దౌర్బల్యం
దౌర్బల్యం
శారీరిక దౌర్బల్యం గురించి ఎప్పుడూ మాట్లాడేస్తాం
కాలు నొప్పి కళ్ళ మంటలు అని అనగలం
ఓ వయసు వచ్చాక
మనసు బాగోలేదు ఈవేళ
అని ధైర్యంగా నిజమైన మిత్రుల దగ్గరే అనగలం
ఒకవేళ పొరపాటున వేరే ఎవరికైనా చెప్తే
మానసిక దౌర్బల్యాన్ని అర్థం చేసుకోరని భయం
కానీ ఒకసారి
అలాంటి మిత్రుల మాటలు విన్నాను
వెతికి తెచ్చుకున్న అల్లుడు కట్నం కోసం వేధిస్తున్నాడని
సమాజం అంటే విరక్తి వస్తోంది అన్నారొకరు
ఎంత ప్రయత్నించినా మద్యపానం మానలేక
ఎదిగిన పిల్లల దగ్గర అవమానపడే తండ్రి స్థితి మరొకరిది
గడచిన జీవితం ఇచ్చిన భయాలు
బాల్యం ఇచ్చిన వ్యథలు
ఇవన్నీ సంకోచం లేకుండా మాట్లాడేసుకోవడానికి
అర్థం చేసుకునే మిత్రులు దొరకడం వారి అదృష్టం
