బంగారు మనసులు
బంగారు మనసులు
ఒత్తుగా, ఏపుగా పెరిగిన పంటచేలో
ఒకపధ్ధతి ప్రకారం వంగి పంటకోస్తూ,
నవ్వుల తుళ్ళింతలతో పనులు చేస్తున్న మహిళా కూలీలు
రంగురంగుల చీరల్ని అందంగా కట్టి,
అలుపు సొలుపు లేకుండా పనిచేస్తూనే ఉన్నారు
మహిళాశక్తికి మారుపేరుగా,
స్వచ్ఛమైన వారి నవ్వుల వెనుక
ఎన్ని కష్టాలో, ఎన్నికడగండ్లో,
అయినా నోరుమెదపరు
రంగురంగుల పిట్టలూ, చిన్ని చిన్ని పిచ్చుకల గుంపులూ
వాళ్ళని ఆసక్తిగా గమనిస్తూ, మధ్యమధ్య ఒక్కో గింజని
ఏరుకొని తుర్రుమంటూంటే,
ఆ దృశ్యాన్ని వర్ణించతరమా
గాజుల గలగలలతో,
శ్రమను మరిచిపోడానికి తీసే కూనిరాగాలు
సంగీత ప్రవాహం లా సాగిపోతూంటే
చెట్లకొమ్మల్లో ఉన్న గూళ్ళల్లోంచి
పిల్లలు కువకువ మని శబ్దాలు చేస్తూ తల్లుల్ని పిలుస్తూ
అల్లరి చేస్తున్నాయి, పంట చేల వాసనలు ముక్కుపుటాలకు సోకుతుంటే
శ్రామిక మహిళల అందాలు ప్రకృతికే శోభనిస్తున్నాయి
కూలీ డబ్బులకు పేచీ పెట్టకుండా
చల్లని మనసుతో పనిచేసే
బంగారు మనసున్న మనుషులు వాళ్ళు
