శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror

ప్రేమ ప్రేతాత్మలు

ప్రేమ ప్రేతాత్మలు

4 mins
522


       


  శోభనం రాత్రి...!

   

   పాలగ్లాసుతో పడగ్గదిలోకి అడుగుపెట్టింది ప్రసూన...!

‎తడబడే అడుగులతో...భర్తను చేరి పాలగ్లాసుని అతని చేతికందిస్తుండగా దబ్బున జారిపోయి భళ్ళుమంది గాజుగ్లాసు.బిత్తరపోయింది ప్రసూన. తానైతే జారవిడిచినట్టుగా తనకు అనిపంచలేదు. మరెలా ...? చాలా ఆశ్చర్యంగానూ...వింతగానూ అనిపించింది.

భర్తకు సారీ చెబుతూ...కిందకి వొంగి గాజుపెంకులను తీయబోతున్న భార్యను వారించాడు ప్రకాష్. నువ్వొద్దు...సర్వెంట్ ని పిలుస్తాను అంటూ తలుపుతీసి బయటకు వెళ్ళాడు. ప్రసూన మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. తనచేతిలోనుంచి జారిపోయి ఉంటే తనకు కొంచెమైనా తెలిసేది. కానీ దాన్ని పైనుంచి ఏదో శక్తి కిందకి గుద్దినట్టై ఆగ్లాసు పడిపోయింది. అప్పటికి గానీ ఆవిషయాన్ని గ్రహించలేకపోయింది. సర్వెంట్ రావడం క్లీన్ చేసి వెళ్లిపోవడం అన్నీ అయిపోయినా... గమనించనే లేదు ప్రసూన. భర్త వచ్చి పలకరించేసరికి...ఈలోకంలోకి వచ్చింది. తన చేయి పట్టుకుని కూర్చోపెడుతున్న భర్తను బెదురుగా చూసింది. మనసుకి ఇష్టం లేకున్నా... నాశీలాన్ని అర్పించుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రదీప్ తో పంచుకోవాల్సిన ఈశరీరాన్ని మరో వ్యక్తితో..ఊహించడానికే చాలా...జుగుప్సగా ఉంది ప్రసూనకి. కానీ...తప్పదు. తల్లిదండ్రుల కోరిక ప్రకారం తల వంచి తాళి కట్టించుకున్న భర్త అతను.తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్న భర్తకు అన్నివిధాలా భార్యగా నాసహకారం ఇవ్వకతప్పదేమో..?మనసులో దృఢంగా అనుకుంది. ప్రేమగా తనను దగ్గరకు తీసుకోబోతున్న భర్త చేతుల్లో ఒదిగిపోబోతుండగా.. బలంగా తననెవరో వెనక్కి లాగిన ఫోర్సుకు కొంచెందూరంలోకి జరిపినట్టైంది ప్రసూనకి. అదంతా తనకు అర్థమవుతున్నా...భర్త మాత్రం తాను భయపడుతుందనే అనుకున్నాడు.


   ‎ వొద్దులే... నీవు నాకు దగ్గరవాలని నీకనిపించినప్పుడు ఒకటవుదాం. రెస్ట్ తీసుకో అంటూ...అటుగా పడుకున్నాడు ఆమె భర్త. నా మనసుకి సర్దిచెప్పుకుని ...అతనికి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా...నాకెందుకిలా అవుతుంది...? తనకు అర్థం కానిదేదో...అక్కడ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది ప్రసూనకి.


  ‎ మరోవైపుకి తిరిగి పడుకుందే గానీ...భర్త తనకు తాళి కట్టబోతుండగా ...అతని చేతిలోంచి జారిపోయిన తాళిబొట్టు సంఘటన కూడా కళ్ళముందు మెదిలింది.ఏంటి ఈఅశుభాలు...? బుర్రనిండా ప్రశ్నలై కూర్చున్నాయి ప్రసూనకి. ఒకపట్టాన నిద్రపట్టడం లేదు.ఉండేది పెంట్ హౌస్ కావడం వల్ల లేచివెళ్లి ఆడాబా మీద అటూ ఇటూ తిరుగుతో తిరుగుతూ...ఒక్కసారిగా తుళ్ళిపడింది...ఇంకా వినిపిస్తూనే ఉంది...ప్రసూనా ప్రసూనా అని తన పేరునే పిలవడం. అదెలా...? నమ్మలేకపోయిన మాట వాస్తవమే అయినా...నమ్మి తీరాలి. ఎందుకంటే...అది కచ్చితంగా ప్రదీప్ గొంతే.


   ‎ భయపడకు ప్రసూ... నేను నీ ప్రదీప్ నే.


   ‎ ఎవరూ కనిపించని ఆ అర్థరాత్రి వేళ ...మనిషి లేకుండా మాట మాత్రం వినిపిస్తే...ఎవరు మాత్రం బెదిరిపోరు...? అయినా...తాను ప్రేమించింది ప్రదీప్ నే కాబట్టి ఎన్నో విషయాలు అడగాలనే తపనతో ధైర్యాన్ని కూడగట్టుకొని...ప్రదీప్ నువ్వా..? నువ్వు చనిపోలేదా..? ఎక్కడా కనిపించవేం ..? నోరు పెగిల్చి అడిగింది ప్రసూన.


   ‎ కనిపించడానికి నాకు శరీరం లేదు ప్రసూ...! నిన్ను విడిచి వెళ్లలేక...నీతో ఒకవిషయం చెప్పుదామని నెల్లాళ్ళుగా ప్రయత్నిస్తూనే వున్నాను. ఇన్నాళ్లూ మీఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయ మీఇంట్లోకి నాకు ప్రవేశం ఇవ్వలేదు.నీకు పెళ్లై ఈఇంటికి వచ్చాకా..ఇక్కడ అలాంటివేమీ నన్ను అడ్డగించేవి లేకపోవడంతో నాకు నిన్ను కలిసే అవకాశం దక్కింది." నిన్ను కలిసేలోపు నీపెళ్లి అయిపోయింది. నిన్ను విడిచి నేను వెళ్లలేక నీకోసం తపించిపోతుంటే...నువ్వెలా ఈ పెళ్లి చేసుకున్నావో నాకర్థం కావడం లేదు. అప్పుడే నన్ను మర్చిపోయావన్నమాట. నీవు నన్నెంతగా ప్రేమించావు..! నేను చనిపోయిన వెంటనే ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి నీమనసెలా అంగీకరించించి? కనిపించని ప్రదీప్ గొంతు ప్రశ్నిస్తుంటే...ఏం సమాధానం చెప్పాలో తెలీక ఒక్క క్షణం నివ్వెరపోయినా...నిజాన్ని నిర్భయంగా చెప్పాలని... నేను తొందరపడి ఈ పెళ్లిచేసుకోలేదు. "చనిపోయిన మనిషి ఇక ఎలాగూ రాడు. ఆదర్శంతో నిన్ను పెళ్లిచేసుకోడానికి ముందుకొచ్చిన ఈఅబ్బాయిని కాదనకు" అంటూ ...మనకు కుదిర్చిన ఆపెళ్లి ముహూర్తానికే పెళ్లై పోవాలని పట్టుబట్టి మరీ ఈపెళ్లి చేశారు నాతల్లిదండ్రులు. నిన్ను మర్చిపోలేక ఈపెళ్లి చేసుకోడానికి నేనెంతగా క్షోభ పడ్డానో... నీకెలా అర్థమవుతుంది"...? తడిబారిన కళ్ళను పైట చెంగుతో తుడుచుకుంటూ చెప్తున్న ప్రసూన మాటల్లో తనపై ప్రేమ అలాగే ఉందన్న విషయం తెలిసొచ్చింది ప్రేతాత్మగా తిరుగుతున్న ప్రదీప్ కి. అనవసరంగా నిందించినందుకు నొచ్చుకున్నాడు.


   ‎ "నాకు అర్థంకాని విషయం ఒకటే... మనకి నిశ్చితార్థమై నెల రోజుల్లో ముహూర్తాలు కూడా నిర్ణయించారు.ఆమర్నాడే నువ్వు చనిపోయావు. యే జబ్బూ లేకుండా రాత్రికి రాత్రి నువ్వెలా చనిపోయావో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. హార్ట్ ఎటాక్ లాంటిది కూడా కాదని రుజువైంది.అసలు నీకేమైంది? నీకా మరణం ఎలా వచ్చింది? ఎన్నో ప్రశ్నలు బుర్రని వేధిస్తుంటే... రోధిస్తూనే అడిగేసింది ప్రసూన.


   ‎ కొంచెంసేపు వరకు సమాధానం లేదు...ప్రదీప్ కూడా చిన్నగా ఎక్కిఎక్కి ఏడవడం వినిపించడంతో...కంగారు పడుతూ..వద్దు ప్రదీప్ వద్దు. నవ్వలా ఏడవకు. నీ మరణమెలా సంభవించిందో గానీ...బ్రతికుండి నేనూ, చనిపోయి నువ్వూ విడిపోయి ఎవరికి వారే బాధ పడుతున్నాం.


   నీకసలు ఏమైంది ఆరోజు..? ఒంట్లో ఏమైనా తేడా చేసిందా...? ప్రాణం పోతున్నట్టు నీకేమైనా అనిపించిందా...? ఏక బిగిన అడిగుతుంది.. ప్రసూన.


   ప్రేతాత్మ ప్రదీప్ ఆరోజు జరిగిన విషయాన్ని తలుచుకుంటూ... "నా శరీరాన్ని మావాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు" ఒక్కసారిగా ఆ గొంతు గంభీరంగా మారిపోయిందంటే...ఎంతగా నరకం అనుభవించాడో తెలుస్తూనే ఉంది..!


  ‎అవునా...అదెలా? నువ్వు చనిపోబట్టే కదా దహనం చేశారు. అది తప్పెలా అవుతుంది...? హిందూ ధర్మం ప్రకారం మనమంతే కదా చేస్తాం.


   ‎నువ్వు చెప్పింది నిజమే...! కానీ నేను చనిపోలేదు. ఆరోజు మన నిశ్చితార్థం వేడుకను తల్చుకుంటూ చాలా సేపు నిద్ర రాలేదు. తర్వాత ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు. కానీ విపరీతమైన దాహం వేసింది. లేచి తాగలేని మగతలో వున్నాను. నాశరీరాన్ని లేపి వెళ్లలేక... నాలో ఉన్న ఆత్మ లేచి నీళ్లకోసం వెతికింది. నా అదృష్టం అనుకున్న ఆక్షణమే...దరదృష్టం కూడా వెంటాడి మృత్యువాత పడుతుందనుకోలేదు... ! బిందె మీద మూత తెరిచి వుండటంతో...నా ఆత్మ తృప్తిగా నీళ్లు తాగుతుండగా... ఆవిషయం తెలియని మా అమ్మ కూడా అదే సమయంలో నీళ్లు తాగడానికి వచ్చి... మూతలేని ఆబిందెపై మూత పెట్టేసింది. లోపల నేనెంతగా గిజగిజలాడిపోయానో...! దానిలోంచి విడుదలై బయటకు వచ్చేసరికి కొన్ని గంటలు దాటిపోయింది. నా శరీరంలోకి వెళ్లిపోదామనుకుని... నాకోసం నేను చూసుకున్నప్పుడు మంచంపై పడుకున్న నా శరీరం నాకు కనిపించలేదు. ఇల్లంతా ఏడుపులతో ఉంది. ఎంతో ఆదుర్దాగా నాకోసం నేను వెతుక్కున్నాను. అప్పటికే... నా శరీరాన్ని దహనం చేసేసారు.


   ఇప్పుడు చెప్పు...నాఆత్మ ఈభూమిపై వుండగానే నాశరీరం తగలబడిపోవడంతో ...నేను మనిషిగా కనిపించలేని దౌర్భాగ్యస్థితికి చేరిపోయాను.ఇదిగో నీపై ప్రేమతో నీకోసం ఇలా ప్రేతాత్మయై...తిరుతున్నాను. నాకొచ్చిన ఈపరిస్థితిని నేనెలా చక్కదిద్దుకోవాలో అర్థం కావడంలేదు". తన గోడంతా వెళ్లబోసుకున్నాడు ప్రదీప్ ప్రేతాత్మ.


   జరిగిన సంఘటని వింటూ భీతిల్లిపోయింది ప్రసూన. ప్రదీప్ కొచ్చిన కష్టానికి కృంగిపోయింది. "అయితే నువ్వెలా బయటకు రాగలిగావ్" సస్పెన్సు గా మిగిలిపోయిన ఆవిషయాన్ని కూడా అడగాలనిపించి అడిగింది.


   నా ఆత్మ మూతపెట్టిన బిందెలో కొన్ని గంటలు బంధించిపోయింది. ఆతర్వాత ఎప్పుడో నీళ్లకోసం బిందెపై నుంచి ఎవరో మూత తీయడంతో... బయటపడ్డాను.కానీ అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది కదా.


  అప్పుడర్థమైంది..ప్రసూనకి..!


   శరీరం నుంచి ఆత్మవేరై నీళ్ళబిందెలో ఉండిపోడం వల్లే... ప్రదీప్ అచేతనంగా పడికనిపించడంతో... సహజ మరణం పొందాడనే నిర్ధారణతో...దహనం చేసేసారని.


  ఏదైనా...ఇప్పుడు తను ప్రేమించి, పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ప్రేతాత్మగా కూడా తనకోసమే తపించిపోతున్నాడంటే.. ఇప్పుడు అతని కోసం నేనేమైనా చేయాలి...దృఢంగా అనుకుంది. ఇదంతా తెలిసి కూడా పెళ్లి చేసుకున్న భర్తతో సుఖంగా అయితే కాపురం చేయలేవని తన అంతరాత్మ చెప్తూనే ఉంది.


   ఏదో నిశ్చయానికొచ్చిన దానిలా లేచి నుంచుంది. "సరే ప్రదీప్...నీకొచ్చిన ఈసమస్య సమసిపోయేది కాదు. ఏదో ఒక పరిష్కారం మనల్ని ఏకం చేస్తుంది. నేను నాభర్తకు ఎట్టి పరిస్థితిలోనూ దగ్గరవ్వకుండా తప్పించుకోడానికి చూస్తాను. మళ్లీ రేపు కలుసుకుందాం.ఇక్కడ నుంచి వెళ్లిపో " అంటూ చెప్పింది.


  ప్రసూన మాటైతే విన్నాడు గానీ...ఏమీ అర్థం కాలేదు ప్రేతాత్మ ప్రదీప్ కి.


  గదిలోకి వెళ్లిన ప్రసూన భర్తవైపు చూసింది. గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అదే అదనుగా... బల్లపై ఉన్న కాగితం కలాన్ని అందుకుంది..!


      ******    ******   ******


   అమావాస్య....అర్థరాత్రి...అలికిడి చేస్తూ...ఆవూరి మర్రిచెట్టుపై ఊడలూగుతూ...ఆడుకుంటూ...మహానందంగా ఉన్నాయి....ప్రదీప్, ప్రసూనల ప్రేతాత్మలు. ఆడి ఆడి ...అలసిపోయి...ఒకొమ్మపై ఒకరినొకరు అతుక్కుపోయి మాట్లాడుకుంటున్నాయి...


  ఎంతైనా...నీవు నాకోసం చాలా త్యాగం చేసావు ప్రసూ...! నీవు అందర్నీ వదులుకుని... నాకోసం మేడ మీద నుంచి దూకేసి ప్రాణాలు తీసుకోడంవల్లే...ప్రేతాత్మవై నాకు తోడుగా వచ్చావు. నిన్ను పెళ్ళిచేసుకున్న భర్తపై ఎలాంటి కేసూ రాకూడదని ఉత్తరం కూడా రాసి...అతనికి కూడా న్యాయం చేసావు. మనం ఈభూమిపై ఇలా తిరుగుతున్నంత కాలం ఎవరిజోలికీ పోకుండా మనకోసం మనమిలా వుంటూ...యే భూతవైద్యుడికీ పట్టుబడకుండా మంచిగా సాగిపోదాం...అని చెప్పిన ప్రదీప్ ప్రేతాత్మతో... ప్రేతాత్మ ప్రసూన కూడా సై అంటూ... ఒక కొమ్మ నుంచి మరో కొమ్మపై వాలుతూ ఆటలాడుతున్నాయి....! *

       

        ***   ***   ***   ***


(పాఠకులకి మనవి... రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగి పడుకోకపోతే...కథలో విధంగా మనలోంచి నీళ్లకోసం ఆత్మలు ఒక్కోసారి అలా గాలిస్తాయని ...పెద్దలు చెప్పేవారు. భూమిపై ఆత్మ ఉండగా శరీరాన్ని కోల్పోతే ప్రేతాత్మ అవుతుందని ..దాని ఆధారంగా మాత్రమే ఈకథను రాసాను.ఎంతవరకూ నిజమన్నది నాకు కూడా తెలియదు.ఇదంతా కల్పితం మాత్రమే).
      ‎


Rate this content
Log in

Similar telugu story from Horror