద, తెగిపోతున్న బంధం మీద, వీగిపోతున్న విజయం మీద,
ఆ కోపం..!!
నాకు కోపమెక్కువ...!
కరిగిపోతున్న కలల మీద, కడతేరుతున్న కళల మీద,
సాగిపోతున్న సమయం మీద, సాగిలపడుతున్న సత్తువ మీద,
ఆ కోపం..!!
నాకు కోపమెక్కువ...!
దారితప్పిన దిక్కుల మీద, గాడితప్పిన గమనం మీద,
మూగబోయిన మాటల మీద, మోడుబోయిన మనసు మీద,
ఆ కోపం..!!
నాకు కోపమెక్కువ...!
పెరుగుతున్న పక్షపాతాల మీద, పేరుకుపోతున్న కుట్రల మీద,
ఓడిపోతున్న ఓపిక మీద, సన్నగిల్లుతున్న సహనం మీద,
ఆ కోపం..!!
నా కోపం..!!
ఈ సిగ్గులేని సమాజంపై వేదనతో విరుచుకుపడుతున్నదే కానీ,
ఈ పనికిమాలినపు ప్రపంచంలా ద్వేషంతో నిండినది కాదు.
నా కోపం..!!
అర్ధం చేసుకునే వారికి వెలుగును పంచే దారి,
అర్ధం కానివారికి గమ్యాన్ని చూపలేని ఓ ఎడారి.
నా కోపం..!!
ఆవేదనకు అద్దం, స్వచ్ఛతకి చిహ్నం.
ఇష్టానికి సూచిక, ప్రేమకి ప్రతీక.
నా శాంతమే చేతగానితనమై నాకు రక్షణ కానప్పుడు, ఎగిసిపడే శత్రువు లాంటి ఆ కోపమే నాకు మిత్రుడైతే తప్పేంటి?
-సత్య పవన్✍️
#ADeepThinker
