స్వేచ్ఛ
స్వేచ్ఛ


ఉంది ఉంది
స్వేచ్చ #స్వాతంత్రం ఉంది,
ఎందుకు లేదు,
ఆడపిండమని తెలియగానే,
కడుపులోంచి బలవంతంగా బయటకు
లాగి మురికి గుంటలో గిరాటేసేంత..
ఒకవేళ బ్రతికి గర్భం నుండి బయటికొచ్చినా,ఆడపిల్లని
ఏ అర్ధరాత్రి తాగినమైకంలో బండకేసి కొట్టి తొడకొట్టేంత..
చదువు పేరిట భయపడి శరీరాల్ని తడుముతూ,ఏం చేస్తున్నారో తెలియని వయసులో శరీరాన్ని మౌనంగా అప్పగించేంత..
ప్రేమాదోమా అంటూ పరాయోణ్ణి ప్రేమించినా పరువుపేరుతో కన్న ప్రేగు సైతం పీకనులిమి
పాశవికంగా చంపేటంత..
ఆ పరాయోణ్ణి,నే నచ్చకపోయినా వెంటబడీ వేధించీ,మొహం మీద యాసిడో,మెడమీద సుతారంగా వేటకొడవలి కత్తిగాట్లో పెట్టించుకునేంత..
సినిమా,టీవీ ఆశజూపి
మోసపెట్టి గంటకింత, రోజకింత అని లెక్కలేసి,
శరీరాన్ని పరుపు చేసి బురదపందులను మీదపడి దొర్లించుకునేంత..
ఖర్మకాలి ఉద్యోగానికెళ్ళినా కొలతలు చూస్తూ కోరికలు తీర్చమనే బాసుగాడి కామవాంఛను ఉదరపోషణ నిమిత్తమై ఏ లాడ్జి గదిలోనా వాయనంలా చేతుల్లో అప్పజెప్పేంత..
కట్టుకున్న మొగుడే కాలయముడై అనుక్షణం అనుమానిస్తూ, తీవ్రమై,ఏదో ఓరోజు ఒంట్లో ఒక్కోక్క భాగాన్ని ముక్కలుముక్కలుగా నరికీ,ఊరికో ముక్క పడేసి మీసం తిప్పుకుంటేనంత..
కన్నకొడుకులూ,కుటుంబం దూరం చేస్తే లోకపురుషులు అభ్యుదయ ముసుగులో ఒంటరిమహిళావకాశం అందిపుచ్చుకొని చిత్తకార్తె కుక్కల్లా తమ లైంగికానందం తీర్చుకునేంత...
ఎందుకు లేదు
ఉంది బాగా ఉంది ,
ఈ దేశంలో బాగా బహుబాగా
స్వేచ్ఛ ఉంది..స్వేచ్ఛ ఉంది..!