నాలో నిజం....
నాలో నిజం....


నా ఆలోచనలు ప్రయాణిస్తున్నాయి
స్వేచ్ఛ విహంగాల్లా......
ఆకాశం అంచుల వెంట వెడుతూ......
జాబిల్లిని ఒడిసిపడుతూ.....
మేఘాల మంతనాలలో......
ముచ్చట్లను కూడబెడుతూ....
గగనవీధులలో విహంగపు వీక్షణ చేస్తూ......
అంతరంగపు మనోఫలకాన్ని పుస్తకంలా పరుస్తూ....
నన్ను నేను కొత్తగా చూసుకోవాలని
నా అడుగులు నేనుగా వేయాలని....
నాలో ఉన్న కొత్త మనిషికై అన్వేషిస్తున్నాయి....
నిన్నటికి ఈరోజుకు నేనెక్కడున్నానని కాదు!
ఈరోజుకు రేపటికి మధ్య ఎక్కడుంటానని కాదు!
ఈరోజు నేను ఏమిటి అనే ప్రశ్న మనసుపోరల్లో గద్దిస్తోంది.
మూర్తీభవించిన మౌనంతో నేనుంటే
నిజమో అబద్ధమో తెలియని శూన్యంలో కప్పుకున్న అజ్ఞానపు పొరను వలిచేస్తూ....
చెట్టు పుట్టల్లో తిరిగిన నాడు విరిసిన నా పువ్వుల నవ్వులను ఏరుకుంటూ......
ఆటవిక సమాజంలో తెగిపోయిన నా స్వేచ్చా వాయువులను పీల్చడానికై....
చెదిరిన కలలో మిగిలిపోయిన ఆశయాలను వెలిగించాలని.....
విప్లవ జ్వాలల్లో విల్లును పట్టిన నాలోపలి మనిషి
కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యునిలా ఒంటరి పోరాటం చేస్తూ...
ఎగసిపడే కార్చిచ్చుల అంబులపొదిలో మొలిచిన
అగ్నికీలలను మస్తిష్కపు అస్త్రాలుగా మార్చేస్తూ...
అరునవర్ణపు భానుడి సాక్షిగా....
కవనాల రుద్రభూమిలో అడుగులేస్తున్నా.....
అగ్నికణంలా వెలిగిపోవాలని నన్ను నేను కొత్త పేజిగా మలచుకుంటూ జ్వలిస్తున్నా.....
అక్షరాల కక్ష్యలో భ్రమణం చేస్తూ....
రేపో.... మాపో....
నీకో.... మరెవరికో.... చెప్పకనే చెబుతున్నా!!
నాదారులు నొక్కిపెట్టినా నెట్టుకొని వస్తా....
నిజాన్ని నిజంగా చూపిస్తా....
నాలో ఉన్న నిజమైన మనిషిని నీముందు ఆవిష్కరిస్తా......