నేరం
నేరం


నది మదిరొదను వినగల్గి, ఎదలయతో శృతి కల్పి
నది ఒడిలో... జతకలిసి జలకాలాడితే
నది పాద మంజీరాల గలగలలను
పల్లవిగా మార్చి పాటనే కూర్చగలిగితే
ధుని చరణాలకు స్వాగత గీతికలల్లి
ప్రవాహరాగంలో ప్రమోదగేయాలే పాడగల్గితే
తన పన్నీటితో నీ కన్నీటిని తుడిచి
బతుకు గాయాలను కడిగి పునీతం చేయదా?
ఉదధి చేరువరకూ కినుక వహించక
నీ కష్టాలను తనలోదాచి, ఉనికిని ఉవ్వెత్తునెగరేసి
తన అలలపై, నీ కలల తీరాన్ని చేర్చదా?
నీ జీవితాన్ని విరివనమై పూయించి మురిపించి
అందంగా సుగంధంతో గుబాళింపచేయదా?
స్వార్థపునాదుల్లో అత్యాశల మేడల్ని అడ్డంగా కట్టి
వనాల్ని చెరచి, కాంక్రీటు పిండాలకు పురుడు పోసినపుడే
అభివృద్ధి వ్యసనంతో నీ పతనం
మొదలైంది!
ప్రకృతిని వికృతంగా మార్చి, నీ ఆశలకు తార్చి
జనమూ, జలమూ,వనమూ కలిసుంటేనే
జీవనానికి సౌరభమనే మాటమరిచి...
ప్రగతి బాటన జగతినేలడానికి పయనమయ్యావే!
ప్రాణాలకు గాలి, దాహానికి నీరు
దేహం నిలవాలంటే పాదాలకు పృథ్వి
ఆసరా కావాలనే ధ్యాస, శ్వాస నొదిలేసి...
నేడుప్పొంగిన గంగను చూసి కుంగి, లొంగిపోయి
నీ వ్యథలను కథలుగా చెప్పుకుంటున్నావే!
ముప్పనీ, తప్పనీ, ముంపు తప్పదనీ తెలిసి
నది నడిచే దారుల్లో నగరాలే నిర్మించావే!
ఇదెవరి పాపం? ఎవరి ద్రోహం? ఎవరికి శాపం?
ప్రకృతి మీద కోపాన్నొదిలి, ప్రశాంత చిత్తంతో
నిర్మించిన స్వార్థవారధుల పునాదుల్ని పెకలించు
నిజాల్ని గ్రహించి, జీవన గమనాన్ని మల్లించి సుఖించు...