మధురవళి
మధురవళి
మనసుతెర ఙ్ఞాపకాల
ప్రతిబింబాలేవో నిలిచెను
గుర్తుచేసిన ప్రతీసారీ ముదములేవో కలిగెను
హృదయలోగిలి దాగిన గత గాయాల అలలెన్నో
మరపుతీరం చేరలేక అలజడులేవో రేగెను
పసిప్రాయపు బేలతనము నేడైనా వీడలేదు
ప్రతిబింబపు ఛాయలోనీ మార్పులేవో తెలిసెను/
ఆటపాటల విందులతొ గడిచిపోయెను బాల్యము
జతగాళ్ళు కూడి చేసిన అల్లరులేవో మిగిలెను
గుడ్డిదీపపు టెలుగులొ.. అమ్మ కుట్టు రంగుబట్టలు
ఇంద్రధనస్సు తోరణాలు మెరుపులేవో వెలిసెను
మూటనెత్తి నెత్తుకొని ఊరు వాడ దారుల్లోన
నాన్న తిరుగాడిన నడకలా జాడలేవో చెదిరెను
పుట్టి పెరిగిన పల్లెతల్లి కొత్తకోక కట్టుకొనెను
ఆధునికత పులుముకొనగ స్వచ్ఛములేవో తరిగెను
ఒదిగి ఎదిగిన బతుకుచిత్రం .. భవ్యమైనదో కాదో
ఎద వేదన సొదలనడుగ భారములేవో తెలిపెను
బింబ ప్రతిబింబ దృశ్యసంపుటికి మనసు మురిసెనా
'మధు'రవళి
హృదయఘోష యథార్థములేవో పలికెను

