బాల్యం కారాదు.. భారం
బాల్యం కారాదు.. భారం


(బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా)
తోటకు పూలు అందం
పల్లెకు పైరు అందం
బడికి పిల్లలే అందం
బాల్యం ప్రతి ఒక్కరూ
మళ్లీ మళ్లీ కావాలని కోరుకొనే
ఒక వరం.
అది కారాదు బాలలకి..భారం!
అమ్మా నాన్నల దగ్గర
హాయిగా గడపాల్సిన బాల్యం..
తోటి మిత్రులతో తనివితీరా
అడుకోవాల్సిన బాల్యం...
బడిలో అక్షరాలు నేర్చి
స్వీయ ప్రగతికి దేశ భవితకు
పునాది వేయాల్సిన బాల్యం...
అంగబలం...అవినీతి...
అధికార దుర్వినియోగాల
కబంధ హస్తాల్లో అయింది శూన్యం!
నేడు ఎంతోమంది బాలల
నివాసం..
రైలు స్టేషన్లు..బస్సు స్టేషన్లు!
బతుకు తెరువు..
ఇడ్లీ హోటళ్ళు...ఇంటింటా పాకీ పనులు!
అందమైన పాలబుగ్గల పై..
నలుపు రంగు అద్దిందెవరు?
దూది వంటి అరచేతిని..
దుక్కలా చేసింద
ెవరు?
చల్లటి మనసుల్లో..
మంటలు రేపిందెవరు?
కడు పేదరికమా..
కటిక దరిద్రమా..
ఎవరి పనుల్లో వారు
బిజీగా ఉండే సమాజమా!
లేక
పిల్లల వయస్సే..
వారికి శాపమా!
వారి బలహీనతే..
పెద్ద వాళ్ల..బలమా!
చిరు చేపలు ఈదేందుకు..
ఎవరికి చెయ్యాలి ఊడిగం
చిరుత కూన ఆడేందుకు..
ఎవరికి కట్టాలి కప్పం
గువ్వపిట్ట ఎగిరేందుకు..
ఆకశానికి చెయ్యాలా చాకిరి!
లేడిపిల్ల గంతులేసెందుకు..
నేలకు చెల్లించాలా చిల్లర!
వీటికి లేని వెట్టిచాకిరి
పసి మొగ్గంటి పిల్లలకేల?
బాల్యమంటే..
కాదు బానిసత్వం!
బాల్యమంటే
ఎంత చెల్లించినా కొనలేని...మాన్యం
తిరిగి పొందలేని మాధుర్యం.
అది ఏ ఒక్కరికీ కారాదు...దైన్యం!
.....రాజ్.....