శలభం.....శ్రీనివాస భారతి
శలభం.....శ్రీనివాస భారతి


"నువ్వంటే నాకిష్టం" ఆంది గోపిక
"ఎంతో" నవ్వుతూ అన్నాడు ఫణి
"నా మనసు పారేసుకున్నంత"
"నిజమా"
"అవును. నమ్మాలి నువ్వు"
"ఏమో."
"ఎందుకా అనుమానం"
"పెళ్ళైన పిల్లల తండ్రికి...."
"పెళ్లై అబ్బాయున్న ఒక స్త్రీ చెప్పిందనా" అంది గోపిక.
"కాబోలు. ఐనా ఇది తప్పు కదూ"
"ఇష్టం...ఎందుకంటే నాగురించి ఆలోచిస్తావ్ గనుక"
"ఇష్టం వ్యామోహంగా మారితే ప్రమాదం"
"అప్పుడు చూద్దాం"
"రెండు కుటుంబాలకూ ఇబ్బంది"
"అంతవరకు రానిస్తానా"
"కొంత కాలం దాటితే ఇది మరో మెట్టు ఎక్కోచ్చు"
"నా అవసరాలు, ఇష్టాలు, ఆలోచనలు, అన్ని తెలిసి
ఆఫీసు పనుల్లో నాకు చాలా సహాయం చేసిన నీ గురించి
ఎంత చెప్పినా, ఏమి చేసినా తక్కువే."
"నా వీలు బట్టి, సహాయ పడ్డాను అంతే."
"ఎలాగనుకున్నా ఫర్వాలేదు. నీకు ఏ సహాయం , ఎలాంటిదైనా నా నుండి కావాలనుకున్నా సరే.ఎప్పుడైనా.."
"అప్పుడాలోచిద్దాం."
"క్రిందటి నెల ఇరవై వేలు అవసరం ఐతే సర్దావ్. ఇప్పుడు
మరో ఇరవై సర్దగలవా."
"ఈ నెల ఖర్చులున్నాయి. మరుసటి నెలైతే కుదరొచ్చు."
"ఏదీ తిన్నగా చెప్పవేం?" చిరు కోపంతో అంది గోపిక.
"నేను చెప్పింది స్పష్టం. ఇవ్వలేనప్పుడు ఆ విషయం చెప్పేస్తే నీవు వేరే ప్రయత్నం చేసుకోవచ్చని నా నమ్మకం.అన్నాడు ఫణి.
"నాకు నీకంటే ఆప్తులు ఎవరున్నారు?"
"సరే. ఏదైనా మార్గం ఉంటే చూద్దాం.అయినా దేనికింత డబ్బు?"
"మా ఆయనకు హాస్పిటల్ ఖర్చులకు"
"ప్రయత్నం చేస్తాలే... నువ్వుకూడా ఎవరినైనా అడిగి చూడు."
"నువ్వైతే ఎప్పుడిచ్చినా ఫర్వాలేదు. ఇంకెవరైనా ఐతే
దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు."
"సరే. చూద్దాం."
ఆ ప్రస్తావన ముగిసింది. ..అక్కడితో ఆఫీసు పనిగంటలు ముగియడం తో.
వారం గడిచింది.
అరియర్స్ లాంటివి రావడంతో ఆడబ్బు సర్దుబాటు చేసాడు ఫణి...గోపికకు
రెండు నెలలు గడిచాయి. అప్పటికే చాలాసార్లుగా లక్ష వరకు తీసుకున్నా కనీసం కొంతలో కొంతైనా తీర్చే ప్రయత్నం చెయ్యలేదు గోపిక.
ఫణి కూడా ఇబ్బంది పెట్టలేదు.
"ఉంటే తీర్చేసే మనిషే "అన్న భావంతో ఊరుకున్నాడు. సంవత్సరం క్రితం ట్రాన్స్ఫర్ అయింది ఫణికి....దూరంగా.
రోజూ ఫోన్లు, వారానికి ఒకసారి, నెలకోసారి గా మారాయి. క్రమంగా మూడునెలల కోసారి.అంతే
అప్పటికీ ఇస్తారులే అన్న భావం. "లెక్కాపత్రం లేనిది..ఆ
ఇచ్చిన డబ్బు కావడం తో ఎగగొట్టే మనిషి కాదులే" అనుకున్నాడు ఫణి.
రెండేళ్లు గడిచాయి...గోపిక భర్త మరణించాడు. ఇన్సూరెన్స్ డబ్బు ఐదు లక్షలు వచ్చింది అని తెల్సింది.
తనకు "యాభై వేలు అవసరం పడ్డాయని "ఫోన్ చేసి చెప్పాడు ఫణి.
"అయ్యో. ఇప్పుడెలా. ఈసారికెలానో సర్దుబాటు చేసుకోండి. మా ఆయన డబ్బు లక్ష రావాలి. అది వస్తే మీకు యాభై ఇచ్చేస్తాను." అంది గోపిక
"సర్లెండి. నా తిప్పలేవో నేనే పడతాను." అంటూ ఫోన్ పెట్టేసాడు ఫణి.
సంవత్సరం గడిచింది. ఫోన్ లేదు. డబ్బూ లేదు.
లక్ష ఇచ్చిన అనుభవం గొప్పగా అర్ధం అయింది ఫణికి.
ఒకసారి మనసు చికాకుగా ఉందని పార్కు కు వెళ్ళాడు.
వ్యతిరేకంగా కొంచెం దూరంగా ఉన్న బెంచినుండి
"మధు, ఈసారి ఓ ఇరవై సర్దవూ. వచ్చేనెలలో నీ అప్పు మొత్తం ముప్ఫయి వేలు తీర్చేస్తాలే. నాకు నిన్ను మించిన
ఆప్తులెవరున్నారు చెప్పు." అంటోందో ఆడగొంతు.
ఆగొంతెక్కడో విన్నట్టు అనిపించింది.
"అలాగే "అంది ఆ మగగొంతు.
గోపిక మరొకరికి వల విసిరిందని అర్ధం అయింది
ఫణికి. ..
-------౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦---------