Srinivasa Bharathi

Drama

3.8  

Srinivasa Bharathi

Drama

భోషాణం పెట్టె...శ్రీనివాస భారత

భోషాణం పెట్టె...శ్రీనివాస భారత

3 mins
544


"నా ఆస్తి నాకు పంచేయండి" వాసు అన్నాడు

తలపంకించాడు...తండ్రి పరాత్పరం."నీ ఆస్తి? "అంటూ.

"అదే నా వాటాగా రావాల్సింది?"

"చూద్దాం"

"అదేంటండి. అలాగంటారు .పిల్లాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి"..అంది సుమిత్ర భర్తతో

"మరేం చెయ్యమంటావ్?"

"ఏమీ చెయ్యలేకపోవడం ఏంటండీ"

"ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు"

"నా కదంతా తెలీదు. వాడు మనతో కలిసుండాలంతే" సుమిత్ర పట్టుపట్టింది.

"ఇష్టం లేని బ్రతుకు...నరకం సుమిత్రా.అసలింతకీ వేరేగా ఉండాలన్న ఆలోచన ఇప్పుడు వాడికెందుకు వచ్చిందని?"

"ఏమో. మొన్న కోడలు పిల్లకు మీ కిష్టమని పుట్టగొడుగుల కూర వండమన్నాను. వండలే. అయినా సర్దుకున్నాను. నిన్న ఆదివారం సెలవు కదా అని బట్టలు నానబెట్టమన్నాను.బహుశా అదే నా అపరాధం అయ్యుంటుంది."

"కావచ్చు. .మనం మలిసంధ్యలో ఉన్నాం...వాళ్ళింకా కొత్త జీవితాలు."

"మనం విడిపోతే వాడి బ్రతుకెలాగా?"

"రెక్కలు వస్తున్నాయిగా..ఎగరనీ."

"పడిపోతే?"

"క్రింద నిలబడి పట్టుకోమా. వదిలేస్తామా?"

"అయినా నాకిష్టం లేదు."

"వాడికి ఉండాలని ఇష్టం లేదు. మరీ బలవంత పెట్టావనుకో దూరంగా ట్రాన్సఫర్ చేయించుకుంటాడు."

"మీ ఇష్టం. ఇంత చెప్తున్నా...వినరేం?"

"అనుభవం అయితే కానీ అర్ధం కాని విషయాలు కొన్ని ఉంటాయి."

రెండు రోజులు గడిచాయి. కొడుకు కోడలు ఇద్దరూ ముభావంగానే పనులు చేస్తున్నారు..కలిసి ఉండలేం అని చెప్పకనే చెబూతూనే.

ఈ రెండు రోజులు పరాత్పరం అన్ని విషయాలు ఒకొక్కటిగా నిర్ధారణకి వచ్చాడు.

"వాసు. ఇలా రా" పిలిచాడు కొడుకుని.

పిలవకుండానే కోడలు కూడా వచ్చింది.

"సుమిత్రా "కేకేసాడు.

భార్య కూడా వచ్చి కూర్చుంది.కూతురు సౌజన్య తో

"ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు నా స్వార్జితం. ఇది మా తదనంతరమే నీకు చెందుతుంది. ..అదీ మా ఇద్దరిలో ఎవరు మరణం ఆఖరైతే , అప్పుడే.."

"అలాగే అవుతుంది "అనుకున్నాడు వాసు.

"ఇక మాగాణి 5ఎకరాలు. నీకు 3. మా ఇద్దరికీ 2.

మా ఇద్దరి మరణం తర్వాత మాత్రమే..ఆ భూమి నీ చెల్లెలుకు చెందుతుంది.ప్రక్క టౌన్ లో కొత్త అపార్ట్మెంట్...50 లక్షలది.నా రిటైర్మెంట్ డబ్బులతో కొన్నది.. మనుమరాలికి గిఫ్ట్ట్ గా ఇస్తున్నా. అందులో నువ్వు ఉండొచ్చు. అమ్మడానికి మాత్రం వీల్లేదు. అమ్మాయి మేజర్ అయ్యాక ఆమె ఇష్టం.ఇక కొంచెం దూరంలోని ఒక పెంకుటిల్లు ఉంది. అది నా కూతురికి బహుమానం."

ఇంకా పంచవలసినదేదో ఉండిపోయింది అన్నట్టు చూస్తున్నాడు వాసు.

పరాత్పరం నవ్వుకొన్నాడు.

"నగదు ఇప్పటిదాకా నాదగ్గరున్నది 20లక్షలు. అది  ఫిక్స్డ్ చేసాను మొన్నే. మనుమరాలికి 5, నీకు 5, కోడలికి 3 లక్షలు.మిగిలిన దాన్లో 3మీ అమ్మకు, 2 మీ చెల్లాయికి, 2 నాకు. అమ్మది, ఆఖరున సౌజన్యదే. నీకే విధమైన హక్కు లేదు.నా వాటా మాత్రం మళ్ళీ మనుమరాలుకే."

వాసు మరేమీ మాట్లాడలేదు.

పంపకాలన్న పేరే గాని తనకే సింహ భాగం.

కూతురు వాటా పెద్దగా లేదు. తండ్రి లేదా తల్లిది కలిపినా తనతో పోలిస్తే తక్కువే.

"పెన్షన్ తండ్రిది...తర్వాత తల్లిది. పట్టుబడితే మళ్ళీ కలిసుండాలి. వదిలించుకుందాం అనుకొనేటపుడు...

ఇంకేం మాట్లాడినా మొదటికే మోసం రావొచ్చు" అనుకున్నాడు..వాసు.

"రేపు నా నిర్ణయం చెప్తాను నాన్నగారూ "అన్నాడు వాసు..మొదటి సారిగా గారు తగిలిస్తూ.

గారు ఆప్యాయతల్ని దూరం చేస్తుంది అనుకున్నాడు పరాత్పరం....కొత్తగా డబ్భు ఏర్పరచిన బంధం.

"అలాగే.మంచి పౌరాణికం సినిమా వచ్చిందట. మా ఇద్దరం వెళతాం."

"మీ ఇష్టం.. "అన్నాడు వాసు లోలోపల తామిద్దరూ నిదానంగా, ఫ్రీగా చర్చించుకోవచ్చు అన్న ఆలోచనతో.

కూతురు కూడా మరేమీ మాట్లాడలేదు. అల్లుడు శిష్యుడే కావడంతో ..మామగారి ఆస్తి మీద అస్సలు ఆలోచనే చెయ్యొద్దన్నాడు సౌజన్యతో..బయల్దేరే ముందే

స్వయం కృషితో గుమస్తాగా జాయిన్ అయ్యి అఫీసర్ అయిన అతడికి , తాను అనాథనే అయినా ఆర్ధికంగా ఆదుకుని ఉద్యోగం పొందే వరకు అండదండలు అందించిన పరాత్పరం మాస్టర్ మేలుమరువలేదతడు.

కట్నం పేచీతో ఆగిపోబోతున్న మాస్టర్ గారి అమ్మాయిని

వివాహం చేసుకొని కొంతైనా రుణం తీర్చుకోగలిగా ననుకున్నాడు...సౌజన్య అంటే బైట పెట్టలేనంత ఇష్టంతో.

సినిమా పూర్తయింది...

చేతికఱ్ఱను, భార్యను తీసుకొని బయల్దేరాడు పరాత్పరం.

ఇంట్లో...

రేపటి నుండి తానే ఓ ఇంటికి యజమాని అన్నభావం వాసులో కలిగితే...దారం తెగిన గాలిపటం భావం పరాత్పరానిది.

అంగీకారాన్ని వాసు సంతకం రూపంలో చెప్తే, సాక్షులు ధ్రువీకరించారు....పంపకాలు జరిగి పోయాయి అధికారికంగా..

సంవత్సరం గడిచింది.

ఈ మధ్య కాలంలో రెండంటే రెండు సార్లు, అది గట్టిగా ఒక గంట కాలం పట్టుమని ఇంట్లో నైనా లేకుండా...

పరాత్పరం విరక్తిగా నవ్వుకున్నాడు...సుమిత్ర బాధగా లోలోపల కుమిలింది.

"నా మరణాంతరం... రంగూన్ భోషాణం పెట్టె నీదే. అమ్మకీ, చెల్లాయికి చెప్పానులే."భోజనాల దగ్గర చెప్పాడు తండ్రి.

వాసు మరేం మాట్లాడలేదు. అది అంత ముఖ్యం కాదనుకున్నాడు.

పైకి మాత్రం "మీ ఇష్టం" అన్నాడు.

ఇది గడిచి సంవత్సరం అయింది. వాసు బాగానే సంపాదించుకొంటున్నాడు అని కొందరు చెప్తే విని ఆనందించాడు పరాత్పరం.

ఒకరాత్రి వేకువ ఝామున నిద్రలోనే కన్నుమూశాడు పరాత్పరం.

తెల్లవారి కబురు...

అరగంట అటూ ఇటూలో అందరూ చేరారు.

కర్మకాండ క్రతువు అల్లుడే చేసాడు..పరాత్పరం చివరికోరికగా ...తల్లి గట్టిగా చెప్పింది ఆ మాటని.

నెల గడిచింది. తండ్రి ఇచ్చిన భోషాణం పెట్టెను ఇంటికి

తరలించాడు వాసు. .తనకిచ్చిన తాళంతో తెరిచాడు.

అన్ని అరలు ఖాళీ చేసేసరికి పావుగంట పట్టింది.

చాలా వరకు చిన్న పిల్లల బట్టలు, ఆట వస్తువులు.

ఆ వస్తువులన్నీ అతడికోసం కొన్నవే.

చిన్నప్పటి జ్ఞాపకాల ప్రతిరూపం....తనకిష్టం ఐన చిరుగుల గళ్ళ చొక్కా...శరణాలయంలో వేసుకున్నది.భద్రంగా గత 30 ఏళ్లుగా.

ఆ పెట్టెలోనే తన బ్రతుకుందని అతడి కప్పట్లో తేలీదు.

ఎన్నోసార్లు విసుక్కున్నాడు..దానిమీద.

అట్టడుగున..ఒక లామినేషన్ పేపర్..తనని అనాధ నని

ధ్రువ పరుస్తూ...శరణాలయం వారి స్టాంప్ పేపర్.

గుండెలు పగిలేలా అప్పుడేడ్చాడు...వాసు.

తన తర్వాత చాలా కాలానికి పుట్టిన స్వంత కూతురు సౌజన్య కన్నా..తననెంతగా ఆ తల్లిదండ్రులు ప్రేమించిందీ అర్థమై.

    ........zzzzzzzzzzzzzzzzzzzzzzz...........


Rate this content
Log in

Similar telugu story from Drama