వెలకట్టలేని ఆస్తి
వెలకట్టలేని ఆస్తి
అస్పష్టమైన అతని చూపులో
వేలటన్నుల బాధలు ఓర్చిన
తీక్షణత కనిపిస్తుంది...!!
అతను దర్శించిన జీవితానికి
అక్షర రూపం ఇస్తే కలంలో సిరా కాలువకట్టాల్సిందే...!!
అరిగిన ఆ పాదాలు
జీవన ప్రయాణం లో
వేల మైళ్ళు సాగి అలసటచెంది
సేదతీరినవి...!!
నాడు మెలితిప్పిన మీసం,
ఎడతెరిపి లేకుండా
కురిసిన కష్టాల జడి వానకు
తడిసి నెరిసింది...!!
నేడు రోషం తగ్గిన మీసం,
మాసిన గడ్డం
గతవైభవానికి
సాక్షిీభూతంగా మిగిలే ఉన్నాయి...!!
వెలకట్టలేని ఆ విలువైన ఆస్తిని
విలువ తెలియని వ్యక్తులు వద్దునుకున్నారేమో...!!
పేరుకు నిరక్షరాస్యుడే కాని
సర్వం తెలిసిన జ్ఞాని...!!
తను నేర్చుకున్న జీవితపాఠాలు
అతను మోములో కనిపిస్తున్నాయి...!!
అతనిని విస్మరిస్తే
చరిత్రహీనులుగా మిగిలిపోతాం...!!
రేపటి బాటసారులు దారితప్పి
గమ్యం చేరని మజిలీ లో
ఒంటరిగా మిగిలి పోతారు...!!

