అందం, వరమా, శాపమా!!!
అందం, వరమా, శాపమా!!!
పుట్టింది పాపాయి అందాల బొమ్మ గా
పెరిగింది తన ఇంట అల్లారు ముద్దుగా
నిలిచింది చదువులో సాటిలేని మేటిగా
మెలిగేది స్నేహితులతో స్నేహమయి గా
పెరిగిన కొద్దీ మారింది అందాల భరిణె గా
మెరిసింది తారల నడుమ చందమామ గా
భ్రమసిన కుర్రకారు ఎందరో వెంటపడి రాగా
నిరాకరించింది వారిని తానెంతో సున్నితంగా
ఆమె అందానికి మైమరచిన ఓ ఘనుడు
ప్రేమించానని వెంటపడి తనను వేధించాడు
తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పినా వినడు
చివరికి చస్తానని ఆమెను బెదిరించ సాగాడు
ఆకతాయి మాటలని ఆమె లక్ష్య పెట్టలేదు
కానీ ఆ మూర్ఖుడు వేధింపులు మానలేదు
పెద్దలకు చెప్తానని అన్నా లెక్క చేయలేదు
విసుగు చెందినామె అతనిని పట్టించుకోలేదు
సమయం కోసం కాచుకుని ఉన్నాడు ఆ థూర్తుడు
దారి కాచి ఉక్రోషం తో ఆమెపై ఆమ్ల దాడి చేశాడు
విలవిలలాడుతున్న ఆమెని చూసి ఆనందించాడు
నలుగురు వచ్చే సరికి పలాయనం చిత్తగించాడు
అందమైన ఆమె వదనం వడలిన గులాబి అయింది
ఆమెను చూసిన తల్లి దండ్రుల మనసు తల్లడిల్లింది
ఆమె వేదనను చూసిన వారి మనసు చలించి పోయింది
ఆమ్లదాడి ఆమె జీవితానికి మాయని మచ్చగా మిగిలింది
ఆమె పడే ఆవేదనకు ఎవరు జవాబుదారీ కావాలి
అందాన్ని వరం గా ప్రసాదించిన ఆ దేవుని అడగాలి
భావి జీవితానికి తెరదించిన ఆథూర్తుని ఏం చేయాలి
మానసిక హత్య చేసిన వారికి శిక్ష ఎవరు వేయాలి!
అందమనే వరం ప్రసాదించి, శాపంగా మార్చిన దైవాన్నా!
ముల్లు వంటి మనసున్న మృగాళ్ళను సృష్టించిన విధినా!
ఆడవారి ఆవేదన తీర్చు వారు లేరా, తరాలెన్ని మారినా!
ఆడవారికి రక్షణ కల్పించే వారు లేరా, చట్టాలెన్ని చేసినా!