radha Krishna

Romance Classics Others

4  

radha Krishna

Romance Classics Others

సాగరసమీరాలు

సాగరసమీరాలు

7 mins
373


పాదాల వేళ్లకు సర్ర్ మ్మంటు ఏదో గుచ్చుకోవడంతో...ఆదమరిచి ఎటో ఆలోచిస్తున్న సమీర ఒక్క సారిగా...ఆ ఆ ఆ..అంటూ తన పాదాలవైపు చూసుకోవడంతో రక్తం కారుతూ ఉన్న తన వేళ్ళను చూసి వచ్చిన అలనీటితో ఆ రక్తాన్ని కడిగి..అక్కడే ఉన్న అందమైన శంఖాన్ని చేతిలోకి తీసుకుని దానిని తీక్షణంగా చూస్తూ ఉండే సరికి దానిమీద "సమీరాల కల" అని రాసి ఉంది. 


ఇదేంటి ఇలా ఉంది అనుకుని, సరేలే అని , ఆ శంఖాన్ని తన వెంట తీసుకువెళ్లింది. దానిని తను నిత్యం ఆరాధించే కన్నయ్య విగ్రహం ముందు పెట్టింది.


రోజంతా ఏ పని చేస్తున్న సమీర కళ్ళు ఎప్పుడూ దానిమీద తన ప్రమేయం లేకుండానే వెళ్లిపోయేవి. దాని నుండి తనకు ఏదో వినీవినబడనట్లు ఏవో వినిపించేవి. పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేది. 


కానీ రెండు రోజుల తరువాత మళ్ళీ ఎప్పటిలానే సముద్రం ఒడ్డుకు వచ్చి అలలతో కాసేపు ఆడుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకో శంఖం వచ్చి తన చేతిని తాకింది. 


దానిని కూడా చేతిలోకి తీసుకుని చూడగా అందమైన "సమీరకు నా కలల కానుక" అంటూ రాసి ఉంది.


చాలా చిత్రంగా తోచింది సమీరకు. అయినా సరే, చూడముచ్చటగా ఉన్న ఆ శంఖాన్ని చేతిలోకి తీసుకుని చెవిదగ్గర పెట్టుకుని దాని నుండి వచ్చే ఒక సూక్ష్మమైన శబ్ధాన్ని శ్రద్ధగా వింటుంటే..ఏదో తెలియని అలౌకిక భావన సమీర మనసును తాకుతోంది.


ఈ శంఖాన్ని కూడా తన కృష్ణుని పాదాల చెంత ఉంచింది. రోజులు గడుస్తున్నాయి. తాను ఏంచేస్తున్నా తనకు మాత్రం ఆ శంఖాల నుండి వచ్చే ధ్వని చాలా చిత్రమైన అనుభూతులను అందింస్తోంది. క్రొత్త క్రొత్త భావాలను మదిలో పురుడు పోసుకునేలా చేస్తోంది. ఎప్పుడూ ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఉండే తన మదిలో కొత్త వెలుగులు ఉదయిస్తున్నట్లు అనిపించింది సమీరకు. తనలో తనకే తెలియని ఒక కొత్త సమీరాన్ని చూస్తోంది. ఉత్సాహంగా ఉరకలు వేసే మనసు ఇప్పుడు తన సొంతం అవుతోంది. 


దిన దిన ప్రవర్ధమానంగా వెలిగే చంద్రునిలా సమీర మోములో కనిపించే ఆనందం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి. ఎందుకంటే...సమీర ఇలా ఉత్సాహంగా ఉండడం..ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలలో ఉండడం...ఎవ్వరితోను సరిగ్గా మాట్లాడకపోవడం...పెదవి తెరచి ఒక్క మాట కూడా మాట్లాడడం ఎవ్వరికీ తెలియదు. గత 10 సంవత్సరాలనుండి ఆమెది ఇదే తంతు. ఆమె గతం ఎవ్వరికీ తెలియదు. ఆమెకు ఉన్నదల్లా . ..ఆ కాలనీ వాసులు మాత్రమే.


ఎందుకంటే ఆమె సరిగ్గా 10 సంవత్సరాల క్రితం సముద్రపు ఒడ్డున స్పృహలేకుండా ఒక వ్యక్తి కంట పడింది. ముద్దుగారే పాల బుగ్గల పసిబిడ్డ... లేత గులాబీ వర్ణంలో ఉన్న కుచ్చు కుచ్చుల గౌనుతో, పాల మీగడ లాంటి వర్ణంతో...రెండు జడలతో చాలా ముద్దుగా .. అమాయకంగా అచేతనంగా ఉన్న ఆ పాపను చూసిన వ్యక్తి మనసు తరుక్కుపోయి..తన వెంట తీసుకువెళ్లాడు. పాపను తన కంటి పాపలా చూసుకున్నాడు. అతనే వినయ్. 


వినయ్ ..వృత్తి రీత్యా చేపలు వేటాడుతూ జీవనం సాగించేవాడు. అతనికి "నా" అన్న వాళ్ళు ఎవరూ లేరు. పాపకు పూర్తిగా ఆరోగ్యం కుదుట పడేవరకు పాప పాప అంటూ..సేవలు.చేసేవాడు. పూర్ణమిరోజున మందు బాటిల్ తీసుకుని ఎప్పటిలానే సంద్రం కెరటాలలో చంద్రుని వెన్నెలను ఆస్వాదిస్తూ మందులోని మాజానుకూడా ఆస్వాదిస్తూ ...


లచ్చిమీ..ఒసేయ్ లచ్చిమి ..ఏడున్నావే...?


నన్ను ఒంటరిని చేయకే అంటూ తాగి..తాగి..తూలి ..ఆ సముద్రపు ఒడ్డునే వాలిపోతాడు.


మరుసటి రోజు సూర్యోదయ కిరణాల తాకిడికి నిద్రలేచిన వినయ్..అయ్యో..ఏంటిది...! ఇలా నిద్ర పోయాను. పాపం చంటి బిడ్డను ఇంటిలో ఒంటరిగా ఉంది అని గబ గబ తన ఒంటిని అంటుకున్న ఇసుకను దులుపుకుని తన గుడిసెకు బయలుదేరాడు.


అక్కడ పాప ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కంట పడిన దృశ్యం చూసి ఏమైందమ్మా అంటూ అడిగేసరికి..గుడిసెలోకి రాత్రి చొరబడి ఒకమూలన నక్కిన ఒక పెద్ద పామును చూపించి వినయ్ ని ఒక్కసారిగా చుట్టేస్తుంది. పామును చూసిన వినయ్ అయ్యో నా తల్లి...! 'ఎంత పెద్ద గండం తప్పింది' అని పాపను..రంగ అనే తన స్నేహితుడికి అప్పచెప్పి...తను వెంటనే గుడిసెలో నుండి పెద్ద కర్రతో దానిని చంపడానికి బయలు దేరాడు. అదృష్టం..పాము కదలక మెదలక చుట్టుకుని ఉండడం చూసి అనుమానం వచ్చి కర్రతో దానిని తిరగవేస్తాడు. కానీ అప్పటికే అది చనిపోయి ఉంది. అందుకే పాపకు పెద్ద ప్రమాదం తప్పింది...అని ఊపిరి పీల్చుకుని.. నాటి నుండి తన పాడు అలవాటును మానుకుని పాపతోడే జీవితంగా మారిపోయాడు.సమీరను పెంచి, విద్య చెప్పించి.. ఉన్నంతలో పాపను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడానికే చూసేవాడు. ఇది వినయ్ కథ. 


ఇక అసలు కథలోకి వెళ్లిపోదాము.


రోజుకో శంఖం సమీరను చేరడం, వాటిని తన కన్నయ్య పాదాల చెంత ఉంచడం, వాటి శబ్ద తరంగాలు సమీరలో నూతన ఉత్సాహపు కెరటాలుగా..నిత్యం సరికొత్త సంతోషాల గని తోడుగా ఉవ్వెత్తున ఎగసి పడేలా చేస్తున్నాయి. 


 ఒకనాడు చక్కటి చిలుకాకుపచ్చ పరికిణి, రాణీగులాబీ వోణిలో ఒక పౌర్ణమినాటి ఘడియలలో సమీర సాగరుని అందాల వీక్షణకై సాగరసమీరానికి చేరింది. మోకాళ్ళు దగ్గరిగా ముడుచుకుని, అరచేతులు రెండింటినీ వాటిమీద వేసి, పెళ్లి పీటల మీద నూతన వధువులా సాగరుని తదేకంగా చూస్తోంది. దగ్గరి నుండి ఏదో సుగంధ పరిమళం నాసిక పుటలను తాకుతుంటే, ఆ పరిమళం వస్తున్న వైపు దృష్టి సారించి చూసి చకితురాలిగా రెప్ప వేయడం కూడా మరిచి చూస్తూ ఉండిపోయింది. 


చెవిలో 'హెలో...హెలో...హెలోఓఓ..' అంటూ చేరిన ధ్వనికి తృళ్లిపడి ఈలోకంలోకి వచ్చింది సమీర. అయినా కూడా ఆ స్పృరధ్రూపిని చూసిన కళ్ళు మాత్రం అతనిని చూడకుండా ఉండలేక ఇంకా అలానే చూస్తూ ఉండి పోయింది. అతను మాత్రం, హెలో మిస్...ఏంటండి... అలా చూస్తున్నారు..!! నాకు దిష్టి తగులుతుంది...అసలే ఈ మధ్య నేను "చిక్కిపోతున్నానని మా అమ్మ వాపోతోంది".. అని ఏమీ తెలియని అమాయకంగా మోము పెట్టే సరికి ..ఆ ఆజానుబహుడిని చూసిన సమీరకు ఒక్క పెట్టున నవ్వు వచ్చింది. ఆ నవ్వు కోసమే ఎదురుచూస్తున్నట్లు...అతను ఆమె ముంగిట తన దోసిటను పట్టి నిలబడ్డాడు. ఆమె నవ్వుల్లో దొర్లే ముత్యాలను ఒడిసిపట్టాలని. పగలబడి పగలబడి నవ్వి, నవ్వి..ఇహ నవ్వలేక ఆగిన సమీరకు అప్పుడు తెలిసింది..ఆ అందగాడు ఆమె ముందర నిలబడిన తీరు. అంతలో కంగారు చెందినదై..క్షమించండి..అంటూ..వెనుకకు ..వెనుకకు తిరిగి చూస్తూ..సిగ్గు చెందినదై..పరుగు పరుగున ఇంటి దారి పట్టింది. 


సమీర వెళుతున్న వైపు చూస్తూ మైమరిచిన ఈ మన్మధుని స్నేహ బృందం..."ఏం గురూ.. ఏమిటి సంగతి..!! అంత నచ్చిందా ఆ అమ్మాయి..??!! వెళ్లి మాట్లాడమంటావా..అంటూ అతని చుట్టూ చేరారు. హే..పొండిరా. మీకు ఎప్పుడూ వేళాకోళమే. 


అబ్బా....అయ్యగారికి సిగ్గు వచ్చేసింది. చూడు నాయనా..నీకు సిగ్గు సరిపడదు గాని...ఇంతకు..ఎవరు రా ఆ అమ్మాయి. అని అడిగే సరికి...ఏమోరా..నాకేం తెలుసు. మీరు అలా మీ బీర్ షాప్ కి వెళ్లారు కదా..అని నేను అలా ఒడ్డున నడుస్తుంటే..ఆమె దేవకన్య కనిపించింది. "అందుకే అలా పలకరించాను"..అని చెప్తాడు. 


ఒరేయ్..కోతల రాయుడా...ఆమె ఎవరో నీకు తెలుసు...నీవు రోజు పంపించే శంఖాల కధ కూడా మాకు తెలుసు. చెప్పరా ..సాగరా...ఏంటి కధ..అని అడిగే సరికి..దొరికిపోయిన దొంగలా...సరే..మీకు అన్నీ తెలిసాయి కదా, ఇహ మీదట నేను చెప్పే వరకు...నన్ను ఏమీ అడగొద్దు. పైగా..ఆమెకు నేనే శంఖాలు పంపించేది అని మాత్రం చెప్పొద్దు..plzzz..అంటూ బ్రతిమలాడుతాడు..మన హీరో.


 సర్లేరా బావ..మా చెల్లమ్మకు చెప్పం గానీ, మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు..అని ఒక స్నేహితుడు అడిగితే...ఒరేయ్..మొద్దు..ఈ రోజుల్లో పప్పు అన్నం ఏంటిరా...మన వాడి పెళ్లికి మనం అందరం దం బిరియాని విత్ ఫుల్ డ్రింక్స్. గానా బజానా..సంగీత్...బారాత్ ...ఇరగదీయాలి. ఏరా..సాగర్ ...ఏమంటావు..అని మరో స్నేహితుడు.


బాబు..మిత్రులారా...మీరందరూ అనుకునేవి జరగాలి అంటే..ముందు మీ చెల్లెలికి నేను నచ్చాలి. కాబట్టి...మీరు కాస్త ఓపిక పట్టండి. ఇహ ఇంటి బాట పడదాము, అని అందరినీ తీసుకుని కారులో ఇంటికి వెళ్లి పోతాడు సాగర్. 


ఇంటికి వెళ్లిన సమీర మాత్రం ...తన కళ్ళనిండా నింపుకున్న రూపాన్ని తలుచుకుంటూ..తన కన్నయ్య ముందు కూర్చుని..కన్నయ్యా..చూశావా..ఆ అండగాడిని..అచ్చం ..నీలానే ఉన్నాడు కదూ..!


ఆ నయనాలు..సింగం లాంటి విశాలమైన ఛాతీ, సన్నటి నడుము..ఆరున్నర అడుగుల దేహ ధారుఢ్యం...అసలు కళ్ళు తిప్పుకోలేక పోయాను..అంటూ తదేకంగా అతని గూర్చి వర్ణిస్తూ, కన్నయ్యా...ఇన్నేళ్లలో నిన్ను ఎన్నడూ , ఏదీ కోరలేదు. ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క కోరిక కోరుతాను..అతను నాకు సరిపడే వాడు అని నువ్వు భావిస్తే..అతనిని నాకు జత చేసే బాధ్యత నీదే. ఎందుకంటే...నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ ప్రపంచంలో నువ్వు..నన్ను పెంచిన పెద్దయ్య తప్ప ఇంకెవరు లేరు. కానీ అతనిని చూసిన క్షణం నుండి ఏదో తెలియని అనుబంధం మనసులో మెదులుతోంది. నీకు గుర్తుందా...నాకు శంఖాలు దొరికిన దగ్గరి నుండి ఎలాంటి అనుబంధం పెనవేస్తోందో...అలాంటి భావం అతని చూడగానే కలిగింది. నా మనసులో మాట నీకు బాగా తెలుసు. ఇహ అంతా నీదే భారం...అంటూ తన చేతిలో ఉన్న గులాబీని నల్లనయ్య మురళి ఉన్న చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. కన్నయ్య మాయ వలన...పెద్ద గాలి వాటంతో అతని మురళి వద్దనున్న గులాబీ ఎగురుకుంటూ వెళ్లి ఇదంతా సమీర గది కిటికీ వెనుక నిలబడి ఉన్న సాగరుని చేతిలో పడుతుంది. సాగర్...చాలా సంతోషించిన వాడై..ఆ గులాబీని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోయి..తన గదిలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు పెడతాడు. 


సమీర ఎప్పటిలానే సాగర తీరానికి వెళ్లి కూర్చుని ఈ సారి కెరటాలను చూస్తూ..అందులో కనిపించే సాగరుని ప్రతిబింబానికి చకితురాలై...చూస్తుండగా..మళ్ళీ ఒక శంఖం వచ్చి చేరుతుంది. దానిని చేతిలోకి తీసుకోగానే మళ్ళీ అదే స్పందన...అనుబంధం. ఇదంతా మాయలగా ఉన్నా, దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. 


ఒక వారం రోజులు సమీర రోజూ వచ్చే సముద్రపు ఒడ్డుకు రాదు. రోజూ వచ్చే సమీర ఎందుకు రాలేదు అని కంగారు పడుతున్న సాగర్ ని స్నేహితులు మాత్రం , కంగారు పడొద్దని..ఏదైనా పని ఉందేమో, అందుకే రాలేదు మా చెల్లమ్మ. అంత మాత్రానికే అలా విలవిల ఎందుకు మావా..అంటూ ఓదారుస్తారు. కానీ దూరం నుండి అక్కడి ప్రదేశాన్ని గమనిస్తూ ఉన్న సమీరకు అప్పటికి గాని అర్ధం కాలేదు..ఇలా రోజుకో శంఖాన్ని తెచ్చి తనకు అందించేది ఆ అండగాడే అని. అది తెలిసిన మరుక్షణం తను ఆనంద డోలికలో తేలిపోతూ..పరుగు పరుగున తన ఇంటికి పోయి..కన్నయ్య విగ్రహం ముందు మోకరిల్లి, "నా కోరికను మన్నించి, ఇలా తీరుస్తావు అనుకోలేదు స్వామి". నీకు తెలుసా కన్నయ్యా..రోజు శంఖాలు పంపేది ఆ ఆజానుబహుడే. నా అనుమానం బల పడింది. స్వామి, ఇంత చేసిన నీవు..అతనికి నా మనసులో మాట కూడా నువ్వే తెలపాలి. మా మధ్య రాయబారివి నీవే కావాలి అని వేడుకొంటుంది. ఇవన్నీ ఒకవైపు నుండి సమీరను పెంచిన పెద్దయ్య (వినయ్) వింటాడు. 


బిడ్డ ఎవరినో ఇష్టపడతాంది. ఆడు ఎలాటాడో..ఏటో తెలుసుకోవాల.. అసలే..తల్లి తండ్రులు లేని పిల్ల. పైగా లోకం తెలియని అమయకురాలు. కాబట్టి..అమ్మాయి ఇష్ట పడే ఓడు ఎవోలో తెలుసుకుని ...ఆడిని గురించి ఆరా తీయాలా. అయ్యా, కిట్టయ్య..నువ్వే నా బిడ్డ బతుకును బాగుసేసే దారి సూపాల, అని దండం పెట్టి..అప్పటి నుండి సమీర ప్రతి అడుగును వెంబడిస్తాడు వినయ్. 


ఈ లోగా సమీర కనడకపోవడంతో దిగాలుపడిన సాగర్ ని ఇంక ఏడిపించడం ఇష్టం లేక సమీర రోజు వచ్చే ఒడ్డు ప్రదేశానికి వచ్చి, తనకోసం అక్కడే ఇసుక తెన్నులో ఉంచిన శంఖాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సాగర్ ఆనందంతో ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు ఇదంతా గమనిస్తున్న వినయ్, సాగర్ ని వెంబడించి, సాగర్ బంగళా చేరి..పెరటి వైపు నుండి బంగళాలోపలికి వెళ్లి..హాలులో ఉన్న ఫోటో చూసి ఆశ్చర్యంతో ...స్పృహ తప్పి దబ్బున కింద పడిపోతాడు. ఆ పడిన శబ్దానికి గదిలో ఉన్న సాగర్, అతని తల్లి జలజాక్షి, తండ్రి రాం అగర్వాల్ వస్తారు. వినయ్ మొహం మీద నీళ్లు చల్లి..లేపి కూర్చో పెట్టి...ఏం పెద్దయ్య బాగున్నవా అంటూ..పలకరిస్తారు. అంతే..వినయ్ ఇంకా ఆశ్చర్యపోతూ...నా పేరు మీకెట్టా తెలుసినాది బాబు..? అంటూ అడుగుతాడు. 


అందుకు సమాధానంగా సమీర మేనత్త, జలజాక్షి, మా బంగారాన్ని పెంచిన పెద్దయ్యవి నువ్వు. నువ్వు మాకు బాగా తెలుసు, ఇది నుండి నిన్ను మేము గమనిస్తూనే ఉన్నాము. అసలు ఏం జరిగిందో చెబుతాను విను అని .... సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నేను మా వారు మా అబ్బాయి..అదే ఈ సాగర్, మా అన్నయ్య బిడ్డ అయిన సమీరను తీసుకుని వ్యాపార నిమిత్తం విదేశాలకు బయలుదేరాం. విమానం బయలుదేరిన వెంటనే క్రాష్ అవ్వడం వలన విమానం ఈ సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో మా తల్లిబిడ్డల అదృష్టం కొద్ధీ వేరే ఒడ్డుకు చేరుకున్నాము. మాతో పాటు మరి కొంత మంది బ్రతికారు. కానీ మా దురదృష్టం మా సమీర కనబడలేదు. ఆమె కోసం వేతకని స్థలం లేదు. ఇంక చేసేది ఏమీ లేక, విదేశాల్లో స్థిరపడి, ఈ మధ్యనే మేము ఇండియాకి వచ్చాము. అనుకోకుండా సమీర మా వాడి కంట పడడం..ఆ అమ్మాయి మా వాడికి నచ్చడం..ఆమెను గూర్చి వివరాలు తెలుసుకోమని మా వారు చెప్పడంతో వాడు మీ ఇంటికి వచ్చి, సమీర చిన్నప్పటి ఫోటోను చూసి మాకు చెప్పడం..ఇవన్నీ జరిగాయి, అని ముగిస్తుంది జలజాక్షి. వినయ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై..అయ్యా..ఇన్నాళ్లు నా చిట్టి తల్లికి ఎవరూ లేరు అనుకున్నాను, కానీ నా బంగారానికి ఇంత మంచి కుటుంబం ఉందని తెనీలేదు. పాప ఇష్టపడ్డాది కదా..ఆడు ఏసుమంటోడో తెలుసుకుందారని ఇలా దొంగసాటుగా వచ్చాను. నన్ను మన్నించండి అని వినయ్ వాళ్లను ప్రాధేయపడతాడు. ఇన్నాళ్లకు నా సింత తొనగిపోనాది. న బిడ్డ మగారాణీ ఇహ మీదట అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోబోతాడు. 


అప్పుడు సాగర్..మామయ్య, అప్పుడే సమీరకు ఈ విషయాలు చెప్పొద్దు. మేము మీ ఇంటికి సంప్రదాయంగా వచ్చి పిల్లను అడుగుతాము అని చెప్పి, వినయ్ ను పంపించి వేస్తాడు. 


మంచి ముహూర్తాన సాగర్ తల్లిదండ్రులు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, పెళ్ళి ఖాయ పరుచుకుని వెళ్ళిపోతారు. సమీర తన కన్నయ్య ముందు..స్వామి నా మొర ఆలకించి..నువ్వు ఆ రుక్మిణమ్మను వివాహ మాడినట్లు, ఈ రోజు నా సాగురుడు నన్ను పరిణయం చేసుకోవడానికి వచ్చాడు. అంతా నీ లీల స్వామి, అని తన చేతిలోని కదంబ మాలను స్వామికి అలంకరిస్తుంది.


సాగర్ సమీరల పాణిగ్రణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. 


సాగర్ సమీరలు ఒక్కటై సాగరసమీరాలుగా సాగర సమీరాలు తిలకించడానికి ప్రతి నిత్యం ఆ ఒడ్డుకు చేరి వాళ్ళ మనసుల ప్రణయ గుసగుసలను, కెరటాల సవ్వడులతో ముడి వేస్తూ నూతన జీవితం ప్రారంభిస్తారు.


ఒకే కుటుంబం నుండి విడివడి దురదృష్టపు కోరల్లో చిక్కి అనాధగా పెరుగుతున్న సమీర జీవితంలోకి విధి తీసుకువచ్చిన ఆనందాల హేల "ఈ సాగరసమీరాల కధ."



Rate this content
Log in

Similar telugu story from Romance