సాహసమనే చెప్పాలి
సాహసమనే చెప్పాలి


నిజం గెలిచినప్పుడు
చప్పట్లు కొట్టే చేతుల్ని దాటి
ఆ నిజాన్ని గెలిపించడానికి
కాలిన చేతులు
కాల్చబడిన హృదయాలు
మార్చబడిన రాతలు
ఇవన్నీ చూడాలని
ఒంటరిగా బయలుదేరాను
ముందుకు వెళ్లే కొద్దీ
లెక్కపెట్టలేనన్ని చేతులు
తల మీద కొట్టుకుంటూ
శాపనార్థాలు పెట్టుకుంటూ కనిపించాయి
ఆప్యాయంగా ఆ చేతుల్ని తాకాలని
ధైర్యం చెప్పాలని
చాలా ప్రయత్నించాను
అంతలో చీకటి కమ్ముకుంది
అబద్ధం మళ్లీ దాడి చేసింది
నేను పరుగెత్తాను
తప్పించుకోవడానికి కాదు
పోరాడడానికి
నాకోసం
నీకోసం
మనందరి కోసం
కానీ
నాలో శక్తి సన్నగిల్లుతోంది
నిజానికి సంకెళ్లు బిగుసుకుంటున్నాయి
నేనా చేతుల కోసం చూస్తున్నాను
తిట్టుకుంటూ
శపిస్తూ
అన్యాయాన్ని చూసి వెనక్కు తగ్గిన వారి చేతులు
కొన్నైనా రాకపోవా అని
మార్పును ఆశించడం
సాహసమనే చెప్పాలి