సంతోషం
సంతోషం
సంతోషపు చిరునామా
తెలుసుకోవాలనుకున్నాను,
భోగభాగ్యాల నిలయంలో
అనురాగం వెతికేటి
శోకాన్ని చూసాను,
ప్రకృతి అందంలో
సంతోషం వుందనుకున్నాను
కదిలే కాలం చెప్పిన గాయపుమాటలు విని వెనుతిరిగాను,
వలచిన ప్రేయసి పిలుపులో
సంతోషం వెతికాను
కోర్కెల చిట్టాను చూసి
భయపడి పోయాను,
కమ్మని రుచులే సంతోషంగా
భావించాను
అనారోగ్యపు హెచ్చరికలతో
మనసు మార్చుకున్నాను,
శిలపైనున్న శివయ్యను
సంతోషపు జాడ చెప్పమన్నాను,
మురికి మనసు మాటలు
శివయ్యను చేరలేవని తెలుసుకున్నాను.
మరి......
సంకటాలను స్వాగతించే ఆత్మశక్తి నన్ను నాలోనే చూడమని చెప్పింది.
వెతల మనసులోని దుఃఖానికి
సంతోషపు జాడ చూపమంది,
వింతవింత కోర్కెలతో
ఆనందానికి దూరం కావొద్దని
హృది హెచ్చరిస్తుంది,
కలవరపు కంటిచెమ్మ
అనారోగ్య హేతువని తెలిసింది.
విశ్వప్రేమను స్వాగతిస్తూ
మన బ్రతుకే కాదూ
ప్రతి ఒక్కరి బ్రతుకులో
సంతృప్తితో వుంటేనే సంతోషం చూడవచ్చని తెలుసుకున్నాను,
మానవత లేని
మనసు అహంకారం
సంతోషం కాదని తెలుసుకున్నాను,
పేదోడి శోకాలు వినలేని పెద్దోళ్ళకు
పున్నమి వెన్నెలే శాశ్వతం కాదనే సత్యం చెప్పాలనుకున్నాను,
సిరులతో కొనలేని సంతోషాన్ని
అనురాగపు ఆత్మీయతలో
చూడమంటాను,
ప్రపంచ ప్రజల సoతోషం
శాంతి సహకారం సౌబ్రాతృత్వంతో పెనవేసుకుందని
అర్ధం చేసుకున్నాను,
ప్రతి ఒక్కరి సంతోషంలో
మన సంతోషం చూడమంటున్న విశ్వవేదిక (ఐరాస)కల
నిజం కావాలని కోరుకుంటున్నాను
