రైతన్న
రైతన్న
అప్పటిదాకా ఉక్కపోత అనే జైలులో బంధించబడినట్లున్న ప్రాణం,
సన్నని వాన తెర వచ్చి పలకరించాక
వెలుతురు తగ్గిపోతున్న సమయాన నేనున్నానంటూ వచ్చిన మట్టి పరిమళపు వాసనలు ముక్కుకు సోకేసరికి మనసు పురివిప్పిన నెమలిలా నాట్యమాడింది
చల్లని గాలి స్పర్శకు నా మనసు తేలికపడింది.
చినుకు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న నైట్ క్వీన్ పరిమళాలను వెదజల్లుతూ విచ్చుకుని గాలికి తలూపుతూ పరిసరాలను మత్తులోకి నెట్టింది
మా ఇంటి పైకప్పు నుండి చూరు మీదుగా ముత్యాల్లా రాలుతున్న నీటి చుక్కలు మీద సంధ్యా దీపం కాంతి పడి ఇంటి చూరుకు ముత్యాల దండలు కట్టినట్లు మిలామిలా మెరుస్తున్నాయి.
భూమాత దాహర్తిని తీర్చుకోడానికి ఆత్రుత పడుతున్న బాటసారిలా వాన చినుకుల్ని చప్పరిస్తోంది
ఆకాశంలో నల్లమబ్బులు తాము ఒలకబోసుకున్న, నీటికై తెల్లమొహాలు వేసుకుని భూమివైపు చూస్తున్నట్లున్నాయి
అప్పుడే ఇంటిముఖం పట్టిన తీతువు పిట్ట ఒంటరిగా పాడుకుంటూ, తలమీంచి ఎగురుతూ ఇంటిముఖం పట్టింది
పుడమి గర్భంలో తలదాచుకున్న క్రిమికీటకాదులు ఆనందంతో పరవశించి పాడుతున్నాయి
తొలకరి కోసం ఎదురుచూస్తున్న రైతన్న ఆత్రుతగా ఆకాశం వైపు చూస్తూ పడబోయే వర్షాన్ని కళ్ళతోనే అంచనా వేస్తున్నాడు.
చల్లని పరిమళపు గాలి తెమ్మెరలకోసం
అందరూ ఎదురుచూస్తూ ఇంటి అరుగుల మీద కబుర్లలో పడ్డారు.
