ఒంటరి నీడ
ఒంటరి నీడ


నిన్నటి నవ్వులలో ఆ గాజుల గలగలలు.....
సరాగాల పదనిసలో సయ్యాటాడినవేళ....
సంపెంగపు గుభాళింపుల సెలయేటిలో విహరించిన ఇరువురి జత హృదయాలు...
చల్లని వెన్నెల ఒడ్డున పిల్లతెమ్మరలతో.... గుసగుసల ఊసులాడిన వైనం.....
చిత్తరువై ఆమెను అచ్చేరువొందెలా చేసిన ఆ సాంగత్యం......
గుండెల సుమగంధాలను తన పాపిట అందంగా దిద్దిననాడు..
తనెప్పుడూ అనుకోలేదేమో అది నువ్వున్నంతవరకె అని....
సంధ్యవేళ ఆ ఎర్రని సూరీడువై తన నుదుటన ఒదిగావని అనుకుని ఉంటుంది........
కానీ......
చీకటిని తనకొదిలేసి చితిలోకి వెళతావని కలలో కూడా అనుకుని ఉండదు....
వెళ్ళొస్తానని వెళ్లినట్టు వెళుతూ వెళ్తూ....
పొరపాటున వెళ్తున్నా అని అన్నావేమో...
నిన్నటి నవ్వులన్ని తననే చూసి నేడు వెక్కిరిస్తున్నట్టు....
సింధూరపు రాగాలన్నీ కన్నీటి ముత్యమై రాలిపడి పోయావెందుకని ఆక్రోశిస్తుంటే....
వెయ్యేళ్ళ బంధము కాస్తా.....
వెన్నెల జతతో వెళ్లిపోయే....
నిన్నటి నవ్వులు నేడు రంగు వెలసిపోయాయేమో......
సమాజపు దారుల్లో మౌనంగా నడుస్తోంది.....
సంపెంగపు సువాసనలు గుబాలించే తన మేను....
దూపపు పొగలో కలిసి మేఘాలను తలపిస్తోంది...
గుప్పెడు మల్లెలు గర్వంగా ఒదిగే ఆ వాలుజడ కళ్ళు మూసుకుపోయి ముడుచుకు పోయింది....
జతగా తిరిగిన ఆ గగనవీధుల్లో తప్పు చేసినదానిలా తలవంచుకు వెళుతోంది!!
సౌభాగ్యం జారిపోయిన నాడు వైధవ్యం నేనున్నానని ఆమెను ఆక్రమించుకున్న వేళ.....
తొణకని కుండలా తన గమ్యానికై అడుగులు వేస్తే......
బీటలు వారిన సమాజపు గోడల్లో నుండి కొన్ని విశృంఖల శిరస్సులు వేటకుక్కల్లా... చూస్తున్నాయి
కట్టుబాటుకు తల వంచిన ఆ మహోన్నతం కట్టిపడేస్తున్న మృగాల చూపులకు కుచించుకుపోతుంది....
కలత పడే హృదయానికి కామాంధుల మాటలు తూటాలై తాకుతుంటే.... జతగా లేవని వెక్కిళ్ళ మధ్య వేదన చెందుతోంది....
పచ్చని ప్రకృతిలా తుళ్ళిపడే ఆమె ఎండమావి కొమ్మలో కోయిలలాగా విషాదపు గేయాలు పాడుకుంటూ........
కన్నీటి కడలిలో ఇరువురి ప్రతిరుపాన్ని చూసుకుంటూ ఒంటరి నీడై పడిలేచిన కెరటంలా సాగిపోతూనే ఉంటుంది.....