నేను
నేను
నేను...
ఇక్కడే ఈ క్షణాన్ని గుర్తు పెట్టుకుంటా
ఇక్కడి నుండి ఈ బతుకు దూరమెంతో ఊహించుకుంటాను!!
మొరటుదేరిన మెదడు నాళాల్లో
కరుడుగట్టిన గుండెలమీద ఈ జీవితం ఇస్తున్న ప్రశ్న పత్రాలకు నెత్తుటి అక్షరాలతో రౌద్రంగా సమాధానాలు లిఖించుకుంటా!!
ఒంటరి ప్రయాణంలో..నా ప్రపంచంలో...
ప్రభువుగా,పరమాత్మగా..
పట్టాభిషిక్తుడ్ని అవుతా!!
ఎన్ని అవమానాలకు ఈ జీవితాన్ని సిద్ధం చేయాలో...
ఎన్ని వెన్నుపోట్లకు ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలో..
ఎన్ని మోసాలకు తట్టుకునే సామర్థ్యంతో తయారుగా ఉండాలో...
ఎన్ని యేళ్ళు శ్రమ దోపిడీకి తల దించాలో...
ఎంత మంది తొక్కేవాళ్ళను తోసుకుంటూ పోవాలో...
మెదడుకు నిరంతర తర్ఫీదుని ఇస్తూనే ఉంటాను!!
అన్నింటికీ రెండు చేతులు చాచే ఉంటా!!
కాలం కురిపించిన కష్టాల కత్తుల వాన
కళ్ళ చుట్టూ..కంఠం చుట్టూ..కాళ్ల చుట్టూ
అసూయ.. ద్వేషాలతో..కుల వివక్షతో...
కుళ్ళు కుతంత్రాలతో...తిట్లు దీవెనలతో..
నను వెంబడించి విధించేందుకు అపార ప్రయత్నం చేసినా...నేను వీసమంత కూడా వెన్నుచూపి వెనుదిరగను
వివేకంతో...విజ్ఞతతో... సభ్యతతో సమాధాన శరములు సందిస్తాను
నా ప్రతి రోజుకు రాజును నేనే అవుతాను!!
