బంగారు పాపాయి
బంగారు పాపాయి
బుడిబుడియడుగులను వేసి ముద్దులొలుకు
పాలబుగ్గల పాపాయి పలక పట్టి
బడికి వెళ్లి తాన్ జదివెను పాఠములను.
మురిసి పోయిన తలి తండ్రి ముద్దు లిడగ
చిన్న పాపాయి నవ్వుచు చిందు లేసె.
పట్టుపరికిణి కట్టిన పాప యిపుడు
చదువు లెన్నియో చదువుచు సమధికముగ
మంచి బాలికయైతాను మసలు కొనగ
పాప పేరును తల్చుచు పరవశించి
పౌరులెల్లరు పొగడిరి ప్రతిభగాంచి.
తరుణవయసున్న పాపాయి తనువు మఱచి
కష్టపడిసాధనల్ సల్పి ఘనత నొంది
పట్టభద్రురాలగుచు నీ వసుధయందు
దేశదేశము లెన్నియో తిరిగి చూచి
పతకముల దెచ్చి జూపగ ప్రజలు మెచ్చి
బిరుదు లీయగా రత్నమై వెలిగె పాప.
ఉన్నతంబగు పనిచేసి యుద్యమించి
దేశ భవితను పాపాయి తీర్చిదిద్ది
ధీరవనితయై కీర్తితో తేజరిల్లె.
పాప మనసుకు నచ్చిన వరుని తెచ్చి
పెద్దలందఱు పాపాయి పెండ్లి చేయ
సంతసించిరా యూరిలో జనము మురిసి.
అత్తమామల గాంచుచు నాదరముగ
మంచి కోడలై పాపాయి మానితముగ
చక్కదిద్దెనా యింటిని సాధ్వియగుచు.
కొంత కాలము గడిచెను సంతసముగ
తల్లి యైనట్టి పాపాయి తనదు సుతను
బడికి పంపించి చదివించ పలక నొకటి
తెచ్చి పెట్టెను ఘనముగా తీర్చి దిద్ద.
ఇవ్విధంబుగ సంసార చక్రమెపుడు
జగతి యందున తిరుగుచు సాగు నెపుడు
ఇంటి యింటికో పాపాయి నిచ్చి హరుడు
వెలుగు నిచ్చెడి జ్యోతిగా నిలిపియుంచె /
