PVV Satyanarayana

Crime

3.3  

PVV Satyanarayana

Crime

నిందితుడు

నిందితుడు

7 mins
154


                                                          నిందితుడు

                                                        రచనః తిరుమలశ్రీ

                                                             ***

     “మిస్టర్ రాకీ! యు ఆర్ అండర్ అరెస్ట్…” అన్నాడు ఇన్ స్పెక్టర్. “ఇప్పుడు మీరు ఏం చెప్పినా అది మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించుకోబడుతుందన్న సంగతి గుర్తుంచుకోండి”.

     శుష్కహాసం చేసాను నేను. బైటనుండి కేకలు, అరుపులు వినవస్తున్నాయి. కిటికీ తెర తొలగించి చూసాను. మహిళాలోకం సునామీలా నా ఇంటి మీద పడింది! అప్పటికప్పుడే అంతమంది అక్కడికి ఎలా చేరుకున్నారో ఆశ్చర్యమే నాకు! వాళ్ళ చేతుల్లో ప్లకార్డ్స్. అన్ని సందర్భాలకూ అవి సిద్ధంగా ఉంటాయి కాబోలు!...‘భార్యాహంతకుణ్ణి ఉరికంబం ఎక్కించాలి!...లేడీ కిల్లర్ని చంపేయాలి!...ఆ దుర్మార్గుణ్ణి మాకు అప్పగించాలి!...’ – బైటనుండి నినాదాలు!...

                                                             2

     కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజును చూసి బైటకు వస్తుంటే, “ఎక్స్ క్యూజ్ మీ!” అన్న కోమలస్వరం వినిపించి వెనుదిరిగి చూసాను నేను. ఎదురుగా ఓ అందమైన యువతి.

 “నా పేరు సానియా. అబ్దుల్లా గారి భార్యను” అంటూ పరిచయం చేసుకుంది.

అబ్దుల్లా ఎవరో చటుక్కున గుర్తుకురాలేదు నాకు. “వారం క్రితం దిల్ షుక్ నగర్ లో జరిగిన ఉగ్రవాదుల బాంబ్ బ్లాస్టుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి చేర్చారు మీరు. అతను నా భర్త అబ్దుల్లా,” అంటూ తన సెల్ ఫోన్లో అతని ఫోటోని చూపించిందామె.

గుర్తుపట్టి, “ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన?” అనడిగాను.

“ఇంకా కోమాలోంచి కోలుకోలేదు” అంటుంటే, ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచాయి.

చలించిపోయాను నేను. ఆడది కన్నీరుపెడితే సహించలేను. అది ఎవరైనా సరే! “పరవాలేదు. భగవంతుడి దయవల్ల ఆయన తప్పకుండా కోలుకుంటారు” అన్నాను ఓదార్పుగా.

“నా భర్తను కాపాడిన వ్యక్తి మీరేనంటూ ఆసుపత్రి సిబ్బంది మిమ్మల్ని చూపించారు,” అందామె. “మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియడంలేదు”.

“ఆ పరిస్థితుల్లో ఎవరైనా అదే పని చేసేవారు” అన్నాను…

సినిమాలలో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నాను నేను. సుమారు పాతిక సినిమాలకు స్టంట్ డైరెక్షన్ చేసాను. ప్రస్తుతం నేను ఫైట్ స్ కంపోజ్ చేస్తున్న సినిమా క్లైమాక్స్ సీన్స్ ని ఔట్ డోర్ లో తీయాలని, లొకేషన్ సెర్చ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రాజుతో కలసి సిటీ బైట వివిధ ప్రదేశాలను సందర్శించి తిరిగివస్తుండగా జరిగింది దిల్ షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్. ప్రేలుళ్ళకు కాస్త దూరంగా ఉండడంవల్ల మా కారుకు డేమేజ్ పెద్దగా జరుగలేదు. గాజుపెంకులో, ఇనుపముక్కలో లోపలికి చొచ్చుకుపోవడంతో నా ఎడమ భుజానికి తీవ్రమైన గాయమై రక్తం ధారలు కట్టింది. వెంకట్రాజు ట్రౌమాకి గురయ్యాడు. ఎందరో ప్రాణాలు కోల్పోతే, మరెందరో గాయపడ్డారు. మాకు చేరువలో మధ్యవయస్కుడొకడు తీవ్రంగా గాయపడి, ‘దాహం…దాహం…’ అంటూ అరుస్తున్నాడు హీనస్వరంతో. ఒకరినొకరు పట్టించుకునే స్థితిలో లేరు. ఆంబులెన్సులు రావడానికి సమయం పడుతుంది. ఆ లోపున అతను చనిపోయేలా ఉన్నాడు. నా గాయాన్ని లెక్కచేయకుండా వెంటనే అతన్ని చేతుల్లో ఎత్తుకుని కారులోకి చేర్చాను. వెంకట్రాజును లాక్కెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టాను. ఒంటి చేత్తోనే డ్తైవ్ చేసుకుంటూ సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాను. ఆ వ్యక్తిని డాక్టర్స్ కి అప్పగించి, రక్తస్రావం అధికంగా కావడంతో కుప్పకూలిపోయాను నేను. అర్థరాత్రి వేళ తెలివిలోకి వచ్చాక ఆ వ్యక్తి గురించి అడిగితే, అతనికి ప్రాథమిక చికిత్స చేసి కేర్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. తెల్లవారాక వెంకట్రాజు, నేను కూడా కేర్ ఆసుపత్రికి షిఫ్ట్ అయిపోయాము. రెండు రోజుల తరువాత భుజానికి బ్యాండేజ్, చేతికి స్లింగ్ తో నేను ఆసుపత్రి నుండి బైటపడితే…ఇంకా ట్రౌమానుంచి కోలుకోని వెంకట్రాజు ఆసుపత్రిలోనే కొనసాగుతున్నాడు. నేను రోజూ వచ్చి అతన్ని చూసి వెళుతున్నాను…..

సానియా కూడా రోజూ రెండుపూటలా భర్తకోసం వస్తుండేది. దాంతో మేము రోజూ పలుకరించుకోవడము, మా పరిచయం పెరగడమూ జరిగాయి…సానియాకి ముప్పయ్యేళ్ళుంటాయి. స్లిమ్ గా, ఫెయిర్ గా, పొడవుగా, లావణ్యం ఉట్టిపడుతూ…పాతికేళ్ళ యువతిలా కనిపిస్తుంది. ఆమె నవ్వితే బుగ్గలు చొట్టలుపడి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఓసారి ఐ.సి.యు.లో ఉన్న అబ్దుల్లాని చూసివచ్చాను. ఇంకా కోమాలోనే ఉన్నాడు…ఇంచుమించు నలభై ఐదేళ్ళుంటాయి అతనికి. స్థూలత్వానికి వయసు తెచ్చిన బొజ్జ తోడయింది. ముఖంలో కఠినత్వం. సానియాని అతని పక్కను ఊహించుకుంటే, ‘కాకి ముక్కుకు దొండపండు’ సామెత గుర్తుకు రాకమానదు.

అబ్దుల్లా హైటెక్ సిటీలో ఉన్న ‘హోటల్ అరిస్టో’ కి యజమాని అని సానియా చెప్పడంతో విస్తుపోయాను నేను. ఓ త్రీ-స్టార్ హోటల్ అది. నా విస్తుపాటుకు కారణం అది కాదు – అదే హోటల్లో నా భార్య అమల రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది! కోటీశ్వరుడైన వ్యక్తికి భార్య అయివుండీ సానియా సామాన్యురాలిలా స్కూల్లో టీచర్ గా పనిచేస్తోందని ఆలకించి ఆశ్చర్యపోతుంటె, “చిన్నప్పట్నుంచీ టీచింగంటే ఇష్టం నాకు” అని నవ్విందామె. అంతటి అందగత్తె, వయసులో తనకంటె అంత పెద్ద వ్యత్యాసం ఉన్న అబ్దుల్లా లాంటి వ్యక్తిని పెళ్ళాడడం చిత్రంగా తోచింది నాకు…వెంకట్రాజును డిశ్చార్జ్ చేసిన రోజున-అవసరమైతే ఫోన్ చేయడానికి సంశయించవద్దని చెప్పి, సానియాకు నా ఫోన్ నంబర్ ఇచ్చాను…

                                                             3

సి.సి. కెమేరాల ఆధారంగా దిల్ షుక్ నగర్ బ్లాస్టులకు కారకులైన ముగ్గురు అనుమానితుల ఫొటోలను విడుదలచేసారు పోలీసులు. వారికోసం ముమ్మరంగా గాలింపు మొదలయింది.

ఓ రోజున సానియా ఫోన్ చేసింది నాకు, తనను కలుసుకోవడానికి వీలవుతుందా అని. ఆమె స్వరంలో మునుపటి ఉత్సాహం కనిపించలేదు…మర్నాటి రాత్రి హోటల్ మేరియట్ లో కలుసుకున్నాం మేము. ఆమె వదనంలో విషాదం తాండవిస్తోంది. “హౌ ఈజ్ హీ?” అనడిగాను. ఆమె చెప్పిన సమాధానం నన్ను ఖంగు తినిపించింది. రెండు వారాల క్రితం అబ్దుల్లా కోమాలోంచి బైటపడకుండానే చనిపోయాడట!

“అయామ్ వెరీ సారీ!” సంతాపం వెలిబుచ్చాను. మౌనంగానే డిన్నర్ పూర్తిచేసాము.

బైలుదేరేముందు అందామె, “నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి మీకంటె మంచి మిత్రులు ఎవరూ కనిపించడంలేదు నాకు. వీలైతే ఓసారి మా ఇంటికి రాగలరా?”.

రెండు రోజుల తరువాత ఆమె ఇంటికి లంచ్ కి వెళ్ళాను నేను. అధునాతనంగా నిర్మింపబడ్డ పెద్ద భవంతి అది. ఇంటెరియర్ డెకొరేషన్ చాలా రిచ్ గా ఉంది. అంగుళం అంగుళానా ఐశ్వర్యం ఉట్టిపడుతోంది.

“ఇవాళ నౌకర్లందరికీ సెలవు ఇచ్చేసాను” అంది సానియా, టేబిల్ పైన లంచ్ ఎరేంజ్ చేస్తూ. అంటే వంట తానే చేసిందన్నమాట. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాము. ఆమె నాతో పంచుకోవాలనుకుంటున్న వ్యక్తిగత విషయాలు ఏమిటా అని కుతూహలంగా ఉంది నాకు.

కాసేపటికి ఏదో ఫైల్ తీసుకువచ్చింది సానియా. అందులోంచి మూడు ఫోటోలు తీసి నాకు చూపించింది. ఆమె భర్త అబ్దుల్లా ఎవరో వ్యక్తులతో కలసి తీయించుకున్నవి అవి. “వీటిలో నా భర్త పక్కనున్న వ్యక్తులను సరిగా చూడండి” అందామె.

రెండిటిలో ఇద్దరు వ్యక్తులతోను, ఒకదానిలో ఓ వ్యక్తితోను ఉన్నాడు అబ్దుల్లా. ఆ వ్యక్తులను పరిశీలనగా చూసాను. వారిని ఎక్కడో చూసినట్టనిపిస్తోంది.

సోనియా చెప్పింది ఆలకించి నిశ్చేష్టుడనయ్యాను…దిల్ షుక్ నగర్ బ్లాస్టు కేసుల్లో పోలీసులు వెదుకుతున్న అనుమానిత వ్యక్తులు వాళ్ళు!

“నా భర్త మరణం తరువాత ఆయన పర్శనల్ క్యాబినెట్ ని తెరచి చూస్తే ఇతర పత్రాలతో పాటు ఈ ఫొటోలు కనిపించాయి…” అంటూ ఆమె వివరంగా చెప్పుకుపోయింది…

‘అబ్దుల్లా స్కూల్ డ్రాపౌట్. పెళ్ళికి ముందు ఓ టీకొట్టు ఉండేది అతనికి. గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఐదేళ్ళ తరువాత తిరిగివచ్చాడు. రాగానే ఓ చిన్న సైజు హోటల్ ప్రారంభించాడు. ఏడాది తిరక్కుండానే అది త్రీ-స్టార్ హోటల్ గా రూపొందింది. గల్ఫ్ కు వెళ్ళి బాగా సంపాదించాడనుకున్నారు అంతా. బంధువుల ప్రోద్బలంతో సానియాకి అతనితో నిఖా జరిగింది…ఐతే ఇప్పుడు బైటపడ్డ పత్రాలను పరిశీలిస్తే అతను హవాలా ర్యాకెట్ నడిపేవాడన్న నిజం బైటపడింది. ఉగ్రవాదులతో అతనికి సంబంధాలు ఉన్నాయనీ, పరోక్షంగా వారికి సాయపడుతున్నాడని తెల్లమవుతోంది…’

ఆ కఠోరసత్యాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది నాకు.

“ఆయన తన అవినీతి చర్యలతో కోట్లకొద్దీ అక్రమాస్తులను సంపాదించినట్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి,” వాటిని నాముందు పడేస్తూ అంది సానియా. “వీటిలో కొన్నిటికి ఎవరో యువతి బీనామీగా కూడా ఉంది”.

వాటిని తిరగేసిన నేను ఉలికిపడ్డాను. అందులో ఆ యువతి ఫొటో, పేరు, వయసు, చిరునామా ఉన్నాయి. “హోటల్ ముసుగులో నా భర్త దేశద్రోహ కృత్యాలకు పాల్పడేవాడన్న ఊహే నాకు మ్రింగుడుపడడంలేదు. బ్లాస్ట్ జరిగిన రోజున ఆయన ఉగ్రవాదులతో కలసి దిల్ షుక్ నగర్ కి వెళ్ళుంటాడని అర్థమవుతోంది. ఐతే వాళ్ళు అక్కడ బ్లాస్టులు జరుపుతారని ఎరిగివుండడు…” ఆమెతో అంగీకరించాను నేను.

ఓ క్షణం ఆగి నెమ్మదిగా అందామె, “అబ్దుల్లా ఇక లేడు. పోయిన మనిషిని ఎక్స్ పోజ్ చేయడం నాకు ఇష్టంలేదు. అందుకే ఏం చేయాలో తోచక ఈ రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను…” మాట్లాడలేదు నేను. “ముందుగా ఆ యువతి ఎవరో, నా భర్తకు ఆమెతో గల సంబంధం ఏమిటో…ఆమెకు కూడా ఆ హవాలా ర్యాకెట్ తో గాని, ఉగ్రవాదులతో గాని సంబంధాలు ఉన్నాయేమో…తెలుసుకోవాలి” అందామె మళ్ళీ.

ఆ యువతి నా భార్య అమల! ఆమె హోటల్ అరిస్టోలో రిసెప్షనిస్టు. అబ్దుల్లా ఆమె బాస్…ఆ విషయం చెప్పలేదు నేను.

సానియా దగ్గర సెలవు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చాను. ఆ సమయంలో అమల హోటల్లో ఉంటుంది…అమల బీరువా వెదికాను. అడుగున ఉన్న సీక్రెట్ అరలోంచి పత్రాలు కొన్ని బైటపడ్డాయి. వాటిలో సానియా ఇంట్లో చూసిన వాటికి నకళ్ళు కూడా ఉన్నాయి…సిగరెట్ వెలిగించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను…వాటి గురించి అమల నాకెప్పుడూ చెప్పలేదు. ‘అబ్దుల్లా తన దొంగ ఆస్తులకు అమలను బీనామీగా ఎంచుకున్నాడంటే…వారి మధ్య గల సంబంధాలు ఎటువంటివి!?’ అన్న ప్రశ్న తేలుకొండిలా పొడిచింది నన్ను. తన శీలం పైన నాకు అనుమానంలేదు. కాని, తెలిసో తెలియకో అబ్దుల్లా యొక్క ఉచ్చులో చిక్కుకున్నదేమోనన్నదే నా భయం!...

హఠాత్తుగా నా ఎదుట ప్రత్యక్షమయింది అమల. ఆమె డ్యూటీ రాత్రి ఎనిమిది గంటల వరకూను. కాని, ఆ రోజు ఎందుకో త్వరగా వచ్చేసింది!

“నేను లేని సమయంలో నా బీరువా ఎందుకు తెరచావ్?” తీవ్రంగా అంటూ నా చేతిలోని పత్రాలను లాక్కుంది. ఆ పత్రాలను గురించీ, అందులోని ఆస్తులను గురించీ, అబ్దుల్లాకి తాను బీనామీగా వ్యవహరించడం గురించీ…నిలదీసాను నేను. అది మా మధ్య ఘర్షణకు దారితీసింది.

“నువ్వు అమ్మాయిలతో రెస్టారెంటుల చుట్టూ తిరగడము, డిన్నర్లు చేయడమూ…నాతో చెప్పే చేస్తున్నావా?” అంటూ ఎదురు దాడికి దిగింది. సానియాతో నేను హోటల్లో డిన్నర్ చేయడం గురించి తనకు ఎలాగో తెలిసిపోయిందని అర్థమయింది నాకు…మా మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందంటే, ఇరుగు పొరుగు ఇళ్ళలోని వారంతా టీవీ ఎపిసోడ్ లా మా ఇంటి వంకే చూడనారంభించారు. కిటికీ తలుపులు మూసేసాను.

ఉద్రేకం అధికమయినప్పుడు నా శరీరం కంపించడమే కాక, మైకం క్రమ్మి ఫెయింట్ అయిపోవడం కద్దు. రెండేళ్ళ క్రితం ఓ ఫిల్మ్ కోసం చిత్రీకరిస్తున్న ఓ ఫైట్ సీక్వెన్స్ లో తలకు తీవ్రంగా గాయమయింది నాకు. వారం రోజులపాటు కోమాలోనే ఉండిపోయాను. ఆ తరువాత కోలుకున్నా ఆ గాయం మూలంగా, ఆవేశోద్రేకాలకు అతిగా లోనైతే ఆ పరిస్థితికి గురికావడం జరుగుతోంది. కొద్ది క్షణాల తరువాత కాని తెలివిలోకి రావడం జరుగదు.

ఆ రోజు అత్యంత ఉద్రిక్తతకు గురికావడంతో మైకం క్రమ్మి పడిపోయాను నేను. స్పృహలోకి వచ్చేసరికి అమల అక్కడ లేదు… టీ పెట్టుకుందామని కిచెన్ కి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించబోతే, హాల్లోంచి అలికిడి వినిపించింది. అటువైపు వెళ్ళాను, అమల దగ్గరి పత్రాలను తీసుకుని కాల్చేయాలని. తరువాత వాటి సంగతి వెలుగులోకి వస్తే, తాను ప్రమాదంలో చిక్కుకోకూడదన్నదే నా ఆలోచన. అమల హాల్లో కనిపించలేదు. సిగరెట్ ముట్టించి, ఇల్లంతా వెదికాను. కనిపించలేదు. ఫ్రస్ట్రేషన్ తో చేతిలోని సిగరెట్ బట్ ని కోపంగా విసిరికొట్టి బైటకు నడచాను. ఐతే, అది కిచెన్లో పడడమూ, అంతకుముందు నేను ఆన్ చేసి ఉండడంతో గ్యాస్ లీకయ్యి ప్రేలుడు సంభవించడమూ తృటిలో జరిగిపోయాయి. కిచెన్ అంటుకుని కాలుతోంది. హాల్లో ఉన్న నేను దూరంగా ఎగిరిపడి స్వల్పగాయాలతో బైటపడడం జరిగింది. ఎదురుచూడని ఆ సంఘటనకు కొయ్యబారిపోయాను నేను.

క్షణాలలో అక్కడి వాతావరణం మారిపోయింది. ఇరుగుపొరుగులు పరుగెత్తుకు రావడము, మంటలు ఆర్పడానికి ప్రయత్నించడము, ఫోన్ కాల్స్ అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీసులూ రావడమూ జరిగాయి…అమల జాడ లేదు. అంతకు మునుపు మా గొడవలను ఆలకించిన ఇరుగుపొరుగులు, నేను గ్యాస్ లీక్ చేసి తనను చంపేసానని ఫిర్యాదు చేసారు పోలీసులకు. మహిళాసంఘాలు కూడా రంగంలోకి దిగడంతో, పోలీసులు నన్ను అరెస్ట్ ఐతే చేసారు కాని, అమల యొక్క డెడ్ బాడీని మాత్రం కనిపెట్టలేకపోయారు!

న్యాయస్థానం నాకు పధ్నాలుగు రోజులపాటు జుడిషియల్ రిమాండుని విధించింది…ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమల చచ్చిపోయిందన్న బాధ ఒక వంకా, భార్యాహంతకుడన్న ముద్ర మరో వంకా కృంగదీసాయి నన్ను…దినపత్రికలలో వార్తలు చూసి నన్ను పరామర్శించడానికి వచ్చిన సానియా, నాకు బెయిల్ ఇప్పిస్తానంటే వద్దన్నాను…

వారం రోజుల తరువాత ఓ రోజున జైలర్ వచ్చి చెప్పిన విషయాలు నాకు సంతోషాన్నీ, దుఃఖాన్నీ కూడా కలిగించాయి…అమల మంటల్లో పడి చనిపోలేదట. ఆ సమయంలో తాను ఇంట్లో లేదట. ఎక్కడికో స్కూటర్ పైన వెళుతూ ఓ రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితిలో ప్రభుత్వాసుపత్రిలో చేర్చబడిందట. ఆ రోజు ఉదయమే ఆమె కోమాలోంచి బైటపడడంతో, వివరాలు తెలుసుకుని నాకోసం కబురుపెట్టారట…నా నిర్దోషిత్వం రుజువయిందన్న దానికంటె, అమల బతికి ఉన్నందుకే మిక్కిలి ఆనందం కలిగింది నాకు. ఐతే, ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న అమలను చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది.  

‘ఆ రోజు నాతో గొడవపడిన అమల, నాకు స్పృహతప్పడంతో కోపంతో అలాగే వదిలేసి స్కూటర్ ఎక్కి బైటకు వెళ్ళిపోయిందట. తన పేరిట ఉన్న ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్లను తెచ్చుకునేందుకని అబ్దుల్లా ఇంటికి బైలుదేరిందట. దారిలో సిటీబస్ ఒకటి వెనుకనుండి వచ్చి గ్రుద్దుకోవడంతో ఎగిరి దూరంగా పడిపోయిందట. ఆ తరువాత ఏం జరిగిందీ తనకు తెలియదట…’ - హీనస్వరంతో అమల జరిగింది చెబుతుంటే నా మది గిలగిల కొట్టుకుంది. ఆ స్థితికి నేనే కారణమన్న అపరాధభావన నా గుండెలను పిండేసింది. నాపైన మోపబడ్డ ఆరోపణ గురించీ, నేను జైలుకు వెళ్ళడం గురించీ తెలుసుకుని బాధపడింది అమల. పోలీసులను పిలిపించి తన వాంజ్ఞ్మూలం నమోదు చేయించింది… ఆ రాత్రే చనిపోయింది తాను, నన్ను ఒంటరివాణ్ణి చేసి…

నెల్లాళ్ళ తరువాత సానియా నా వద్దకు వచ్చింది. “అబ్దుల్లా కారణంగా ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో…ఊహించుకుంటేనే ఒడలు జలదరిస్తోంది నాకు,” అందామె. “అబ్దుల్లా అక్రమంగా సంపాదించించిన ఆస్తులన్నిటినీ, హోటల్ తో సహా, ఛారిటీస్ కి రాసేసాను నేను”.

ఓ క్షణం విస్తుపాటుకు గురైనా, ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాను నేను. “కాని…మీరు…” అంటున్న నా పలుకులకు మధ్యలోనే అడ్డుపడుతూ అందామె చిరునవ్వుతో – “ఇకనుంచి మీరు కాదు, నువ్వు…” “అదే…నీ జీవనోపాధికి కొంత…” అర్థోక్తిలో ఆగాను.

“నా టీచర్ ఉద్యోగం నాకు చాలు. పిల్లలకు చదువు చెప్పుకుంటూ శేషజీవితాన్ని గడిపేస్తాను” అంది.

ఓ క్షణం మా నడుమ నిశ్శబ్దం అలముకుంది. దాన్ని ఛేదిస్తూ అన్నాను నేను – “నీకు అభ్యంతరం లేకపోతే…నీకు తోడుగా నేను ఉంటాను…”

కన్నుల్లో మెరుపులతో, చిరునవ్వు రువ్విందామె. తామరతూడలా ఉన్న నాజూకైన తన చేతిని ముందుకు చాచింది. సంతోషంతో దాన్ని అందుకుని ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను నేను.


Rate this content
Log in

Similar telugu story from Crime