విజయదశమి
విజయదశమి
అమ్మా దుర్గమ్మతల్లీ స్వాగతాలు నీకు స్వాగతాలమ్మా,
జగములేలేటి జగద్జనని జగదీశ్వరి వందనాలమ్మా నీకు పాదాభివందనాలమ్మా.
పసిడి చామంతులతో నీకు
పూజలు చేయను లేను,
నా హృదినే పసిడి కోవెలచేసి నిను స్వాగతించెదనమ్మా,
వేదమంత్రములతో
నిను ఆరాధించలేను
నీ అపురూపభావనను మనసున దాచుకుందు నేను,
కల్పతరువులను నేను కాంక్షించలేను
నీపాదపద్మముల చెంత సుమమై నిలిచే వరమే కోరుకుంటాను,
సుఖశాంతుల వెతుకులాట
మాకేలనమ్మా
మదిని చల్లబరచు
మా ఆనందం నీవేకదమ్మా.
నవరూపుల అవతారాలతో
గుండెగూటికి చేరావు
గుండె
లయలవాణిగా
మాలో నిలిచిపోవమ్మా,
మహిషాసుర మర్దినిగా
పూజలందుకునే జనని
మహిలోని అసురతను తొలిగించవేలనమ్మా,
అన్నపూర్ణేశ్వరి మాత
లోకాన ఆకలిచావులు లేకుండా చేయవమ్మా,
జ్ఞానసరస్వతిదేవి
ధర్మము పాటించని
కామక్రోధ స్వార్ధ అహంకారాల
అజ్ఞానము మాకేలనమ్మా,
విశ్వశక్తిమాత లక్ష్మీదేవి
ప్రేమసిరులతో జగతి నింపవేమమ్మా,
మా ఆవేదనలు తీర్చేటి అమ్మవు నీవై
సత్యమేదో అందించి
బ్రతుకు ధన్యత చేకూర్చవమ్మా.
నమో భవానీ మాత
నమస్తే నమస్తే,
నమో శుభకరిణి దేవి
నమస్తే నమస్తే.