శివోహం
శివోహం
హిమవన్నగ ఒడిలో నెలకొన్న
పంచాక్షరీ మంత్ర స్వరూపం..
ఆ నామజపం అణువణువునా
పులకింతల ప్రకంపనం ..
ఆ నామస్మరణం నిత్యం
ప్రవహించే పరవశాల తరంగం..
జీవనదీ ప్రవాహమై భక్తుల
మదిలో నిలచిన ప్రణవనాదం..
రాగద్వేషాలకు అతీతం
ఆ చిదానందుని స్వరూపం..
కాలాన్ని సర్పంగా ధరించి
జగాన్నేలే జంగమదేవర ఆ రూపం..
మారేడు దళంతో ముచ్చటపడి
భక్తుల జలాభిషేకానికే బంధీ ఆ నిరాకారం..
కపటాలను తొలగించి
మలినాలకు మర్మమై
దారిచూపే కర్మయోగి
గరళకంఠుడు అతడు..
అందుకే..అయ్యాడు..
ముల్లోకాలేలే ముక్కంటి,
సర్వేశ్వరుడు ,పరమేశ్వరుడు..
సర్వం శివమయం..
సమస్తం శివోహం..
