నాన్న లందరూ అంటే
నాన్న లందరూ అంటే
నాన్నలందరూ డబ్బుల చెట్లే
చెమట వేర్లు విస్తరింప చేస్తూనే ఉంటారు నేలలోకి
పైకి మాత్రం పూతతో కాతతో పచ్చగా
అందరూ ఆశపరులే హైబ్రిడ్ కావాలనుకుంటారు
విరగ కాయడానికి ఎన్ని అంట్లు కట్టుకున్నారో
ఈర్ష్యాపరులు ఎందరు కొమ్మలు విరిచినా
తిరిగి చిగురిస్తూనే ఉంటారు ధైర్యంగా
నాన్న ఓ డబ్బుల చెట్టు
నాడు చిల్లర పైసలు పంచితే ఆనందం
కొన్ని గల్ల డిబ్బిలో దాక్కునేవి
నేడు నోట్లు పంచినా తృప్తి పడే సందర్భాలు తక్కువే
నాన్నలు పడే తలనొప్పులు పట్టవు
తమ కోర్కెల కొర్రాయిలతో పెడతారు వాతలు
నాన్నలు స్వార్థపరులు
చేయాలనుకుంటారు పంటంతా ఇంటికే పరిమితం
చిందించే చెమటంతా 'పిల్ల' కాలువల కోసమే
పూతతో అలంకరించి
కాతతో కడుపు నింపాలనుకుంటారు
కుటుంబ కులాసాలతో నిద్రిస్తారు తృప్తిగా
తెగ జాగ్రత్తపడతారు జేబులకు చిల్లులు పడకుండా
కొన్నిసార్లు సర్దుబాటు చేయలేక సతమతం
నాన్నలు పిసినారులు తమ కోసమైతే
సర్దుబాటు మనస్తత్వాలే వారి మతలబు
మనసు చిరుగులు, మరకలు దాస్తారు జాగ్రత్తగా
పిల్లలకు ప్రేమ పంచుతారు గంభీరంగా
ఇంటిల్లిపాది సంతృప్తి వారి ముఖంలో కళ
నాన్న డబ్బుల చెట్టుకు అమ్మలు తోడయ్యారు
వేడినీళ్లకు చన్నీళ్లలా గతం
వాకిట్లో ఒకరైతే పెరట్లో మరొకరు నేడు
ఇల్లంతా చల్లని నీడ ఇచ్చేందుకు
చదువులు, ఉద్యోగాలలో కలుపుతున్నారు చేతులు
