Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror

4.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Horror

ఆ ఇంట్లో

ఆ ఇంట్లో

5 mins
2.8K            


            

       

  

     

    

    ఆరోజు రాత్రి....!

    

    ఇల్లంతా అలజడిగా అనిపించింది. ఏవో తెలియని శబ్దాలు. ఎక్కడో పిల్లులు ఏడుస్తున్న అరుపులతో పాటూ కుక్కలు కూడా అరుస్తున్నాయి. పిల్లలిద్దరూ వారిగదిలో పడుకున్నారు. ఇంకో రూంలో మావయ్య గారు గుర్రు పెడుతున్నారు. అప్పటికే నాభర్త కూడా మా బెడ్రూంలో పడుకుని ఉన్నట్టున్నారు. నాకు పనవ్వక... పడుకోవడం బాగా ఆలస్యమైపోయింది. వంటగది సర్దుతుంటే...ఎప్పుడూ వినిపించని శబ్దాలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో చూస్తున్నట్టుగా గజ్జల శబ్దం...కిటికీ తలుపులు మూస్తుంటే...బయట ఏదో తెల్లటి ఆకారం తిరుగుతున్నట్టు. ఒక్కసారిగాతుళ్ళిపడ్డాను. ఆమేనా....ఈఇంట్లో చనిపోయినావిడ...? నాలో అనుమానం మొలకెత్తడంతో భయం మొదలయ్యింది. నాకు తెలియకుండానే... చమటలు పట్టేసాయి. ఒక్క ఉదుటున మాగదిలోకి వెళ్లి...నిద్రపోతున్న నా భర్తను కావలించుకుని పడుకున్నాను. నా పక్కన భర్త తోడున్నారన్న ధైర్యం కూడా పోయింది...పైన తిరుగుతున్న ఫ్యాన్ చప్పుడు మరీ భయంకరంగా తోచింది నాకు. ఈ గదిలో ఆ హుక్కుకే కదా...ఆవిడ ఉరేసుకుని చనిపోతా...? నా మనసు పదేపదే తలుస్తూంటే...

కళ్ళప్పగించి రూఫ్ వైపే చూస్తున్నాను. ఆమె ప్రాణాలు పోయాకా ఉరి తాడు నుంచి శవాన్ని దించింది కూడా ఈగదిలోనే. కళ్లారా చూడకపోయినా ఆదృశ్యం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే....భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటూ ఉండిపోయాను...


   నన్ను వదులు...వదులు...మీద పడి రక్కుతున్న దెయ్యాన్ని కాళ్ళతో తన్నుతున్నాను. గట్టిగా అరుస్తున్నాను. ఎంత తన్నినా...అరిచినా నా గుండెల మీదెక్కి కూర్చుని.... జుట్టంతా విరబూసుకుని నామొఖం మీద వేలాడదీసి భయంకరంగా నవ్వుతుంది. నా శాయశక్తులా ఆదెయ్యాన్ని నామీద నుంచి తోసేస్తున్నాను. దాని బలం ముందు నా బలం చాలడం లేదు. ఏమండీ...ఏమండీ...అంటూ గొంతు చించుకొని అరుస్తున్నా...పక్కనే వున్నా ఆయన వినిపించుకోవడం లేదు. అదే అదనుగా దెయ్యం నామీద పడి మరింతగా రెచ్చిపోతుంటే...ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని...కాలుతో గట్టిగా తన్నుతున్నాను. "నన్నొదులు.. నువ్వు పోతావా లేదా"  అంటూ పిచ్చి కేకలు పెడుతున్నాను. అలా ఎంతసేపో....? 


   అంతే....నన్నొదిలిపోయినట్టుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. గదిలో లైట్ వేసుంది. ఒళ్ళంతా చమటలు పట్టేసి ఉన్నాయి. నా భర్త నన్ను కుదుపుతూ పిలుస్తున్నారు. ఏమైంది ఏమైందంటూ...! ఎర్రిచూపులు చూస్తున్న నాకు మంచినీళ్ల గ్లాసునందించారు. గటగటా తాగేసాను. నేను తేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. 

 

   గాల్లోకి కాళ్ళూ చేతులూ ఊపుతూ పిచ్చి కేకలు పెడుతుంటే...నన్ను బలవంతంగా లేపారంట. "అసలు నీకేమయ్యింది..."? అని నాభర్త మళ్లీ అడిగేసరికి...కళ్ళముందు నాకు జరిగింది గుర్తొచ్చింది....


   దెయ్యం వచ్చి నామీద పడి రక్కిందంతా ఓ పీడకలని అప్పుడర్థమయ్యి..హమ్మయ్య అనుకున్నాను. అదంతా నాభర్తకు చెప్తే...పెద్దగా నవ్వేశారు. "మనసులో ఏవో భయాలు పెట్టుకుని ఏవేవో ఊహిస్తూ ఉంటావు. నువ్వు ఆవిషయం గురించి మర్చిపో " అన్నారు ఎంతో తేలిగ్గా.


   తెల్లారింది...!

   నాలో నేనే నెమరేసుకుంటున్నాను...

   రాత్రి వచ్చిన ఆ పీడకలని....ఇంట్లో ఎవరికని చెప్తాను...? నాతో పాటూ అందర్నీ భయపెట్టినదాన్ని అవుతాను. ఈయనకైతే నమ్మకాలే లేవు. నాది అనుభవం కాబట్టి నమ్మకుండా వుండలేకపోతున్నాను.


   అసలు నిజంగానే...ఈ ఇంట్లో దుష్టశక్తులున్నాయా...?? నాలో ఎన్నో...సందేహాలు...భయాలు.

   

   శుభమా అని మా పెళ్ళైన ఇరవైయేళ్లకు ఈ ఇల్లు కొనుక్కున్నాం. మంచి కొలనీలో చక్కటి ఇల్లు . మా ఇల్లు చూడ్డానికి వచ్చిన బంధువులూ, స్నేహితులు ...చాలా తక్కువకి భలే కొన్నారని అందరూ వీస్తుపోవడమే. అందరూ అలా అంటుంటే...మా అదృష్టానికి మేమెంతగా పొంగిపోయామో...! 

   

   అసలు ఆఇల్లు కొనడానికి ఎన్ని అవస్థలు పడ్డామో...?

 అద్దెకొంపలు తిరగలేక...సొంతంగా ఇల్లు కొంటారా లేదా అని నా భర్తను పోరబట్టే...ఈ ఇల్లు అమరగలిగింది. ఇల్లు కోసం వెతగ్గా వెతగ్గా... పేపర్లో ఇల్లు అమ్మబడును అనే ప్రకటన చూసి...ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి చూసాము. 

చూడగానే మా అందరికీ నచ్చేసింది. మూడు బెడ్ రూమ్స్..వాటికి అటాచ్డ్ బాత్రూమ్స్ , విశాలమైన హాలు, డైనింగ్ హాలు, , పూజ రూమ్, కిచెన్, చుట్టూ దొడ్డి...ఇంతకన్నా ఏం కావాలి...? 


   ఇల్లు చూస్తే...వదలబుద్ది కాలేదు. ఆ ఇంటి ఓనరు చెప్పిన రేటు చూస్తే...మా తాహతుకి మించే ఉంది. ఆ ఇల్లు మిస్సైపోతామేమోనని నాభర్త మొఖం వైపు చూసాను బేలగా. ఇంటి ఓనర్ని అడగ్గా అడగ్గా...ఓ రెండు లక్షలు మినహాయిస్తా అన్నారు. అప్పటికే చాలా తగ్గించి ఇస్తున్నట్టు కూడా చెప్పడంతో....ఆ ఇంటిపై ఇంకొంచెం ఆశ కలిగింది.


  " సరే...యే పాట్లో పడి కొందాంలే అన్నారు" నన్ను నిరుత్సాహపర్చడం ఇష్టం లేక నా భర్త.


   ఇక ఆలోచించకుండా నాకున్న బంగారం కూడా అమ్మేసి...అయిదు లక్షలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ...ఆ ఇల్లు మరెవరూ కొననీయకుండా జాగ్రత్తపడ్డాం. ఆతర్వాత నెమ్మదిగా మొత్తం డబ్బు కూర్చి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని...ఆ ఇంటి ఓనర్లుగా మేమనిపించుకున్నాం.


   కొత్త వాతావరణం...కొత్త పరిసరాలు...

   ఆ ఇంట్లో కొచ్చి రెండు నెలలు అవుతుంది. 

   అన్ని సౌకర్యాలతో...ఇల్లు కొనుక్కున్నామన్న ఆనందంతో ఎంతో సంతోషంగా ఉన్నాం ఆఇంట్లో.

   

   మా పెద్దోడుకి ఐఐటీ సీట్ రావడం...చిన్నోడు టెన్త్ లో మంచి మార్కులు రావడం, నా భర్తకు ప్రమోషన్ రావడం...శుభాలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. మాకాఇంట్లో బాగా కలిసొచ్చినట్టుగా అనిపించింది.

   

  అప్పుడప్పుడే చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరూ పరిచయం అవుతున్నారు.


   ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ..."మీకు ఆ ఇంట్లో అంతా బాగానే ఉందా అన్నారు" పక్కింటి వాళ్ళు.

   

  "మీకు ఆఇంట్లోకొచ్చాకా ఏమీ అనిపించలేదా" అన్నారు ఎదురింటివాళ్ళు. 

   

  "మీరు ఆఇంట్లో ఎలా వుంటున్నారు..."? అన్నారు వెనకింటి వాళ్ళు.

    

   వాళ్ళ ప్రశ్నలు నాకేమీ అర్థం కాలేదు. "మాకు చాలా చాలా బాగుంది " అంటూనే చెప్పుకొచ్చాను అందరికీ.

    

  అలా చెప్పానే గానీ...నా సమాధానం విని..వారి ముఖాల్లో అదో విధమైన ఆశ్చర్యం, సందేహం కనిపించేది. ఎందుకలా అడుగుతున్నారో అర్థం కాలేదు. ఎందుకో తెలుసుకోవాలని అనిపించింది.

     

   ఒకరోజు..ఇక వుండబట్టలేక మా పక్కింటి అన్నపూర్ణమ్మ గారిని పిలిచి అడిగేసాను. మీరడిగినట్టే...చుట్టుపక్కలంతా కూడా ఎందుకు నన్నలా అడుగుతున్నారని...? 

    

   "అబ్బే...అదేమీ లేదు. ఊరికే...మీకు కొత్త కదా...ఎలా ఉందని అడిగాం అంతే" అంటూ తప్పించుకున్నారు.

    అయినా...నేను వదల్లేదు. 

    అడగ్గా అడగ్గా...చెప్పారు.

     

    మాదైన ఆ ఇంట్లో...అంతకు ముందు అద్దెకున్నావిడ భర్తతో గొడవపడి ముందు గదిలో ఉరి వేసుకుని చనిపోయిందని. అప్పటినుంచీ...ఆఇంట్లోకి ఎవరూ అద్దెకు దిగక...ఇంటి ఓనరు తక్కువ రేటుకి మీకు ఇల్లు అమ్మేసాడని చెప్పారు. అది వింటూనే నా గుండె జల్లు మంది. మనసంతా ఒకవిధమైన భయం ఆక్రమించుకుంది.


    ఆ విషయాన్ని... పిల్లలకి గానీ, మావయ్య గారికి గానీ ఎవరికీ చెప్పలేదు. పిల్లలు భయపడతారనీ, మావయ్యకి చెప్తే...ఏమీ తెలుసుకోకుండా ఇల్లు తొందరపడి కొనేసామని దెబ్బలాడతారని భయం. నా భర్తతో మాత్రం చెప్పాను. మరేం కాదులే అని తీసిపారేశారు. ఆయన మరీ మొండి మనిషి. వేటినీ నమ్మే రకం కాదు. 


     నిన్న రాత్రి జరిగినదంతా పీడకలే అయినా...మర్చిపోలేని అనుభవంగా తోస్తుంది నాకెందుకో...!


    నాలో రోజురోజుకీ భయం ఎక్కువవుతూనే ఉంది. ఏరోజూ మాగదిలో ఒంటరిగా పడుకోలేదు. ఎంతగా ధైర్యం కూడదీసుకోవాలని అనుకున్నా నావల్ల కావడం లేదు.

     

    నా భయమలావుండగానే...


    ఓరోజు రాత్రి ...నాకూ నాభర్తకూ ఓ విషయంలో పెద్ద గొడవ జరిగింది. నాకసలే మాటపడే స్వభావం కాదు. విసురుగా వెళ్లి బెడ్ రూమ్లో పడుకున్నాను. కోపంగా వెళ్లి పడుకున్నానేమో.... ఆగదిలో ఒంటరిగా పడుకున్నానన్న ధ్యాస ఎప్పటికో కలిగింది. కావాలనే నా భర్త కూడా రూంలోకి రాకుండా హాలులోనే పక్కేశారు. గుండెల్లో పొంగుకొస్తున్న బాధతో దుఃఖం తన్నుకొస్తుంది. ఆరోజు మామధ్య జరిగిన సంఘర్షణ వల్ల నేనూ పట్టుదలగానే వున్నాను. బ్రతకాలన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది. ఎందుకొచ్చిన జీవితమనిపించింది. నిద్రపట్టలేదు సరికదా...ఆ ఒంటరితనం లో నన్ను భయపెడుతున్న దెయ్యం గుర్తుకొచ్చింది. ఆదెయ్యం ఇప్పుడొస్తే బాగుండుననిపించింది. కనిపిస్తే నేనే నా గుండెలపై కూర్చోబెట్టుకుని నా గొంతు నొక్కించుకుని.... ఈఇంట్లో నేను కూడా తనువు చాలించాలనే కోరికతో కూడిన విరక్తి భావం నిండిపోయింది నాలో.

    

    కానీ... ఎంతకీ రాదెందుకు ఏ దెయ్యమూ...? ఎంత పిలిచినా...ఎన్ని గంటలు నిరీక్షించినా...కళ్ళింతలు చేసి చూసినా కనిపించదెందుకూ...? ఎక్కడికి పోయింది ఆ దెయ్యం...? రోజూ వినిపించే సడులేమీ చేయదే...? నే పడుకున్న మంచం కదలదెందుకూ...? కప్పుకున్న దుప్పటి లాగదెందుకూ....? ఎంతకీ నన్ను కనికరించనే లేదు. కనిపించకుండానే...చనిపోవాలనే నాకోరికను చల్లార్చేస్తూ... చూస్తుండగానే తెల్లారిపోయింది. 


    నాకప్పుడు తెలిసినదేమిటంటే....భయమనేదే మనల్ని తెలీకుండా వెంటాడే నీడ లాంటిదే. దాన్నే సందర్భాన్ని బట్టి ఎన్నోరకాలుగా ఊహించుకుంటూ ఉంటాము. 


    నిజమే కదా...ఈ ఇంట్లో కొచ్చిన కొత్తలో.. ఎన్నో శుభాలుతో ఎంతో సంతోషంగా ఉంటూ మంచినే చూసాము. అప్పటి వరకూ ఎప్పుడూ కనిపించని దెయ్యాలూ భూతాలూ...చుట్టు పక్కల వారి మాటలు విన్నాకా ...నాలో కలిగిన భయం వల్లే...ఏదో భ్రమతో మా ఇంట్లో ప్రేతాత్మని సృష్టించుకుని అనవసరంగా భయపడ్డాననిపించింది.


    ఇప్పుడు నిర్భయంగా చెప్పగలను.... ఈ దెయ్యాలూ.. భూతాలూ అనేవి వట్టి ట్రాష్ అని. మనసు బలహీనపడితేనే మనం పీల్చే గాలికూడా భారంగా అనిపిస్తుంది. మన నీడ మనల్నే తరముకొస్తూ...అగాథంలోకి తోసేస్తూంది. ఎవరో ఏదో చెప్పారని...వాటిని ఊహిస్తూ మనలోని ధైర్యాన్ని చంపుకుంటున్నాము. 


     నిజం నిలకడ మీద తెలుస్తుందనడానికి ఇలాంటి అనుభవాలకి కూడా సరిపోతుందేమో...


    ఆ(మా)ఇంట్లో యే ప్రేతాత్మా లేదు.

    మేమైదుగురుం మాత్రమే...!! *


          ****      ****      ****

     

     

     Rate this content
Log in

More telugu story from శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Similar telugu story from Horror