Radha Krishna

Comedy Inspirational Others

4  

Radha Krishna

Comedy Inspirational Others

మోసానికి మోసం

మోసానికి మోసం

6 mins
426


" లక్ష్మీ! మీ ఆయన ఊరు నుండి ఎప్పుడట వచ్చేది"? అని అడిగింది ఒడ్డు , పొడుగు, తాటిచెట్టులా ఉన్న సీతారత్నం.


"ఈ పాటికి వచ్చేయాలి, ఇంకా రాలేదు...అదే చూస్తున్నాను" ..అంటూ సమాధానం ఇచ్చింది మదరాసీ పడుచు లక్ష్మి.


"అవునా! అయితే ఇంకా రాలేదు కదా...నాకో చిన్న సాయం చేస్తావేంటి ఈలోగా" అంటూ లక్ష్మి వైపు సంశయంతో చూస్తూ అడిగింది సీతారత్నం.


"ఇప్పడికిప్పుడు అంటే కొంచెం కష్టమే సీతారత్నం గారు" అంటూ వీధి గుమ్మంవైపు దృష్టి సారిస్తూ చెప్పింది లక్ష్మి.


"అబ్బే, ఇప్పుడు అంటే ఇప్పుడే ఏమీ కాదులే. రేపటి ఉదయం పది గంటల లోపు....ఒక్క వెయ్యి రూపాయలు ఉంటే చేబదులుగా ఇస్తే..."!!


" ఆ ఇస్తే..."


" ఒక్క వారం రోజులలోగా వాపసు చేసేస్తాను"...అని బదులిచ్చింది సీతారత్నం.


తాను ఆ వీధిలోకి వచ్చిన తరువాత ఇరుగుపొరుగు   వారు సీతారత్నం అలవాట్లను, అభిరుచులను క్లుప్తంగా (చాలా ఎక్కువేనండోయ్) చెప్పగా విని, మరికొంత సూక్ష్మంగా (విపులంగా) తెలుసుకున్నదైన లక్ష్మీ...


"భలే వారే సీతారత్నం గారు! మీరు అడిగితే నేను కాదనడం కూడానా..! రేపటి వరకు ఎందుకు..! ఉండండి..ఇప్పుడే తీసుకువస్తాను" అని లోపలికి వెళ్ళింది.


"ఇదిగోనండి, మీరు అడిగిన వెయ్యి రూపాయలు. అంతే కాదు, మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా, నేరుగా మా ఇంటి తలుపు తట్టండి " అని లక్ష్మి డబ్బులు తీసి సీతారత్నానికి అందించింది.


ఇలా పదే పదే చేబదులు పేరుతో లక్ష్మి దగ్గర 50వేల వరకు తీసుకుంది సీతారత్నం.


లక్ష్మీ వాళ్ళు ఆ వీధిలోకి వచ్చాక, సీతారత్నం చేబదులు వ్యాపారం నీడ మిగిలిన ఇళ్ళమీద నుండి లక్ష్మీ ఇంటిమీద ప్రసరించడం మొదలైంది. ఈపరిణామంతో మిగిలిన కాలనీ వాసులు కొంత ఊపిరి తీసుకున్నారు.


ఒక రోజు లక్ష్మి ఇంటికి వచ్చినపుడు, అప్పుడే డబ్బు విషయమై ఫోన్లో మాట్లాడుతూ ఉన్న లక్ష్మిని గమనించింది సీతారత్నం.


ఫోను సంభాషణ పూర్తైన తరువాత ఇటు తిరిగిన లక్ష్మికి ఎదురుగా జెండా కొయ్యలా ఉన్న సీతారత్నం కనబడింది.


వెంటనే..


"మీరా..రండి రండి కూర్చోండి. ఒక్క పది నిముషాలు ఉండండి. చిన్న లావాదేవీ విషయమై, ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను". అంటూ ఫోన్ తీసుకుని, సీతారత్నానికి వినబడేలా....


"తమ్ముడూ, నువ్వు అలా అంటే ఎలా..? మనము ఎన్ని ప్రణాళికలు వేశాము ఈ అవకాశం కోసం ? అలా ఎలా వదిలేస్తాము అంతటి మంచి అవకాశాన్ని.? అందులో గనక మనం విజయం సాధిస్తే కోటి రూపాయలు మన సొంతం అవుతాయి.!"


" సరే ! అది అటు ఉంచి, ఇప్పుడు మనం ఈ కోటి సాధించడానికి ఎంత డబ్బు కట్టాలి..? ఏంటి పది లక్షలా..? అంటే, పది లక్షలు కట్టేస్తే మనకు కోటి వచ్చేస్తుందా...? సరే అయితే, నేను మీ బావగారిని అడిగి చూస్తాను. ఒక వేళ కుదరకపోతే, వేరే ఎవరిదగ్గరైనా అప్పు తీసుకునైనా మనం అనుకున్న కోటి రూపాయలు సాధిద్దాం. నేను అదే ప్రయత్నంలో ఉంటాను. డబ్బు సర్దుబాటు అవగానే ఫోన్ చేస్తాను. ఏంటి ! రెండు రోజుల్లోనేనా...? సరే, నా ప్రయత్నం నన్ను చెయ్యని. ఉంటాను" అంటూ ఫోన్ పెట్టి సీతారత్నం దగ్గరకు వచ్చింది లక్ష్మి.


"ఏమిటోనండీ సీతారత్నం గారు...! అదృష్టం గుమ్మం వరకూ వచ్చి, గుమ్మం దాటడానికి మాత్రం సంకోచిస్తోంది" అంటూ విచారమైన వదనంతో కూర్చుంది లక్ష్మి.


ఇంతలో మెరుపు లాంటి ఆలోచన వచ్చిన దానిలా...


"సీతార్నాతం గారు...మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి. ఇప్పటివరకు, నాకు వేరొకరి సహాయం అర్ధించకుండానే కాలం గడిచింది. కానీ, ఇప్పుడు మాత్రం తప్పడం లేదు. ఇంతకు విషయం ఏమిటంటే"...అంటూ అప్పటి వరకూ తన తమ్ముడితో మాట్లాడిన విషయం వివరిస్తూ (కావాలనే) ...." అది సంగతి సీతారత్నం గారు. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకుని , ఆ పదిలక్షలు మీరు నాకు చేబదులుగా ఇస్తే, నాకు కోటి రూపాయలు రాగానే, మీ పది లక్షలు మీకు ఇచ్చేస్తాను...ఈ సాయం కేవలం మంచి మనసు, డబ్బు మీద వ్యామోహం లేనటువంటి మీలాంటి ఉత్తములే చేయగలరు" అంటూ సీతారత్నాన్ని కొంత ప్రస్తుతించింది లక్ష్మి.


ఎప్పుడూ తను అందరినీ చేబదులు (అప్పు) అడగడము, దానిని గాంధీగారి ఖాతాలో జమ చేసేసుకోవడమే గాని, తను తిరిగి చెల్లించడం గాని, తనని ఎదురు అప్పుడిగిన వాళ్ళుగాని, ఈ కాలనీలో ఇప్పటివరకు ఎవరూలేని సీతారత్నానికి మొట్టమొదటి సారిగా 'ఎదురు అప్పు' అనే మాట కొంత కొత్తగా అనిపించినా...'కోటి' అనే మాట చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉండేసరికి, సీతారత్నం ముఖంమీద ఆశ 40వాట్ led బల్బులా వెలగడం గమనించిన లక్ష్మి, ...


"పోనీలెండి సీతారత్నం గారు. మీరు ఇబ్బంది పడకండి. నా ఇబ్బందులేవో నేను పడతాను" అని సీతారత్నం ముఖ కవళికలను ఓరకంట చూస్తూ దీనంగా ముఖంపెట్టుకుని (నట్లు నటిస్తూ) అడిగింది చెన్నై భామామణి.


మళ్ళీ తానే , అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ప్రణాళికతో ఆట్టే జాగు చేయక " ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విని , అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి పోనీ" అని ఇలా మొదలు పెట్టింది.


"అసలు విషయం ఏమిటంటే - మా తమ్ముడికి తెలిసిన 'మాయాగోళం' అనే ఒక చిట్ఫండ్ సంస్థలో 10లక్షలు పెట్టుబడిగా పెడితే, ఒకే ఒక్క 15 రోజులలో మనం దానికి పదిరెట్లు...అంటే..'కోటి రూపాయలు...అక్షరాల కోటి రూపాయలు పొందవచ్చు. ఇంతవరకూ నేను ఆ కోటి సొంతం చేసుకుందామనుకున్నా. గానీ, మీ మంచి (అత్యాశ) మనసు, ఇతరులకు సహాయం (మోసం) చేసే మీ గుణం....ఇవన్నీ చూశాక, మీకే ఆ అవకాశం ఇప్పిస్తే చాలా బాగుంటుందని భావిస్తున్న" అంటూ అత్యాశల వల విసిరింది లక్ష్మి.


లక్ష్మి మాటలు వినగానే... అసలే తాటి చెట్టులా పొడుగ్గా ఉన్న సీతార్నాతం...ఆనందంతో ఇంకో ఆరు అడుగుల పొడుగు గాలిలోకి తేలిపోయింది.


ఎప్పుడూ ప్రతి చిన్నదానిని సూక్ష్మంగా పలుమార్లు ఆలోచించే సీతారత్నం, ఒక్కసారి కోటి రూపాయలు..అది కూడా 15 రోజుల్లోనే అనే సరికి, తన సహజ సిద్ధమైన సూక్ష్మబుద్ధిని కాసేపు మరిచిపోయింది.


'ఇనుమును వేడిమీద ఉన్నపుడే వంచాలి ' అనే సూక్తిని బాగా నమ్మే లక్ష్మి, సీతార్నాతంలో వేరే ఆలోచనలు మొలకెత్తకుండా.....


"మా తమ్ముడు మాత్రం , అక్కా! నువ్వు ఎలాగైనా ఆ కోటి చేజిక్కించుకోవాలి. ఈ విషయం వేరే వాళ్లకు చెప్పొద్దు . అలా నువ్వు చెబితే వాళ్ళు కూడా పోటీకి వస్తారు, అని చెప్పాడు. అయినా కూడా మీకు..మీకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇవ్వాలని బలంగా అనుకున్నాను. ఒక వేళ మీకు వద్దు...అంటే వెంటనే చెప్పండి. మా వారు రాగానే ఎక్కడో దగ్గర అప్పుతెమ్మని చెబుతాను" అంటూ తన నటనకు ఇంకొంచెం పదును పెట్టింది.


సీతార్నాతం వెంటనే... " లక్ష్మీ, నీది ఎంత మంచి మనసు..! అందుకే నీవు అందుకోవలసిన గొప్ప అవకాశాన్ని నాకు అందిస్తున్నావు. చాలా ధన్యవాదాలు. తప్పకుండా నేను ఇందులో పెట్టుబడి పెడతాను. నేను ఎప్పటిలోగా డబ్బు కట్టాలో చెప్పు...? " అని అడిగింది.


"రేపే కట్టాలి" అని చెప్పింది లక్ష్మి.


లక్ష్మి మాయమాటలలో పూర్తిగా పడిపోయిన సీతారత్నం, ఆనందడోలికలో తెలిపోతూ ...


కోటి రూపాయలతో తనను తాను నోట్లకట్లను అలంకరించుకున్న లక్ష్మీదేవిలా ఊహించుకుని...


" ఆహా ! ఏమి నా భాగ్యం. ఇంత తక్కువ సమయంలో లో కోటి రూపాయలు ... కోటి రూపాయలు ...


కో...కో...టి...ఇ.ఇ.ఇ..రూపాయలు. అంటే నేను కోటీశ్వరురాలిని కాబోతున్న" అనుకుంటూ "ముందు ఈ విషయాన్ని ఆయనకు చెప్పాలి" అని అనుకుని...మళ్ళీ తనలో తానే, "వద్దు - వద్దు, ముందుగా చెప్పేకన్నా, కోటి సంపాదించి ఆయనను ఆశ్చర్యంలో ముంచేయాలి" అని వచ్చే ఉపద్రవానికి తనకు తానే తాళం చెవి తీసి స్వాగతం పలికింది.


తనకు పట్టబోయే అదృష్టాన్ని ఊహించుకుంటున్న సీతారత్నానికి ఆ రాత్రంతా శివరాత్రే అయింది.


మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి భర్త ఆఫీసుకు వెళ్ళాడో లేదో అని, తన రెండు కళ్ళకు మరో రెండు కళ్ళు(అదేనండి దూరదర్శిని / దుర్భిణి) అతికించి మరీ గోడమీద పిల్లిలా కాచుకుని చూస్తోంది.


లక్ష్మి భర్త బండి స్టార్ట్ చేసి వెళ్ళాడో లేదో, విఠలాచార్య సినిమాలోలా తన ఇంటి గోడ చటుక్కున ఎక్కి, లటుక్కున లక్ష్మి ఇంటిలో డబ్బుతో సహా ప్రత్యక్షమైంది సీతారత్నం.


ఆవిడ రాకను గమనించని, సుడిగాలిలాంటి శబ్దానికి లక్ష్మీ ఒక్కసారిగా ఉలిక్కిపడి(నట్లు)....


"తూ...తూ..తూ...అలా భయపెట్టేశారేంటండీ, బాబు" అంటూ వీపు చరుచుకుంది.


 "అయ్యో, అలా భయపడతావు అని అనుకోలేదు లక్ష్మీ! నువ్వు అడిగిన డబ్బులు ఇద్దామని ఇలా వచ్చాను, అంతే" అని తను చెంగు చాటున భద్రంగా దాచుకున్న పదిలక్షలు లక్ష్మి చేతిలో పెడుతూ.....


"లక్ష్మీ, నిజంగా మనకు కోటి రూపాయలు వస్తాయి కదా? ఎందుకంటే, ఇవి మా ఆయనకు తెలియకుండా ఆయన ఇచ్చిన నెలవారీ ఖర్చులో దాచుకున్నవి (అంతరంగంలో...అందరి దగ్గరా చేబదులు రూపంలో దోచినవి). అందుకే చాలా భద్రంగా నీకు ఇస్తున్నాను. నాకు మాత్రం సరిగ్గా పక్షం రోజుల్లో ఆ కోటి రావాలి సుమా" అని చెప్పింది.


" సీతారత్నం గారు, ఇహ మీదట మీరు మీ పదిలక్షల గురించి మరిచిపోయి , హాయిగా నిద్రపోండి, వాటి సంగతి నేను చూసుకుంటాను. మా వారు ఈ రోజు ఆఫీసు తరపున క్యాంపు ఉందని వెళుతున్నారు. ఆయన వచ్చేసరికి బహుశా ఒక నెల రోజులు పడుతుంది. కాబట్టి, నేను ఈ రోజే రాత్రి చెన్నైలో ఉన్న మా తమ్ముడి దగ్గరకు బయలుదేరి, స్వయంగా మీ అకౌంట్లో కోటి రూపాయలు జమ అయ్యేలా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాను" అని నమ్మకంగా పలికి,ఆ రాత్రే చెన్నై వెళ్ళిపోయింది చెన్నై కుట్టి.


లక్ష్మి మాటల గారడీలో పూర్తిగా మంత్రించిన చిలుకలా మారిన సీతారత్నం రోజులు లెక్కపెడుతూ...ఉంది.


మొదటి రోజు...


రెండవ రోజు...


మూడవ రోజు...


....


....


....


....


30వ రోజు....


30 రోజులు కూడా దాటిపోయాయి. కానీ, లక్ష్మి నుండి ఎలాంటి సమాచారం లేదు. కనీసం మనిషి కూడా చెన్నై నుండి వచ్చిన దాఖలాలూ లేవు.


సీతారత్నంలో విపరీతమైన భయం, ఆందోళన మొదలైంది. కానీ, బయటపడలేని స్థితి.


ఎట్టకేలకు, 31వ రోజున లక్ష్మి వచ్చింది. వీధిలోని అందరి ఇళ్ళకూ వెళ్లి పలకరించి వస్తోంది సీతారత్నంతో సహా. అవి, ఇవి అంటూ ఏవేవో బోలెడు కబుర్లు చెబుతోంది, కానీ కోటి రూపాయల విషయం మాత్రం మాట్లాడడంలేదు. సీతారత్నం ఎన్ని సార్లు అడిగినా ఆ విషయం మాత్రం దాటవేస్తోంది. సీతారత్నానికి మాత్రం ఆందోళన తట్టుకోలేక రక్తపోటు ఎక్కువైంది.


ఇంక తట్టుకోలేని సీతారత్నం, లక్ష్మిని ఒంటరిగా కలిసి, తన కోటి విషయమై " లక్ష్మి, ఇప్పటికైనా ఆ డబ్బు సంగతి తేల్చు. ఇప్పటికే చాలా ...అంటే...చాలా ఆలస్యమైంది" అంటూ నిలదీసింది.


" డబ్బా! ఏం డబ్బు? నేను ఊరు నుండి వచ్చిన దగ్గర నుండి , నన్ను డబ్బు డబ్బు అంటూ అడుగుతున్నారు. అసలు ఏం డబ్బుల గురించి మీరు నన్ను పదే పదే అడుగుతున్నారు? అని ఏమీ తెలియనిదానిలా ప్రశాంతంగా అడిగింది లక్ష్మి.


లక్ష్మి అలా అనేసరికి, కంగారు ఎక్కువైనదైన సీతారత్నం "అదేంటి లక్ష్మీ అలా అంటావు..! నేను ఇచ్చిన పది లక్షలు...దానికి వచ్చే కోటి రూపాయలు" అంటూ నెలరోజుల క్రితం జరిగినది దోమలచక్రం తిప్పుతూ చెప్పింది.


"చూడండి సీతారత్నం గారు, మీరు ఎక్కడో పొరబడ్డట్టున్నారు. మీరు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఒక వేళ మీరు ఇచ్చినట్లు, నేను పుచ్చుకున్నట్లు మీవద్ద ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి. అంతేగానీ, పదే పదే మీరు డబ్బు, డబ్బు అంటూ విసిగిస్తే, నన్ను అనవసరంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వస్తుంది." అంటూ బాంబు పేల్చింది లక్ష్మి.


లక్ష్మి అడిగిన ప్రశ్నల బట్టి సీతారత్నానికి తాను మోసపోయాననే విషయం అర్థమైంది. కానీ, ఏమీ చేయలేక, తేలుకుట్టిన దొంగలా ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయింది. (ఎందుకో పాఠకులకు అర్ధమయ్యే ఉంటుంది).


ఇదంతా గమనిస్తున్న ఎదురింటి రాగిణి, సీతారత్నం వెళ్ళగానే లక్ష్మి వద్దకు వచ్చి..." ఆ సీతార్నానికి భలే ఝలక్ ఇచ్చావు లక్ష్మి. మాకెవ్వరికి ఆవిడను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి వరకు తెలియలేదు. ఇహ ఇప్పట్లోనే కాదు, ఎప్పటికీ కూడా ఆవిడ ఎవరి జోలికి రాకపోవచ్చు" అంటూ మెచ్చుకోలుగా పలికింది.


అంతేనా, మరుసటి రోజు ఉదయము , సూర్యనారాయణగారు ఉదయపు ఫిల్టర్ కాఫీ సేవించి వద్దామని కొంత ఆలస్యం చేసేసరికి, పవనుడు రాగిణికి సాయం చేస్తూ సీతారత్నం దూరాశకు కలిగిన పరాభవాన్ని వీధిలోని ప్రతి గడపకు చేరవేశాడు.


ఈ విషయం తన చెవిని చేరే సరికి మన అయ్యంగారి అమ్మాయి గారి భర్తగారు...భార్యామణితో..." ఎన్న...సంగతి లక్ష్మీ? అందరూ ఆ సీతార్నాతం గారి గురించి, తమరి నిర్వాకం సంగతి మాట్లాడుకుంటున్నారు."


"అదా ! ఏం లేదు బావా. ఇప్పటి వరకూ చేబదులు పేరుతో అందరి దగ్గరా ఉప్పు - పప్పుతో మొదలు, డబ్బు - దస్కం, ఆఖరికి బంగారు నల్లపూసలు గొలుసు లాంటి విలువైన వస్తువులను కూడా తీసుకుని తిరిగి ఇవ్వకుండా, తద్వారా కొంతమంది కాపురాలు కూడా కూల్చిన ఆ సీతార్నాతం దుష్ట బుద్ధిని సరి చేయాలని,


ఆవిడకు ఉన్న దురాశను ఆధారంగా చేసుకుని, మా తమ్ముడితో కలిసి ఒక చిన్న నాటకం ఆడాను. ఆవిడ డబ్బులన్నీ , ఆవిడ భర్తద్వారా ఆమె చేతిలో మోసపోయిన వారందరికీ అందించాను"...అని జరిగిన విషయం అంతా చెప్పింది.


లక్ష్మి భర్త , ఆ వీధిలోని వారందరూ లక్ష్మి చేసిన మంచి పనికి ఆమెను అభినందించారు.


ఈ సంఘటన తరువాత సీతారత్నం 'చేబదులు అనే మోసం' మళ్ళీ ఎక్కడా, ఎప్పుడూ చేసినట్లు దాఖలాలు లేవు.


******************** శుభం ****************


Rate this content
Log in

Similar telugu story from Comedy