ఫలించిన జోస్యం....శ్రీనివాస భా
ఫలించిన జోస్యం....శ్రీనివాస భా


ఇచ్చట మీ జీవితంలో జరగబోయే భవిష్యత్తు చెప్పబడును.. అని అందంగా ఒక బోర్డు చెట్టు నాభికి తగిలించబడి ఉంది.
నుదుట విభూదిరేఖలు, మధ్యలో త్రినేత్రం టైపులో
పెద్ద కుంకుమబొట్టు, మెళ్ళో రుద్రాక్ష, చేతులకు దందకడియాల్లా మరికొన్ని రేఖలు,మొత్తానికి జ్యోతిష్యం చెప్పే లక్షణాలు ఆ మనిషిలో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి...ఎదురుగా పంజరంలో చిలుక...చిన్న డబ్బ్బాలో పెద్దసైజు గవ్వలు, సంఖ్యా, హస్త రేఖలు, నక్షత్ర రాసుల ఫలితాలు ,సమస్తం సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయని రెండో బోర్డు చెట్టును కౌగలించుకొని మరీ చెప్తోంది.
ఆ త్రోవంట వెళ్తోన్న కృష్ణమూర్తి అతడ్ని ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాడు. తన ఆఫీసుకు, తన సీటుకు ఎదురుగా రోడ్డుకు అవతలి ప్రక్కకూర్చున్న అతడ్ని గమనించడం తనకు నిత్యకృత్యమైంది.
ఒకరోజు చూద్దామని లంచ్ అవర్లో వెళ్లి కూర్చున్నాడు..జాంపండు సగం కోరికిన చిలక వాడ్ని ఎర్రగా చూస్తోంది...
తియ్యబోతున్న పాత సిల్వర్ క్యారెజుని చూపుల్తో నే పక్కనబెట్టి పదిరాళ్ల ఆలోచనలకు మెదడు పదునెక్కి స్తున్నాడు.
అయ్యా రండి రండి....అంటూ ఆ జ్యోతిష్యుడు పిలవగానే అనుమానంతో అటూ ఇటూ చూసాడు కృష్ణమూర్తి.
మిమ్మల్నే...అంటూ అంచులూడి పోయిన చాప పరిచాడు...అతడు.
సరే ఓ సారి చూస్తే ఏం పోతుంది....ఓ పది మనది కాదనుకొందాం...ఇన్ని వందల్లో ఇదో లెక్కా మనకి.
అనుకుంటూనే చాపెక్కాడు..
పదిరూపాయలకు ఎగిరొచ్చిన చిలక సుశిక్షితుడైన సైనికునిలా ఒక కార్డు తీసి చిత్రమైన చిలక నవ్వొకటి విసిరేసి పంజరంలోని జాంపండు తింటోంది..ఇక తనకు పని తగ్గి వచ్చినోడి పనైపోయింది అన్న చూపుల్తో....
మహర్జాతకులు..రాధా కృష్ణులోచ్చారు...తమంత అదృష్టవంతుడు ఈ భూమ్మీద మరొకడుండడు... అంటే నమ్మాలి మరి.
కృష్ణమూర్తి మొహం టపాసులా వెలిగిపోయింది.
అది గమనించీ గమనించనట్టు అతడు చెప్పుకు
పోతున్నాడు.
అయ్యవారు చిన్నింట్లో. ..అంటూ అర్ధాంతరంగా అపి జాతకుడి మొహంలోకి చూస్తున్నాడు.
చిన్నింట్లోకి.. అడుగులేస్తున్నారు...
ఉన్నింటికె దిక్కులేక పోతే....
అయ్యోరు ఊరికే తొందరై పోతున్నారు...కొండ దేవర ఆన...తప్పు పలికిన నోట మన్ను పడేను...అబద్దమడితే..తల రాలేను..తమరు గుర్తేట్టుకోవాల.
తలూపాడు కృష్ణమూర్తి...మంత్రముగ్ధునిలా
తమ కూనల్లో ఒక కూన మహా పెంకే... మాట ఇనిపించుకోదు దొరా..
తలూపాడు కృష్ణమూర్తి.
జాతకం పూర్తయ్యేసరికి గంట దాటిపోయింది..
ఇంచుమించు అన్నీ నిజాలు చెప్పేసరికి కృష్ణమూర్తి
నోట మాట రాలేదు.
రాత్రి తెల్లారింది.
వాళ్ళ ఆఫీసర్ ఇంట్లోనూ, తన ఇంట్లోనూ ఏ సి బి రైడింగ్...
మొత్తం లెక్కలోకి రానిదీ,వచ్చింది అన్నిటికీ రెక్కలొచ్చాయి....మొత్తం అరుచోట్ల...
ప్రయివేటు హాస్పిటల్ ఆహ్వానిస్తోంది ఇద్దర్నీ గుండెపోటు వార్డులోకి.
రైడింగ్ ఆఫీసర్ చిలక జ్యోస్యుడే నని మీరూ ఎవరికీ చెప్పకండేం...
************%%%%%%%%***********