శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror

3.4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror

టక్ టక్

టక్ టక్

3 mins
743


       

'టక్ టక్'...


    తృళ్లిపడి లేచాను...అర్థరాత్రి పన్నెండు గంటలు..!


మాఇంట్లో వినిపిస్తున్న ఆశబ్దాలకు-నాగుండె గుభేలుమంది. ఒకటి కాదు రెండు కాదు మూడవసారి కూడా చెవులు రిక్కించి విన్నాను.


    సందేహం లేదు.ఆశబ్దాలు ఆగదిలోనుంచే.ఆ అనుమానం నిర్ధారణ చేసుకోవడంతో నాలో వణుకులాంటి బెదురావహించింది. నిద్రపోతున్న నాపిల్లల్నిద్దరినీ అక్కున చేర్చుకున్నాను.


    బిక్కుబిక్కుమంటూ ఏవో ఆలోచనలు.ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి.వింటున్నకొద్దీ వుండి వుండి అవే శబ్దాలు...


    అమ్మో...!ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాను.


    గదిలో లైట్ వేసి ...ఆంజనేయస్వామి ఫోటోని పట్టుక్కూర్చున్నా.సమయానికి నాభర్త కూడా ఇంట్లో లేరు.క్యాంప్ నుంచి ఎల్లుండి గానీ రారు.చేసేదిలేక దేవుడేదిక్కని ధ్యానించుకుంటూ...ఆరాత్రి గడిపేసానెలాగో...!


    తెల్లవారుతుండగా నిద్రపట్టినట్లుంది...నా పిల్లలు లేపేవరకూ నాకు మెళుకువ రాలేదు.కళ్ళు తెరిచేసరికి రాత్రి బెదిరింపులన్నీ చెవుల్లో మెదిలాయి.


    తెల్లారిపోవడం వల్లనేమో...నాలో ఎక్కడలేని తెగువా వచ్చేసింది. పక్కమీంచి లేచి గబగబా పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించేసాను.


    ఎనిమిది గంటలైంది....!


    అప్పుడు గుర్తుకొచ్చింది మళ్లీ...ఆశబ్దాలు ఏమై ఉంటాయా అని ..?


    ఆగది వైపు రిక్కించి చూసాను.దగ్గరకేసి ఉన్న తలుపుల్ని చేత్తో తోసాను.ఆచీకటి గదిలోకి వెలుతురు వెళ్లేసరికి మావగారు వాడిన వస్తువులన్నీ ఎప్పటిలాగే కనిపించాయి.


    ఆపందిరి మంచం పక్కనే మూలకి జారేసి ఆయన చేతికర్రా, టేబుల్ మీద పెట్టిన చిన్న టీవీ, ఓపక్కగా కుర్చీ అన్నీ అలానే ఉన్నాయి.


    తండ్రి వస్తువులన్నీ అలానే చూసుకోవాలని నాభర్త కోరిక.గదంతా కలియచూసాను.గోడపై దండ వేసి మావగారి ఫోటో వ్రేలాడుతూ ఉంది.గంభీరంగా చూస్తూ పులిలా ఇల్లంతా ఉరుకుతున్నట్లున్నారు.


    ఆయన బ్రతికుండగా ఈఇల్లు ఎంత నిండుగా ఉండేదో...? ఆ పెద్దాయన్ని పలకరించడానికి బంధుమిత్రుల రాకపోకలతో కళకళలాడుతూ ఉండేది.ఆ వైభోగం ఇకరాదేమో...?


    దేవతలు తిరగాల్సిన ఈఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయేమో అనే ఆలోచనని కొట్టిపడేసాను.


ఇప్పుడు నామనసెంతో రిలీఫ్ గా ఉంది.నా మనసుకలా అనిపించాకా.


    సాయంత్రం పిల్లలు స్కూలునుంచి తిరిగొచ్చాకా వాళ్ళకి స్నాక్స్ పెట్టి సంగీతం క్లాస్ కి తీసుకెళ్లి వచ్చాను.


    రాత్రి ఏడు గంటలైంది.


    పిల్లలతో హోమ్ వర్కులు చేయించి...భోజనాలు పెట్టి పడుకోబెట్టేసరికి రోజు ఇట్టే గడిచిపోయింది.


    పది గంటలు కావొస్తుంది...!


    మళ్లీ ఒంటరితనం మొదలైంది. రాత్రి వినిపించిన టక్ టక్ లు గుర్తుకొచ్చాయి.పగలెంత ధైర్యంగా తిరిగినా రాత్రయ్యేసరి మళ్లీ భయం బయలుదేరింది మనసులో.పిల్లల పక్కనే చోటుచేసుకుని ముడుచుపెట్టుకుని పడుకున్నాను.


    నిద్రలో ఉలిక్కిపడి లేచాను...


    టైం చూస్తే పన్నెండు గంటలు...!


    మళ్లీ అదే టైంకి మెళుకువ రావడం ...అవే టక్ టక్ లు.


    వెన్నులోంచి వణుకు మొదలైంది.


    ఒళ్ళంతా చెమటతో తడిచిపోయాను.ఆవేళప్పుడు ఎవరి సహాయం మాత్రం అడగగలను...? ఆంజనేయస్వామి దండకం చదవడం మొదలుపెట్టాను.నా భర్తకు ఫోన్ చేద్దామనిపించినా..ఈ పరిస్థితిలో ఆయన మాత్రం ఏం చేయగలుగుతారని ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నాను.


    ఒక్క క్షణమైనా కంటిపై కునుకు రాలేదు.


    తెల్లారినట్టుంది...గదిలో పల్చగా వెలుతురు పరచుకుంది.


    నాలో ఆవిరై పోతున్న ఊపిరిని గాఢంగా పీల్చుకున్నాను...చీకటి వెలసి వెలుతురొచ్చి గండం గట్టెక్కినందుకు.


    పిల్లల్ని స్కూల్ కి పంపించేసాకా కొద్దిసేపటికి క్యాంప్ నుంచి వచ్చారీయన.


    వచ్చీరాగానే...మావారిని చుట్టేసి చెప్పేసాను.ఈ రెండు రాత్రుళ్ళూ నేనెంత భయాందోళనలకు గురయ్యానో...!


    నా చేతిని విదిలిస్తూ..."ఛ..ఊరుకో"అన్నారు విసుగ్గా.


    అవునుమరి...కన్నతండ్రి దెయ్యమై తిరుగుతున్నాడేమోనని చెప్తే..ఏ కొడుకు ఓర్వగలడు...?


   " దెయ్యాలూ లేవు, భూతాలూ లేవు.అదంతా నీ అపోహ" అంటూ నామాటను కొట్టిపడేసి... బాత్రూమ్ లోకి దూరారు.


   నాకైతే ఏడుపొచ్చినంత పనైంది. సరే...ఆయనే స్వయంగా వింటేనే గానీ...ఏదీ తెలిసిరాదనుకుని ఆయన మాటల్ని దులుపేసుకున్నాను.


   ఎందుకో మామావ గారి గదిలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోయాను.అన్ని గదులూ ఊడ్చినా ...ఆ గదిని అలాగే ఉంచేసి తలుపులు దగ్గరగా వేసేసాను.


   మావగారు పోయినప్పటినుంచీ ఆగది వాడకపోయినా రోజువిడిచిరోజు ఆగది క్లీన్ చేస్తూనే ఉంటాను.ఆయనపోయి ఆరు నెలలు కావొస్తుంది.ఈఇంట్లో ఆయన మంచం మీదే తుదిశ్వాస వదలడంతో... మొదట్లో కొంచెం భయంగానే అనిపించినా తర్వాత తర్వాత అలవాటైపోయింది. మంచం మీద ప్రాణం పోతే దాన్ని ఇంట్లోనుంచి తీసేయాలి అని ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు మావారు. శాంతులు జరిపించాలని చెప్పినా చెవికెక్కలేదు.


   కానీ...ఇన్నాళ్ళబట్టి లేని వింత శబ్దాలు ఇప్పుడు మొదలయ్యాయి. అవి అచ్చంగా మావగారు చేతికఱ్ఱతో నడుస్తున్నప్పుడు వినిపించే టక్ టక్ శబ్దాలే. నేను మాత్రం ఆఇంట్లో ఏదో తిరుగుతుంది అనే గట్టి నమ్మకానికి వచ్చేసాను.పిల్లలకు తెలిస్తే ఎక్కడ బయపడతారోనని వాళ్ళకి తెలియకుండానే భయాన్ని మనసులో దాచుకున్నాను.ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి ఆభయం నుంచి బయటపడాలి.మావారి రాకతో కొంచెం ధైర్యంగానే అనిపించింది.చూడాలి ఈరాత్రికి ఏమవుతుందో...?


   రోజు గడవడం ఎంతసేపు...?చూస్తుండగానే చీకటై పోయింది .ఇల్లంతా లైట్స్ ఆన్ చేసేసాను.నాలో మళ్లీ గుబులు మొదలైనా...నా అనుభవం మావారు కూడా వినాలనే ఉత్సుకతతో వున్నాను.పిల్లలు నిద్రపోయారు. మేము కూడా నడుం వాల్చి ఏవో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయాము.


   సడన్ గా మెళుకువ వచ్చింది నాకు.


   నాపక్కన మావారు లేరు.


   సమయం అర్థరాత్రి పన్నెండు గంటలు దాటింది.


ఆయన కోసం మంచంపైనుంచి లేచాను. హాలులో అటూ ఇటూ తిరుగుతున్నారు మావారు."ఏంటండీ ఎందుకు లేచారు" అడిగాను.నన్ను పడుకోమన్నట్టు చేయి ఊపారు...ఏం మాట్లాడకుండా.


    అంతలోనే వినిపించింది ఆశబ్దం...టక్ టక్ మంటూ.మావారు ఒక్క ఉదుటున నాదగ్గరకు వచ్చేసారు.


    "నిజమేనే...నువ్వు చెప్తే కొట్టిపడేసాను.ఇందాకటినుంచీ నాలుగైదు సార్లు విన్నాను ఆశబ్దాన్ని.నాకూ భయంగానే ఉంది.నాన్నగారి ఆత్మ ఈఇంట్లో తిరుగుతుందేమో...?అది అచ్చం మానాన్న కఱ్ఱశబ్దంలానే ఉంది కదూ...నా మాటతో ఏకమయ్యాడు నాభర్త.


    అంత భయంలోనూ... ఆయన్ని చూస్తే నవ్వొచ్చింది నాకు.ప్రొద్దుట ఆయన మాట్లాడిన మాటలకూ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు అసలు పొంతనలేదు.


    ఈ శబ్దాలు ఈయనకు కొత్తయ్యాయి. రెండు రోజులుగా నాకలవాటైపోవడం వల్లనో మరి నిద్ర కూడా లేకపోవడం వల్లనో... నాభర్త ఉన్నారనే ధైర్యంతో...తిరిగి మంచమెక్కి నిద్రకి ఉపక్రమించాను.


    ప్రొద్దుట లేచి చూసేసరికి... నాభర్త రాత్రంతా జాగారం చేసారనిపించింది.అదేం చిత్రమో రాత్రంతా వినిపించే ఆటక్ టక్ లు పగలయ్యేసరికి వినిపించడం లేదు.


    ఆ విషయమేదో తేల్చుకుంటానంటూ... భయపడుతూనే ఆగదిలోకి వెళ్లారు నాభర్త. వెళ్తూనే వాళ్ళనాన్న గారి ఫోటోకి దణ్ణం పెట్టుకున్నారు.


    మంచంపై దుప్పటి తీసి పరుపుదులిపారు ఇంకో దుప్పటి వేద్దామనే ఉద్దేశ్యంతో.అక్కడే మూలనున్న వాళ్ళ నాన్నగారి చేతికర్ర తీసి అటూ ఇటూ తిప్పి చూసి మళ్లీ అక్కడే పెట్టేసారు.అక్కడ కుర్చీలో కూర్చుని టీవీ ని ఆన్ చేసి భక్తి ఛానల్ పెట్టారు. గదంతా పరికించి చూస్తూ మంచంమీద దుప్పటి వేద్దామని కాబోలు కాబోర్డు తెరిచారు. అందులోని వాళ్ళ నాన్నగారి బట్టలను ప్రేమగా తడుముకున్నారు.దుప్పటి కోసం చూస్తుండగా.. ఒక్కసారిగా గట్టిగా పిలిచారు నన్ను "ఒసేయ్"అంటూ.


    ఆ కేకకు అదిరిపడ్డాను."ఏంటండీ ఏమైంది..? కంగారుగానూ,భయంగానూ ఒక అడుగు ముందుకేసాను.


    "ఇదిగో ఇక్కడ చూడు"-అంటూ ఆ కాబోర్డులోని కింది అరలోకి చూపించారు.


    అక్కడ చూసాకా ...రెండు రోజులనుంచి మిస్టరీగా ఉండిపోయిందంతా అర్థమవ్వడానికి ఒక సెకను కూడా పట్టలేదేమో మాకు.


    ఆ కబోర్డు రెండు తలుపులకీ కింద మధ్యనున్న గ్యాప్ లోంచి దూరి ...మావగారి పంచెలను కొరికేసి,పుస్తకాలని పిప్పిపిప్పి చేసేసి..నానా భీభత్సమూ చేసిన రుజువులు బయటపడ్డాయి.


    ఆ కబోర్డు లోపలంతా చెక్కతో చేసిన బాక్స్ మోడల్ అవ్వడం వల్లనేమో...ఆ టక్ టక్ శబ్దాలతో వీరవిహంగం చేస్తూ భయపెట్టింది ఎలుకని తెలిసాకా పగలపడి నవ్వుకున్నాం.


    ఆ కబోర్డు లోపల వ్రేళ్ళతో చరిచి వినిపించారు నాభర్త.


    మళ్లీ వచ్చింది శబ్దం...."టక్ టక్"


             


       -------*--------*--------*--------



  



       


          





















Rate this content
Log in