వాళ్ళు తప్పిపోయారు
వాళ్ళు తప్పిపోయారు
చెత్త కుప్పల దగ్గర ప్లాస్టిక్ బాటిళ్ళ శబ్దంలో
మురుగు కాల్వల సావాస పయనంలో
వాళ్ళు తప్పిపోయారు
ఎవరు వాళ్లూ అని అడిగితే
నేను కొన్ని గుర్తులు చెబుతాను
కంటి చూపులో చురుకుదనం
వెనుక తమ కంటే పొడవైన గోతాం సంచీ
పనికిరావని పడేసిన వాటిని వెతుకుతూ
తమకు దొరికిన వాటికి మురిసిపోతూ
వాటితో ఆ రోజు భోజనాన్ని వెలకట్టేస్తూ
అలా అలా ముందుకు సాగుతుంటారు
మళ్లీ మళ్లీ ఏదో వెతుకుతూ ఉంటారు
ఉతికిన బట్టలు చెదరని క్రాఫుతో
బడికి వెళ్ళే పిల్లల్ని చూసి ఆగిపోతుంటారు
ఏదో మీమాంస
మళ్లీ అదే వెతుకులాట
రోజూ కనిపించేవాళ్లు
ఈ మధ్య కనిపించట్లేదు
ఆకలి బాధ వారిని ఏం చేసిందో
ఏ ఆపన్న హస్తం అయినా వారిని తాకిందో
ఏమో
లేక మీలాగా నాలాగా
ఈ సమాజంలో వాళ్ళు తప్పిపోయారేమో
#SMBoss
