చరవాణి
చరవాణి
శీర్షిక:చరవాణి
*********************
వేకువజామున లేచి అరచేతిని చూసి
ఎన్నాళ్ళయిందో కదా
నిదురను లేపే కోడికూత స్థానంను
చెరవాణి వచ్చి ఆక్రమించిన క్షణం నుండి
సూర్యోదయంను చూడడం మరిచారు
ప్రశాంతంగా ధ్యానించడం మరిచారు
ఇరుగుపొరుగు ఊసే మరిచారు
శ్వాస మీద ధ్యాసే లేకుండా పోయింది
పక్కవాడిని పట్టించుకునే మాటే మరిచారు
ఇక బంధాలు బంధుత్వాలు బహుదూరమే
ప్లాస్టిక్ నవ్వులు పెదవులపై మొలిచాయి
స్వచ్ఛమైన జీవితం కాస్త ఆధునికత వెంట
పరుగులు పెడుతుంది
అవని నుండి అంతరిక్షం దాకా ఎదిగిన
మానవ మేధస్సు చివరకు చరవాణి చెరలో
బంధీ అయి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది
అంతర్జాల మాయాజాలం తో అరచేతిలో
ప్రపంచాన్ని బంధించానని విర్రవీగుతున్నాడు
మాట కరువై సెల్లే పరువై
ఇంటింటా తిష్ట వేసిన మహమ్మారి చరవాణి
సెల్లు లేని రోజులను చందమామ కథలుగా
ఇంటర్నెట్ లేని దినాలని భేతాళ కథలగా
చెప్పుకునే రోజులు వస్తాయేమో
మంచిని స్వీకరించి చెడును త్యజించి
అవసరమైనంత మేరకే సామాజిక మాధ్యమాలను వినియోగించిన నాడు
యువత గమ్యానికి మార్గం సుగమం
బంధాలన్నీ సుభిక్షం
