కథనో..పాశవికతనో..
కథనో..పాశవికతనో..
ఇదేనేమో
నువ్వు చెప్పిన ఆఖరి రోజు
నాకు ఇచ్చిన తుది గడువు
కాలంలో కొట్టుకుపోయిన నాకు
మళ్ళీ ఓ ఒడ్డుకు తీసుకు వచ్చి మరీ
నా బలహీనతల్ని గుర్తు చేసే ప్రయత్నం
ఇంకేం మిగిలిందని రాస్తావ్ అంటూ
పుస్తకాలు చింపేసి వెళ్లావ్
ఇక మీదట రాయొద్దంటూ
ఒట్టేయించుకుని వెళ్ళావ్
తగలబడ్డ స్వేచ్ఛ
మళ్ళీ నాకు దొరికింది
ఎవరి మెప్పు కోసమో
లేదనే ముప్పు కోసమో కాదు
నన్ను నాలా జీవింపజేసుకోవాలనే ఆరాటంతో
మళ్ళీ వ్రాసాను
కొత్తగా
నిస్సిగ్గుగా నీచత్వపు మనస్తత్వాన్ని
కథల్లో చిత్రించాను
కథనో
పాశవికతనో
రేపన్న రోజున
కాల్చి పెట్టుకున్న పుట్టు మచ్చనో
నే పోతున్నా
నువ్వు గీసే బద్మాష్ గీతలన్నీ దాటి
నీ అభిప్రాయాల శిలల్ని నెడుతూ
నే పోతున్నా
ఎగసిపడే కవితా కెరటంలా ఒడ్డుకు మళ్ళీ వస్తా..
