ప్రళయగర్జన
ప్రళయగర్జన
ప్రళయగర్జన
మనిషి ప్రకృతికి చేటు తెచ్చి
పర్వతాలను నుగ్గుచేసి నూర్చి నూర్చి
నదుల దారులు మళ్ళించి హుంకరించి
సర్వమును నాశము చేయుచు నడిచి
తాను విజేతనని తలిచి తలిచి
సాధించిన దేమిటి?
వనములను తగుల బెట్టుచు
సాగరములను కలుషితము చేయుచు
సైకత రాశులను త్రవ్వి పోయిచు
పుడమిపై పచ్చదనము హరించి వేయుచు
తాను విజేతనని నవ్వు కొనుచు
సాధించిన దేమిటి?
వేడి గాడ్పులు సెగలు కక్కుచుండ
అవని యగ్ని గోళమై యదురుచుండ
ఋతువులన్నియు గతి తప్పుచుండ
పంచ భూతాలు విలయతాండవ మాడుచుండ
ప్రకృతి ప్రళయ గర్జన చేయుచుండ
మిగిలిందేమిటి?
భవిత శూన్యమైపోవ
ప్రాణవాయువు తరిగిపోవ
శుద్ధజలములు కరువైపోవ
జంతుజాలము మాయమైపోవ
ప్రజలలో భయము పెరిగిపోవ
మిగిలిందేమిటి?
అన్నదాతల యాక్రాందనలు
మిన్నుముట్టగ నాక్రోశములు
పెచ్చు పెరిగిన నాత్మహత్యలు
అదుపుతప్పిన శాంతి భద్రతలు
అలసత్వంతోనుండెడి నాయకులు
మిగిలిందేమిటి?
మనిషి వికృతి చేష్టలు మానుకొంటే
పచ్చదనమును ప్రేమించియుంటే
నదులను శుభ్రము చేయుచుంటే
గిరుల నెప్పుడు కాపాడు చుంటే
వసుధ చల్లగ నిలిచియుండ
సక్రమంగా ఋతుచక్రము సాగుచుండ
మానవాళికి శుభము కలుగు
జీవరాశికి జయము కలుగు.
