Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror


4.6  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror


భయం నీడలో

భయం నీడలో

3 mins 380 3 mins 380


       

    మాఊరెళ్లి విశాఖపట్నం చేరేసరికి రాత్రి పన్నెండు దాటిపోయింది. ఆటో దిగి.. ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి పంపించేశాకా..బాగ్ పట్టుకుని ఇంటి వైపు చూసాను. వామ్మో...స్ట్రీట్ లైట్ వెలుతురు కూడా లేకపోవడం వలన ఆ అమావాస్య చీకట్లో భయపెడుతూ పెద్ద భూతంలా కనిపించింది నాకంటికి మాఇల్లు. 

     

   నాలుగు రోజులుగా ఇంట్లో లేకపోవడం వలన గేట్ పక్క కాంపౌండ్ వాల్ మీదుండే లైట్స్ కూడా వెలిగిలేవు. అక్కడికీ పనిమనిషికి మరీ మరీ చెప్పి వెళ్ళాము. సాయంత్రం పూట మొక్కలకి నీళ్లుపోసాక పోర్టికో లో లైటు వేసి వెళ్తూ ఉండమని. మనుషులు లేకపోతే చాలు.ఇక వాళ్ళిష్టం. ఈరోజు రాలేదని ఎలాగూ తెలిసిపోయింది. నిన్నా, మొన్నా కూడా వచ్చిందో లేదో...? రానిరోజులకు జీతం తగ్గించి ఇస్తామంటే ఇంత ఎత్తున లేస్తారు. ఇష్టమైతే చేయించుకోండి...లేదంటే మానేస్తామని బెదిరింపు ఒకటి. వేరే పనిమనిషికి పెట్టుకునే గత్యంతరం లేక అలాగే సర్దుకుపోవాల్సి వస్తుంది...అంటూ అంత టెన్షన్ లోనూ నా మనసు గొణుక్కోవడం మానలేదు. గేట్ తీసుకుని లోపలికి అడుగు పెడుతుంటే..ఎందుకో నాలో తెలియని చిన్నపిరికితనం ఆవరించింది. ఈ రాత్రి కాడ...అదీ ఈసమయంలో నేనిలా ఒక్కదాన్నీ అడుగుపెట్టడం మంచిది కాదేమో...? ఏ మూల యే దొంగ నక్కి ఉన్నాడో..? అనే చిన్న ఆలోచనతో ఒక్కఅడుగు వెనక్కి వేసాను. పక్కింటి వాళ్లనెవరినైనా పిలుద్దామా అనిపించింది. ఈసమయం లో డిస్టర్బ్ చేయడం మంచిది కాదనుకుని ధైర్యం కూడగట్టుకొని మళ్లీ అడుగు ముందుకేసాను... పైట చెంగుని మెడ చుట్టూ లాగి పట్టుకుని. అటూఇటూ చూస్తూ...ఎలాగైతే గుమ్మంలోని లైట్ వేసి మెయిన్ డోర్ లాక్ తీసి..ఒక్క ఉదుటున లోపలికి వెళ్లి అంతే వేగంగా తలుపులు బిడాయించేసాను.హాల్లో లైట్ వేసి ... హమ్మయ్య..అనుకుని ఊపిరి పీల్చుకున్నాను. నాకూడా మావారు వచ్చి ఉంటే నేనింత భయపడేదాన్ని కాదేమో...? 

   

  మా వారు నాతో పాటు మాఊరొచ్చి ... అటునుంచి అటే ఆఫీస్ పనిమీద అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చి హైద్రాబాద్ వెళ్లిపోయారు . పిల్లలిద్దరూ ఉద్యోగాలతో చెన్నై లో ఒకడు, బెంగుళూరులో ఒకడు ఉద్యోగాలొచ్చి ఎగిరిపోయారు. తోడుకోసం ఎవరికైనా అద్దెకివ్వడానికి కూడా వీలుకాని డూప్లెక్స్ ఇల్లు మాది. మొత్తం ఇల్లు అద్దెకిచ్చేసి ఏ అపార్ట్మెంట్ లోనో ఫ్లాట్ చూసుకుని వెళ్లిపోదామనుకున్నా...పిల్లలకు పెళ్లిళ్లు చేయాలి కదా అనే బాధ్యత గుర్తొస్తుంది. ఆ కర్తవ్యం కానిచ్చాకనే మేము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అనుకుని...ఆ ఇంటికి చాకిరీ చేయలేకపోయినా రోజులను అలా కానిచ్చేస్తున్నాం.


   వస్తూంటే దారిలో అన్నవరం దగ్గర బస్ వాడు డిన్నర్ చేసేవాళ్ల కోసం బస్ ఆపడంతో..అక్కడే రెండు ఇడ్లీ తినేసి రావడంతో ఇంటికొచ్చాక వంటగది పని లేకుండా పోయింది. వాష్ రూమ్ కి వెళ్లొచ్చి..కడుపు నిండా నీళ్లు తాగాకా...మంచంపై వాలాను. కానీ కంటిపై కునుకు రావడం లేదు. ఆరాత్రి పూట అంత ఇంట్లో ఒంటరిగా పడుకోవడం ఇదే మొదటిసారి. ఎప్పుడైనా ఈయన ఊరెళ్లినా..అత్తయ్య తోడుగా పడుకుండేవారు. ఇప్పుడు ఆవిడ లేరు. కాలం చేసి మూడు నెలలవుతుంది. ఆ విషయం గుర్తు రాగానే... ఆవిడొచ్చి నా పక్కన పడుకున్న రోజులు కళ్ళకు కట్టాయి. మనుషులు పోయినా కొంతకాలం వరకు వారి ఆత్మలు ఆ ఇంట్లో తిరుగుతూ వుంటాయనుకుంటారు.ఇప్పుడు కూడా అత్తయ్య ఆత్మ గానీ అలాగే సంచరిస్తుంటే గనుక...దెయ్యమై నాపక్కన ఆవిడొచ్చి పడుకుంటారేమో...? ఆ ఊహ రాగానే...నాకెందుకో ఎక్కడలేని భయమూ ఆవహించింది. ఒంట్లో ఏదో సన్నటి దడ. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ అనుకుంటూ ధ్యానించుకోవడమే నా వంతయ్యింది. 


  ఇంతలో కాలింగ్ బెల్ మోత.తుళ్ళిపడ్డాను. తలుపు దబ దబా కొడుతూ...అమ్మా తులసి అంటూ...ఎవరో పిలుస్తున్నారు. ఆ పిలుపు పరిచయం ఉన్నవాళ్లలాగే అనిపించినా... తలుపు తీయడానికి సాహసించలేకపోయాను.ధైర్యం తెచ్చుకుని కిటికీ రెక్క ఓపెన్ చేసి చిన్నగా కర్టెన్ ని తప్పించి పరికించి చూసాను. పక్కింటావిడ అత్తగారు నిలబడి వున్నారు. ఈ టైం లో ఆవిడ ఎందుకొచ్చినట్టు...? ఏది ఏమైనా నా మంచికోసమే దేవుడు పంపి వుంటాడనుకుని ప్రాణం లేచినట్టై ...ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తీసాను.


  "మాఅబ్బాయికి మీ ఆయన ఫోన్ చేసి మా ఆవిడ ఒక్కత్తే ఉంటుంది. మీ అమ్మగార్ని తోడుగా పంపించమని అడిగారట. నిద్దట్లో ఉన్న నన్ను మా కోడలు లేపి మరీ పంపించింది.అంటూ చెప్పుకొచ్చారు. చాలా థాంక్స్ పిన్ని గారు. ఒంటరిగా ఉండటం వల్ల నిద్ర పట్టలేదు. మీరు వచ్చారుగా నాకిక కొండంత ధైర్యం. నాకు ఆ సుమయంలో తోడుగా పంపిన మావారి మీద ఎక్కడలేని ప్రేమా పొంగుకొచ్చింది. నాకోసం ఆయనంతగా ఆలోచించి ..మంచి పని చేసినందుకు.నాలోని ఆలోచనలన్నీ తొలగిపోయాయి.పక్కన ఆవిడున్నారన్న ధైర్యం తో ఆమె చెప్తున్న కబుర్లు వింటూ మత్తుగా నిద్రపోయాను.

   

  తెల్లారి కళ్ళు తెరిచేసరికి పక్కన పిన్నిగారు లేరు. తుళ్ళున పక్కమీంచి లేచాను. బాత్రూమ్ కి వెళ్లారనుకుంటే...దాని తలుపు తెరిచే ఉంది. పిన్ని గారు అంటూ రెండు మూడు సార్లు పిలిచాను. పైకి ఎక్కారేమో అని. ఎలాంటి సమాధానం రాకపోయేసరికి ..వాళ్ళింటికి వెళ్ళిపోయి ఉంటారనుకుంటూ తలుపు వైపు చూసాను. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఎలా వెళ్లి వుంటారబ్బా...? గబగబా తాళం తీసి గోడ దగ్గరకు వెళ్లి పక్కింటి లలితను పిలిచాను. "మీ అత్తగారు వచ్చేసారా?" అని అడిగాను. 

   

  "అప్పుడేనా...రెండు నెలల వరకు పెద్ద కొడుకు దగ్గరకు ఉండి వస్తానన్నారు.

   

   "ఎప్పుడు వెళ్లారు"? ఆ వెంటనే కంగారుగా అడిగాను.

   

   "రెండు రోజులయ్యింది."ఆ సమాధానం విని...అదిరిపడ్డాను.

   

   "ఎందుకలా అడుగుతున్నారు"? అని అడిగింది నా కంగారు చూసి.

   

  "అబ్బే...ఏమీ లేదు.అలికిడి లేకపోతేనూ "అంటూ నసుగుతూ వచ్చేసా.

   

  ఇంతకీ... అత్తగారు పక్కింటి పిన్ని గారి రూపం లో దెయ్యమై వచ్చి నాకు తోడుగా పడుకున్నారో... లేక కల గానీ కన్నానో...నాకంతా గందరగోళం గా ఉంది...!

   

  ఇంట్లోకి వచ్చానే గానీ...రాత్రి నాకెదురైన అనుభవం కళ్ళముందు మెదులుతూనే ఉంది. లాభం లేదు. ఒకసారి ఆంజనేయుల పూజతో పాటు హోమాలు జరిపించుకోవాలి.

   

  బయట చీకట్లో దొంగల భయం...లోపలకెళ్లాకా దెయ్యం భయం.

   

  ఎంతైనా...అంత ఇంట్లో ఒంటరిగా పడుకోవాలంటే ఎంత గుండెధైర్యం ఉన్నవాళ్ళకైనా...భయం నీడలో పిరికితనం ఆవహించక తప్పదు.*

   

  ******   ********  *******  ********  *******

 


       


     


   

  


Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Horror