ఉగాది
ఉగాది
పసిడి రంగుల కిరణాల తోరణమై మెరిసింది ఉగాది
మావిపచ్చ చిగురాకుల దీవెనలా విరిసింది ఉగాది
ఎలకోయిల గుబురులో కూసినదో జ్ఞాపకమూ
కోయననీ భాగ్యాన కన్నీటిన పొగిలింది ఉగాది
నిరంతర అన్వేషణ సత్యముకై చింతనెపుడు
మదిహృదిలో అవమానము చిలికింది ఉగాది
ఆరు రుచుల ఆస్వాదన కష్టసుఖముల పరిభాష
నిత్యము చేదుగుళిక ఆహారమై హసించింది ఉగాది
మానవత్వం అడుగంటిన మాటలకు మౌనముగా
మనసులోని తడికోసం
తపించింది ఉగాది
క్రోధమైన ఖేదమైన కరకు రాతి గుండె నైన
ప్రేమతో పలకరించి తరించింది ఉగాది
