radha Krishna

Drama Classics Others

4  

radha Krishna

Drama Classics Others

ఇంపైన రమణీయం

ఇంపైన రమణీయం

2 mins
301


"ధడేల్" మంటూ వచ్చిన శబ్దంవైపు చిద్విలాసపురుషోత్తముడు ముసిముసి నవ్వులు పూయిస్తూ...


నాన్నా రజనీష్...వెళ్లి ఆ చేతి సంచి పట్టుకునిరా.

వెళ్లి ఈ పూటకు ఫలహారం ఏ పూటకూళ్ళ గృహం నుంచో తీసుకువస్తాను. ఏదో కాస్త తిని ఆ తీపిరోగానికి మందు బిళ్ళ వేసుకోవాలి, లేకపోతే..ఆ మధుర రోగంలో మార్పులు వచ్చి ఇప్పుడే "హరీ" అన్నా..అనేయగలను'... అంటూ.. సహధర్మచారిణికి వినబడేలా చెప్పి చేతి సంచితో బయటకు వెళ్ళాడు పురుషోత్తమరావు.


అతను అలా బయటకు వెళ్ళాడో లేదో...వెనువెంటనే విడివడి ఉన్న కురులను సిగవేసి, కళ్ళను తుడుచుకుని...

గబగబా..వంటింటి ముఖం పట్టింది కమలాక్షి.


ప్రిడ్జ్ లో ఉన్న దోస పిండిని తీసి, దోసెలు ఒకవైపు వేస్తూ...

మరో వైపు నువ్వుల పచ్చడి కోసం అన్ని సిద్ధంచేసి...ఆయనకు "నూల పచ్చడి అంటే మహా ప్రాణం"..కాబట్టి ఈ పూటకి దానిని చేసి పెడతాను. అసలే షుగర్ పేషంట్. త్వరగా చేసి పెట్టాలి అని అంటూ మిక్సీ తీసినదల్లా... ఉహు..కాదు..ఆయనకు రోటిలో చేసే పచ్చళ్ళంటే మహా ప్రీతి. కాబట్టి , ఈ రోజు రోటిలో రుబ్బేస్తాను. ఎలాగూ ఆయన బయటకు వెళ్లారు కదా..

అంటూ..పెరటిలోనున్న రుబ్బురోలు కడిగి, పీట వేసుకుని పచ్చడి రుబ్బడం మొదలు పెట్టింది కమలాక్షి.


ఏమిటో ఈయన, కొంచెం ముందు వెనుక అలోచించరు. సమయం - సందర్భం చూడరు. ఎప్పుడు చూడు..సరస సల్లపాలు అంటారు. కొడుకు - కోడలు , కూతురు - అల్లుడు ఇంట్లోనే ఉంటున్నారు. "వాళ్ళ ముందు ఏమిటి స్వామీ!!", ఈ చిలిపి పనులు' అంటే సుతరామూ వినిపించుకోరు. పైగా, ఇలాంటి చిలిపి సరదాలు..సరసాలు చూసి వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వామితో ఎలా మసులుకోవాలో తెలుస్తుంది" అని అంటారు'...అని తనలో తాను గొణుక్కుంటూ పచ్చడి రుబ్బుతున్న కమలాక్షి ఎదురుగా పీట వేసుకుని పొత్రం లాక్కుని పచ్చడి రుబ్బడం మొదలు పెట్టాడు పురుషోత్తమరావు. "నీ చేతులు నొప్పి పుడతాయి కమల. నన్ను రుబ్బని" అని అంటున్న భర్తవైపు ఆశ్చర్యంగా చూస్తూ...


మీరు..మీరు---హోటల్ లో టిఫిన్ తెచ్చుకుంటానని వెళ్లారు కదా..! మళ్ళీ ఇదేమిటి మహాశయా..అని అడిగితే..


నీకు తెలియని విషయమేముంది "నా కోమలాంగి"..

మన పెళ్లి అయిన దగ్గరనుండి...నేటి వరకు బయట తిని ఎరుగుదునా ??


నీ చేతి వంట రుచితో నన్ను గత 20 సంవత్సరాలుగా కట్టిపడేశావు. బయట రుచులతో 😉 పని లేకుండా, అన్నీ నువ్వే ఉదయం కమ్మటి కాపీతో , టిఫిన్ లతో మొదలు రాత్రి తాంబూల..తదుపరి సేవనం వరకు అన్నీ నీ మృదుహస్తాలతో మరీ మధురంగా అందిస్తుంటే...అలవాటైన జిహ్వ, ఇంకా అలవాటు పడిన....అని అంటూ ఉన్న శ్రీవారిని.....

"" ఆ..ఆ..ఆ..ఇంక చాలు ఆపండి తమరి కల్లబొల్లి కబుర్లు"" అంటూ సిగ్గులు చిందుతూ పలికింది షష్ఠిపూర్తికి దగ్గరగా ఉన్న కమలాక్షి. 


అయినా, పిల్లలు దగ్గర్లో లేరు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే వాళ్ళు మీ మాటలు విని, రోజూ మీరు చేసే కలాపాలు చూసి...అవ్వ...నవ్విపోతారు! కాబట్టి...వయసు తగ్గ వేషం, వేస్తే చాలా బాగుంటుంది , అన్న కమలాక్షితో, అదే చేస్తున్నా నా దేవేరి...మన వయసుకు తగ్గ చిలిపి పనులే...


నాతో సరదాగా మంచి కబుర్లు చెప్పడం, నువ్వు ఒంటింట్లో వంట చేస్తున్నపుడు నీ బుగ్గ గిల్లడం, మహా అయితే , నీ చేతిలోని గరిట తీసుకోబోతే, నువ్వు వేసే సుతిమెత్తని దెబ్బలను తప్పుకుని, నీ కొంగుచాటున దాక్కోవడం...


అంతకన్నా, ఈ వయసులో మనం మాత్రం ఏం చేయగలం. కనీసం ఈ మాత్రం సరసభాషణలు లేకపోతే...మరీ బాగుండదోయ్...అంటూ కన్నుగీటాడు సరసపుంగవుడు. 


సరి..సరి...మిమ్మల్ని కదిపాను చూడండి, నాది...నాది బుద్ధి తక్కువ. 


అవన్నీ ఇంక కట్టి పెట్టి ఇంట్లోకి నడవండి.పచ్చడి రుబ్బడం అయింది. దోసెలు హాట్ బాక్సలో పెట్టి ఉంచాను. వడ్డిస్తాను తిందురుగాని..అని వడివడిగా వెళ్ళింది కమలాక్షి.


తల్లిదండ్రుల మాటలు హాల్లో కూర్చుని వింటున్న కొడుకు రజనీష్ - పక్కనే ఉన్న కోడలు నడుము గిల్లి...చూశావా...నీ అత్త - మామల రొమాన్స్. 


కనీసం వాళ్ళను చూసైనా మనం తరం వాళ్ళు చాలా నేర్చుకోవాలి సుమ. ఇంత వయసులో కూడా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో..! ఒకరి గురించి మరొకరికి ఎంత తాపత్రయమో...! ఒకరి ఆరోగ్యం పట్ల మరొకరికి ఎంత శ్రద్ధో. ...అంటూ ఆప్యాయంగా తండ్రికి ఫలహారం వడ్డిస్తున్న తల్లిని...అంతే ప్రేమగా శ్రీమతి చేతి వంటను ఆస్వాదిస్తున్న తండ్రిని చూసి మనసులోనే వారికి శతసహస్ర వందనాలు సమర్పించుకున్నాడు ...ఆ వృద్ధ దంపతుల సుపుత్రుడు.


***సమాప్తం***



Rate this content
Log in

Similar telugu story from Drama