STORYMIRROR

HARIHARARAO MOJJADA

Classics

4  

HARIHARARAO MOJJADA

Classics

మా నాన్న..

మా నాన్న..

1 min
413

**మా నాన్న**


 చీకటికి పున్నమి వెన్నెల శ్వేతవర్ణాన్ని అద్ది ఆ చల్లదనంలో మమ్మల్ని నిదురపుచ్చే విశ్వకర్మ మా నాన్న..!


నిరుద్యోగపు రాకాసి చేసిన గాయాలను తట్టుకుని బ్రతుకు పోరాటంలో తాను నమ్ముకున్న ఇనుప ముక్కలకు నిత్యపూజలు చేస్తూ కుటుంబాన్ని అన్ని విధాలా గెలిపించే ఒలింపిక్ విజేత మా నాన్న..!


పేదరికపు వేటుకు.. వేర్పాటైన కుటుంబ బంధాలను కలగలిపి కలసి ఉంటే కలదు సుఖమని నమ్మిన సంధికుడు మా నాన్న..!


రెప్పల మాటున నిద్దుర మానుకుని గడియారం మూడు ముల్లతోనూ పరుగులు పెట్టి రెక్కల చాటున కష్టాన్ని నమ్ముకుని మా ఆకలి తీర్చిన అన్నపూర్నేశ్వరుడు మా నాన్న..!


కాలానికి మా నాన్నని చూస్తే ఒకింత జుగుప్స..మా పెంపకానికి విచక్షణా కిరీటమై..మమ్మల్ని చదువుల రారాజులను చేసి చిరిగిన చొక్కాలో..మురిగిన చెమట వాసనలో..నెరిసిన జట్టుతో..మరిగిన రక్తపు బొట్టుల కాయ కష్టంతో మంచి మనిషి అను కీర్తిని మూట గట్టుకున్న అపర కుచేలుడు మా నాన్న..!


ఎప్పుడో తెలుగులో చదివిన స్వర్ణకమలాలు పాఠంలో ఏడుకొండలు మాదిరి నలుపుగా ఉన్నా...ఆయన అంతరంగంలో మాత్రం తలెత్తి వందనం చేసేందుకు అర్హత ఉన్న హిమాలయ మారుతం పై ఉన్న జాతీయ పతాకంలాంటివారు మా నాన్న..!


మా బ్రతుకు పుస్తకాల లోని ప్రతీ పేజీ మా నాన్న యొక్క స్వేదపు "సిరా"తో రాయ"బడి"నదే..!

ఒక వ్యక్తిగా పొందిన గుర్తింపు..మంచితనం..ఆత్మ స్థైర్యం.. నీతి.. నిజాయితీలు...మా నాన్న నుంచి మాకు వచ్చిన సహజ గుణాలే..!


మా అభ్యున్నతి కోసం..మా నాన్న పట్టని పనిముట్టులేదు..చేయని చాకిరి లేదు..!

యాతం.. బొరిగి!

పార..పలుగు!

 మేడి..అరక!

సుత్తి... సేనం!

తాపీ.. బద్ద!

ఏ పూటకాపూట..ఏ ఎండకి ఆ గొడుగు కాస్తూ..నిత్య శ్రామికుడై ..మా పొట్టలు నింపుతూ..తన బ్రతుకు పోరాటంలోని "శ్రమ యేవ జయతే" అను సూక్తి సుధా సాగరాన్ని అందించిన అపర త్రిమూర్త్య స్వరూపం మా నాన్న..!


వైఫల్యాల డొక్కలు చీల్చి గెలుపును వేటాడే తీరని కసితో నను గెలిపించేందుకు మా నాన్న పట్టిన పలుగుపారలే మా జీవితపు జాతీయ చిహ్నాలు..!!


నాలో ఓర్పు నశించిన నాడు..

నాలో నమ్మకం సడలిన నాడు..నాన్న నమ్మిన శ్రమసాధనాలతో మాట్లాడతాను..నాన్నని మనసారా స్మరిస్తాను..!!


(మనలో ఎంతో మంది నాన్నలు...

మన కోసం వారు పడే కష్టం..తపనను దృష్టిలో ఉంచుకొని...మా నాన్నను జ్ఞప్తికి తెచ్చుకొని చేసిన చిన్న భావ కవితా..ప్రయత్నం ఈ వ్యాసం)


--

 హరి


Rate this content
Log in

Similar telugu poem from Classics